logo

Postal ballots: అందరి దృష్టీ పోస్టల్‌ బ్యాలెట్‌పైనే.. వైకాపాలో ఇదే గుబులు

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొనగా- ఈవీఎంల ద్వారా పడిన ఓట్ల కంటే, ఉద్యోగ, ఉపాధ్యాయులు వేసిన పోస్టల్‌ ఓట్లు మరింత కాకరేపుతున్నాయి.

Updated : 03 Jun 2024 08:47 IST

పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానికి వచ్చిన ఉద్యోగులు (పాతచిత్రం) 

న్యూస్‌టుడే, నెల్లూరు(కలెక్టరేట్‌): సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొనగా- ఈవీఎంల ద్వారా పడిన ఓట్ల కంటే, ఉద్యోగ, ఉపాధ్యాయులు వేసిన పోస్టల్‌ ఓట్లు మరింత కాకరేపుతున్నాయి. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములపై ఇవి ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అందరి దృష్టి వీటిపైనే నెలకొంది.

ఎన్నడూ లేనట్లు..

ఇటీవల కాలంలో.. ఏ ఎన్నికల్లో లేని విధంగా ఈసారి ఉద్యోగ, ఉపాధ్యాయ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు అత్యధికంగా పోలయ్యాయి. దీంతో వైకాపా అభ్యర్థుల్లో గుబులు రేగుతోంది. తమకు ఏమాత్రం వేశారోనన్న ఆందోళన వారిలో నెలకొంది. కారణం.. మెరుగైన పీఆర్సీ, డీఏల చెల్లింపు, సీపీఎస్‌ రద్దు వంటి కీలక హామీలను నెరవేర్చడంలో వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి విఫలమయ్యారు. పైగా అయిదేళ్ల వైకాపా పాలనలో ఉద్యోగ, ఉపాధ్యాయులను ముప్పుతిప్పలు పెట్టారు. వారి ఆర్థిక ప్రయోజనాలపైనా దెబ్బకొట్టారు. ఈ అసంతృప్తే.. వారిలో కసిని పెంచి.. భారీగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వేసేందుకు కారణమైందని పలువురు చెబుతున్నారు. 

ఇవే కారణమని..

స్వల్ప తేడాతో ఓడిపోతే.. ఉద్యోగ, ఉపాధ్యాయులే కారణమవుతారన్న చర్చ వైకాపా శ్రేణుల్లో జోరుగా జరుగుతోంది. నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గంతో పాటు ఎనిమిది నియోజకవర్గాల్లో ఉద్యోగులు, 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, పీడబ్ల్యూడీ పోస్టల్‌ బ్యాలెట్లు మొత్తం 25,846 పోలయ్యాయి. 
నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో ఏకంగా 5,405 ఓట్లు నమోదు కావడంపై చర్చ నడుస్తోంది. తెదేపా అభ్యర్థికే ఎక్కువ పడ్డాయన్న ప్రచారం జరుగుతోంది. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఓట్లతో పాటు వారి కుటుంబ సభ్యుల ఓట్లపైనా ప్రభావం ఉంటుందన్న మాట వినిపిస్తోంది. అదే సమయంలో ఎన్నికల ఫలితాలపై పందేల జోరు తారస్థాయికి చేరింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు