logo

ప్రయోగాత్మకం.. విజయవంతం

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం స్వశక్తి మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పలు సంస్కరణలు తీసుకొస్తోంది.

Updated : 20 Jun 2024 04:53 IST

రాష్ట్రంలోనే మొదటగా కామారెడ్డిలో స్వశక్తి క్యాంటీన్‌
ఈనాడు, కామారెడ్డి

పర్యవేక్షిస్తున్న జిల్లా సమాఖ్య సభ్యులు

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం స్వశక్తి మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పలు సంస్కరణలు తీసుకొస్తోంది. స్వయం ఉపాధి పొందేందుకు గాను కలెక్టరేట్‌లతో పాటు ఇతరత్రా ప్రభుత్వ కార్యాలయాల్లో క్యాంటీన్‌ల ఏర్పాటును స్వశక్తి మహిళా సంఘాలకు అప్పగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కామారెడ్డి జిల్లా యంత్రాంగం రాష్ట్రంలోనే మొదటగా జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మూడు నెలల కిందట కామారెడ్డి కలెక్టరేట్‌లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ విజయవంతంగా నడుస్తోంది. ఈ స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కలెక్టరేట్‌లతో పాటు రాజధానిలోని సచివాలయంలో సైతం మహిళా సంఘాల ఆధ్వర్యంలో క్యాంటీన్‌ల ఏర్పాటును ప్రభుత్వం ప్రారంభిస్తోంది.

కలెక్టరేట్‌లో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్‌

జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో..

గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల ప్రోత్సాహంతో కలెక్టరేట్‌లో క్యాంటీన్‌ను ప్రారంభించి లాభాలు ఆర్జిస్తున్నారు. జిల్లా మహిళా సమాఖ్యకు చెందిన ఆఫీస్‌ బేరర్స్‌ నుంచి ఒక్కరు, ఈసీ సభ్యుల నుంచి మరొక సభ్యురాలు కలిసి క్యాంటీన్‌ నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. ఇలా వంతుల వారీగా రోజుకు ఇద్దరు సభ్యుల చొప్పున నిర్వహణలో భాగస్వాములవుతున్నారు. వీరికి మహిళా సమాఖ్య మేనేజర్, సిబ్బంది తోడ్పాటు అందిస్తున్నారు.

నూతన పథకాలకు స్ఫూర్తి

రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెడుతున్న పలు నూతన పథకాలకు కామారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ స్ఫూర్తిగా నిలుస్తోంది. గతంలో జిల్లాలో మొదటగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రారంభించిన చేపల పెంపకం ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అమలవుతోంది. మూడు నెలల కిందట వికారాబాద్‌ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు కామారెడ్డి జిల్లాలో పర్యటించి చేపల పెంపకాన్ని పరిశీలించి వెళ్లారు. ఇదే విధంగా స్వశక్తి సంఘాల మహిళలు ఇంటిపైనే సోలార్‌ యూనిట్లు ఏర్పాటు చేసుకుని సౌరవిద్యుత్తు ఉత్పత్తి చేస్తూ ఆదర్శంగా నిలిచిన విషయం తెలిసిందే. బీర్కూర్‌ మండలంలోని అంకోల్‌ క్యాంప్‌ మహిళలతో పాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన మహిళలు స్త్రీనిధి రుణాలతో సోలార్‌ యూనిట్లు ఏర్పాటు చేసి సొంతింటి అవసరాలకు వినియోగించుకోగా మిగిలిన విద్యుత్తును గ్రిడ్‌కు విక్రయించి లాభాలు ఆర్జిస్తున్నారు. వీటితో పాటు స్వశక్తి సంఘాల మహిళలు డ్రోన్‌లు కొనుగోలు చేసి క్రిమిసంహారక మందుల పిచికారీని సైతం మొదటగా జిల్లాలోనే ప్రారంభించారు. డ్రోన్‌ల వినియోగంపై జిల్లాకు చెందిన 60 మంది స్వశక్తి మహిళలు శిక్షణ తీసుకున్నారు. ఇలా పలు నూతన పథకాల ప్రారంభానికి కామారెడ్డి జిల్లా స్ఫూర్తిగా నిలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని