logo

భూముల విలువ పెంపుపై అధ్యయనం

భూముల మార్కెట్‌ విలువ సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లాలోని సబ్‌రిజిస్ట్రార్లు అధ్యయనం ప్రారంభించారు.

Updated : 20 Jun 2024 04:54 IST

మొదలైన సబ్‌రిజిస్ట్రార్‌ల కసరత్తు
ఈనాడు, కామారెడ్డి

భూముల మార్కెట్‌ విలువ సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లాలోని సబ్‌రిజిస్ట్రార్లు అధ్యయనం ప్రారంభించారు. ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఈ పెంపు ఉండాలని ప్రభుత్వం నిర్దేశించిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో భూముల వాస్తవ విలువలను సేకరిస్తున్నారు. బహిరంగ విపణిలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వాస్తవ ధరలకు రిజిస్ట్రేషన్‌ శాఖ నిర్దేశించిన మార్కెట్‌ విలువకు మధ్య ఉన్న తేడాలను తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా మార్కెట్‌ విలువకు, వాస్తవ ధరకు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించి రిజిస్ట్రేషన్‌ ఆదాయాన్ని పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు.

22 లోపు ప్రాథమిక నివేదిక

మండల, గ్రామస్థాయిలో భూముల విలువ పెంపుపై సబ్‌రిజిస్ట్రార్లు చేస్తున్న అధ్యయనం తుది దశకు చేరుకుంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువ నిర్ధారణ కమిటీలో సభ్యులైన తహసీల్దార్లు సబ్‌రిజిస్ట్రార్‌లకు తోడ్పాటునందిస్తున్నారు. ఈ నెల 22వ తేదీలోపు భూముల విలువ పెంపుపై ప్రాథమిక నివేదికను సిద్ధం చేయనున్నారు. ఇది జిల్లా స్థాయిలో కలెక్టర్‌ ఛైర్మన్‌గా ఉన్న కమిటీకి  చేరనుంది. ఆ తర్వాత ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించనున్నారు. సమస్యలను పరిష్కరించిన అనంతరం ఆ ధరలను వాస్తవ రూపంలోకి తేనున్నారు. ఆగస్టు నెల ప్రారంభం నాటికి ఈ క్రతువును పూర్తిచేసేలా రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు కార్యాచరణ రూపొందించారు.

మార్గదర్శకాల అనంతరం సమర్పణ

ప్రభుత్వం నుంచి భూముల విలువ పెంపుపై నిర్దిష్ట మార్గదర్శకాలు వెలువడిన అనంతరం తుదినివేదికను సమర్పించనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో అధ్యయనం ప్రారంభించారు. ఒకట్రెండు రోజుల్లో పూర్తి మార్గదర్శకాలు వచ్చే అవకాశాలున్నాయని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. భూముల విలువ పెంపు హేతుబద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని కామారెడ్డి సబ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు వెల్లడించారు.

వ్యత్యాసం తగ్గించేలా ప్రణాళికలు

గత ప్రభుత్వం 2021, 2022లో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్‌ విలువను పెంచింది. ఈ సందర్భంగా తక్కువ ధరలున్న చోట 50 శాతం, మధ్యస్థంగా ఉంటే 40 శాతం, ఎక్కువ ఉంటే 30 శాతం వరకు ఒకే విధంగా పెంచారు. ఈ దఫా అలా కాకుండా భూముల వాస్తవ, మార్కెట్‌ విలువల మధ్య భారీ తేడాలు లేకుండా చూడాలని ప్రభుత్వం నిర్దేశించినట్లు తెలుస్తోంది. ఉదాహరణకు కామారెడ్డి పట్టణంలో వ్యవసాయేతర స్థలాల వాస్తవ ధరలు డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో గజానికి రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు పలుకుతోంది. శివారు ప్రాంతాల్లో రూ.4000 నుంచి రూ.8000 వరకు పలుకుతోంది. మార్కెట్‌ విలువలు మాత్రం పట్టణంలో గజానికి రూ.240 నుంచి మొదలుకొని రూ.8 వేల వరకు ఉంది. వీటితో పాటు వ్యవసాయేతర భూముల వాస్తవ ధరలు జాతీయ రహదారికి సమీపంలో రూ.45 లక్షల నుంచి రూ.60 లక్షలు పలుకుతోంది. పల్లెల్లో సాగునీటి వసతులు ఉన్న భూముల ధరలు రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఉన్నాయి. సాగునీటి వసతులు లేని రాళ్లు, రప్పలతో కూడిన భూముల ధరలు సైతం రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉన్నాయి. కానీ మార్కెట్‌ విలువలు కనిష్ఠంగా రూ.16 వేల నుంచి మొదలుకొని గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఉన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని