logo

మళ్లీ దరఖాస్తులు.. లబ్ధిదారులకు తిప్పలు

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉచిత విద్యుత్తు అమలు చేస్తోంది. 200 యూనిట్లు లోపు వాడే వారికే ఇది వర్తిస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం  ప్రత్యేకంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంది.

Published : 20 Jun 2024 03:16 IST

అర్హులకు అందని ఉచిత విద్యుత్తు
మండల, పురపాలికల్లో ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ కలెక్టరేట్‌

మోపాల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తున్న సిబ్బంది

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉచిత విద్యుత్తు అమలు చేస్తోంది. 200 యూనిట్లు లోపు వాడే వారికే ఇది వర్తిస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం  ప్రత్యేకంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంది. ఇందులో చాలా మంది అర్హులకు ఉచిత విద్యుత్తు అమలు కాలేదు. ఆ వెంటనే ఎన్నికల కోడ్‌ రావడంతో ప్రక్రియ నిలిపివేశారు. తమకు ఉచిత విద్యుత్తు రావడం లేదని అన్ని వర్గాల ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో మండల పరిషత్, పురపాలక సంఘాల్లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి మరోసారి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించారు.

వివరాలు సరిగా నమోదు చేయక..

జిల్లా వ్యాప్తంగా గృహ విద్యుత్తు కనెక్షన్లు 5,74,682 ఉన్నాయి. జూన్‌లో 2,52,139 కనెక్షన్లు జీరో బిల్లుకు అర్హత సాధించగా 2,20,462 మందికి వర్తించింది. ప్రజాపాలనలో ఉచిత విద్యుత్తు కోసం 3,89,582 దరఖాస్తులు వచ్చాయి. అందులో వివరాలను సిబ్బంది ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఈ క్రమంలో వివరాలు తప్పుగా ఎంట్రీ చేయడంతో చాలా మంది పథకానికి దూరమయ్యారు. వీటిని సరి చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. ఈ విషయం తెలియక దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమకు ఎందుకు వర్తించడం లేదని సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.

కొత్తవాటికి అవకాశం లేదు

అయితే కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఇది వరకు నిర్వహించిన ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల్లో ఎవరికైతే ఉచిత విద్యుత్తు వర్తించడం లేదో వారికే అవకాశం ఇచ్చారు.

వీటిని జత చేయాలి

గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లు వర్తించని లబ్ధిదారులు విద్యుత్తు బిల్లు, ఆధార్, తెల్లరేషన్‌ కార్డు, ప్రజాపాలనలో ఇచ్చిన రసీదు నకలు(జీరాక్స్‌) పత్రాలతో పాటు చరవాణి సంఖ్య తప్పనిసరిగా ఇవ్వాలి. ఆయా పత్రాలను జత చేసి గ్రామీణ ప్రాంతాల వారు ఎంపీడీవో, పట్టణ ప్రాంతాల వారు పురపాలక సంఘాల్లో అందజేయాలని అధికారులు సూచిస్తున్నారు.

శూన్య బిల్లు రావడం లేదు

జూన్‌కు సంబంధించి 154 యూనిట్లు కాలినట్లు బిల్లులో ఉంది. కానీ, జీరో బిల్లు రాలేదు. ప్రతినెల మాదిరిగానే వచ్చింది. విద్యుత్తు సిబ్బందిని అడిగితే మీ వివరాలు సరిగా నమోదు కాలేదని చెబుతున్నారు. మళ్లీ దరఖాస్తు చేసుకుందామని నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్తే అక్కడ సరైన సమాధానం చెప్పడం లేదు.

 రాము, వినాయక్‌నగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని