logo

Nizamabad: మహిళా క్యాంటీన్లు.. ఐదు చోట్ల ఏర్పాటుకు సన్నాహాలు

బీబీబీ మహిళలను లక్షాధికారులుగా చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాలు తీసుకొని చిన్నపాటి వ్యాపారాలు కొనసాగిస్తున్న స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది.

Updated : 24 Jun 2024 08:55 IST

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ కలెక్టరేట్‌: మహిళలను లక్షాధికారులుగా చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాలు తీసుకొని చిన్నపాటి వ్యాపారాలు కొనసాగిస్తున్న స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వారితో క్యాంటీన్లు పెట్టించాలని భావిస్తోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఐదింటిని ఏర్పాటు చేయాలని లక్ష్యం విధించారు.

జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 23,780 స్వయం సహాయక సంఘాలు ఉండగా ఇందులో 2,51,104 మంది సభ్యులున్నారు. సంఘాల అర్హతను బట్టి రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఏటా బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తున్నారు. తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లిస్తే మళ్లీ ఇస్తారు. దీంతో పాటు ప్రభుత్వపరంగా క్యాంటీన్లు ఏర్పాటు చేసి వీటిని మహిళా సంఘాల సభ్యులకు కేటాయించాలని సర్కారు ఇటీవలే నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో మంత్రి సీతక్క చేతుల మీదుగా క్యాంటీన్‌ను ఇటీవల ప్రారంభించారు. జిల్లాలోనూ వీటిని నెలకొల్పితే మహిళలకు ఇవి దన్నుగా నిలవనున్నాయి.

కార్యాచరణ తయారీలో..

జిల్లాలో ఈ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించేందుకు కార్యాచరణ తయారు చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు ఇటీవల సమావేశం నిర్వహించి ఆదేశించారు. అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. మహిళలు క్యాంటీన్లు నిర్వహించడంతో పాటు మీ-సేవ కేంద్రాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్లు, కస్టం హైరింగ్, కుట్టు కేంద్రాలు, పాడి పశువులు, పౌల్ట్రీ, సంచార మత్స్య విక్రయ ఔట్‌లెట్లు, మిల్క్‌ పార్లర్స్‌ ఏర్పాటు చేసేందుకు మండలాల వారీగా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఇప్పటికే మహిళా సంఘాల సభ్యులతో ఏకరూప దుస్తులు కుట్టించే కార్యక్రమం పూర్తయింది. ఆయా యూనిట్లు నెలకొల్పేందుకు అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు త్వరలోనే ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

స్థలాల కోసం అన్వేషణ

డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఐదు క్యాంటీన్ల ఏర్పాటు చేయాలనే లక్ష్యం ఉండగా అందుకు అనువైన స్థలాలు ఎంపిక చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ఉండే కలెక్టరేట్‌తో పాటు ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.

త్వరలోనే ఏర్పాటు చేస్తాం

మహిళా సంఘాలకు క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలు ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చాయి. జిల్లాలో ఐదు చోట్ల నెలకొల్పేందుకు అనువైన స్థలాలు చూస్తున్నాం. అవి గుర్తించగానే అర్హులైన మహిళా సంఘాలను ఎంపిక చేసి నిర్వహణ బాధ్యత అప్పగిస్తాం. ఇతర యూనిట్లను సైతం నెలకొల్పి మహిళలను మరింత ఆర్థిక బలోపేతం చేస్తాం. సాయాగౌడ్, డీఆర్‌డీవో, నిజామాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని