logo

మింగిన ‘ఎరువు’ను కక్కించేదెప్పుడు?

మాక్లూర్‌ సహకార సంఘం అక్రమార్కులకు అడ్డాగా తయారైంది. అందినకాడికి దండుకొని అందకుండా పారిపోవడం వారికి నైజంగా మారింది.

Published : 20 Jun 2024 02:45 IST

రూ.70 లక్షల రికవరీలో అంతులేని జాప్యం
న్యూస్‌టుడే, మాక్లూర్‌

మాక్లూర్‌ సహకార సంఘం అక్రమార్కులకు అడ్డాగా తయారైంది. అందినకాడికి దండుకొని అందకుండా పారిపోవడం వారికి నైజంగా మారింది. అన్నదాతల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొందరు వ్యక్తులు అడ్డగోలుగా నిధుల దుర్వినియోగానికి పాల్పడినా..పట్టించుకునే వారే లేకపోవడం శోచనీయం. తాజాగా ఎరువుల అమ్మకాల్లో పెద్ద ఎత్తున డబ్బులు స్వాహా అయినట్లు ఆడిట్‌లో తేలినా రికవరీలో మాత్రం అంతులేని జాప్యం చోటు చేసుకుంటోంది. ఈ క్రమంలో సంబంధిత అధికారుల తీరుపట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సిబ్బంది బరితెగింపు

మాక్లూర్‌ విండో పరిధిలో 26 గ్రామాలకు చెందిన 5 వేల మందికి పైగా సభ్యులుంటారు. వారి కోసం గుత్ప, డీకంపల్లి, మాక్లూర్, కల్లెడి, గొట్టుముక్కల, చిక్లి కేంద్రాల్లో ఎరువులు అమ్ముతుంటారు. ఏడు నెలల క్రితం గుత్పలో రూ.28.34లక్షల ఎరువులు అమ్ముడు పోగా..ఇందుకు సంబంధించిన సొమ్మును సిబ్బంది బ్యాంకులో జమ చేయకుండా సొంతానికి వాడుకున్నారు. ఇక మరో ఐదు కేంద్రాల్లోనూ ఎరువుల అమ్మకాల్లో అవినీతి జరిగింది. మాక్లూర్‌లో రూ.16.17లక్షలు,. కల్లెడిలో రూ.11.50లక్షలు, డీకంపల్లిలో రూ.4.16లక్షలు, గొట్టుముక్కలలో రూ.3.06లక్షలు,    చిక్లిలో రూ.7.27లక్షలు దుర్వినియోగమైనట్లు ఆడిట్‌లో తేలింది. ఆరు కేంద్రాల్లో జరిగిన ఎరువుల అమ్మకాల్లో రూ.70లక్షలకు పైగా కుంభకోణం జరిగింది. మింగిన ఎరువుల డబ్బును ఈనెల 5లోగా చెల్లిస్తామని పాలకవర్గానికి సదరు సిబ్బంది మాటిచ్చారు. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా బ్యాంకులో జమ చేయకుండా బరితెగించారు. ఏంచేస్తారో..చేసుకొండంటూ దర్జాగా తిరుగుతున్నారు. వారి నుంచి రికవరీ చేయడంలో అధికారులు సైతం అంతగా శ్రద్ధ చూపకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

కఠినంగా వ్యవహరిస్తాం

అక్రమార్కుల విషయంలో కఠినంగా   వ్యవహరిస్తాం. ఎరువుల డబ్బులు దండుకున్న వారి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ  రికవరి చేస్తాం. సభ్యులు ఎలాంటి ఆందోళనకు లోనుకావొద్దు.

...అశోక్, విండో ఛైర్మన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని