logo

ఆయిల్‌పామ్‌ సాగుపై ఆశలు

జిల్లాలో ఆయిల్‌పామ్‌ తోటల సాగుపై ఆశలు చిగురించాయి. ప్రభుత్వం సాగుకు ఇచ్చే రాయితీ సొమ్మును తాజాగా విడుదల చేసింది. రెండో ఏడాది సాగుచేసిన 899 మంది రైతులకు సంబంధించి 2,485 ఎకరాలకు రూ.1.04 కోట్లు విడుదలైంది.

Published : 20 Jun 2024 03:19 IST

జిల్లాకు రూ. 1.04 కోట్ల ప్రోత్సాహక రాయితీ
మూడో ఏడాది సాగుకు సన్నద్ధం
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వ్యవసాయం

డొంకేశ్వర్‌ మండలంలో ఆయిల్‌పామ్‌ తోట

జిల్లాలో ఆయిల్‌పామ్‌ తోటల సాగుపై ఆశలు చిగురించాయి. ప్రభుత్వం సాగుకు ఇచ్చే రాయితీ సొమ్మును తాజాగా విడుదల చేసింది. రెండో ఏడాది సాగుచేసిన 899 మంది రైతులకు సంబంధించి 2,485 ఎకరాలకు రూ.1.04 కోట్లు విడుదలైంది. మొదటి ఏడాది సాగుకు సంబంధించిన రూ.28 లక్షల బకాయిలు సైతం ఖాతాలకు చేరనున్నాయి. ఒడుదొడుకులతో రెండో ఏడాది పూర్తి చేసుకున్న ఆయిల్‌పామ్‌ మొక్కల పెంపకం ఇప్పుడు మూడో ఏడాదిలోకి చేరింది. ఈ ఏడాది లక్ష్యం చేరుకునేందుకు ఉద్యానశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ వారంలో కొత్తగా దరఖాస్తులు, మొక్కల పంపిణీ మొదలుపెట్టాలని యోచిస్తున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే జిల్లాలో మొక్కల పెంపకం పది వేల ఎకరాలకు చేరే అవకాశం ఉంది.

ఎదురుచూపులకు  మోక్షం

జిల్లాలో మొదటి ఏడాది 2,200 ఎకరాల్లో, రెండో ఏడాది 2,485 ఎకరాల్లో సాగు చేశారు. ఎకరంలో నాటే 50 మొక్కలకు రాయితీ పోగా రైతు వాటా రూ.వేయి చెల్లిస్తే సరిపోతుంది. తోటల నిర్వహణ, అంతర పంటల సాగుకు ప్రభుత్వం నాలుగేళ్ల వరకు ఏటా రూ.4,200 చొప్పున రాయితీ ప్రోత్సాహకం ఇస్తోంది. ఇందులో రూ.2100 అంతర పంటల సాగుకు, మిగతా రూ.2,100 ఎరువులు, ఇతరత్రా నిర్వహణకు వెచ్చించేలా అందిస్తోంది. ఎకరానికి విస్తృతిని బట్టి బిందు, తుంపర సేద్యానికి రూ.7000- 12,000 వరకు ఆయా కంపెనీలకు ప్రభుత్వమే నిధులు చెల్లిస్తోంది. వీటి బకాయిలు ఏడాదిగా పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా మంగళవారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించి ఆయిల్‌పామ్‌ సాగును తమ ప్రభుత్వం కూడా పోత్సహిస్తోందని వెల్లడించారు. ఇకపై రైతులకిచ్చే రాయితీలు ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని ప్రకటించారు. బిందు, తుంపర సేద్యం బకాయిలు కూడా తక్షణమే విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో ఈ ఏడాది సాగుదారుల్లో ఆశలు చిగురించాయి.

ఎండలకు  ఎదురీది..

ఈ ఏడాది ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు దంచికొట్టాయి. గరిష్ఠంగా 45 డిగ్రీలు దాటింది. దీనికి తోడు భూగర్భ జలాలు అడుగంటడంతో వట్టి పోయిన బోర్ల దగ్గర మొక్కలను కాపాడుకునేందుకు అన్నదాతలు అవస్థలు పడ్డారు. కొన్నిచోట్ల మొక్కలు తీసేందుకు రైతులు ప్రయత్నించారు. వాస్తవానికి ఈ ఆయిల్‌పామ్‌ మొక్కలు కొబ్బరి, తాటి, ఈత చెట్ల జాతికి చెందినవి కావడంతో నీటి ఎద్దడిని తట్టుకుంటాయి. నెల రోజుల వరకు నీరందకున్నా చనిపోవు. కానీ కొన్నిచోట్ల ఎదుగుదల లోపించింది. ఆ ప్రభావం ఆడ గెలల స్థానంలో మగ గెలలు వచ్చే అవకాశం ఉంటుందని సాగుదారులు ఆందోళన చెందుతున్నారు. భగీరథ ప్రయత్నం చేసి కాపాడుకున్న మొక్కలు భవిష్యత్తులో ఆదాయం అందిస్తాయని ఆశిస్తున్నారు.

రైతులు ధైర్యంగా ముందుకు రావాలి

జిల్లాలో అనువైన వాతావరణం ఉంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ నీటి లభ్యత ఎక్కువ. ప్రభుత్వం నుంచి రాయితీ ప్రోత్సాహకం ఉన్నందున రైతులు ధైర్యంగా ముందుకురావాలి. ఈ ఏడాది సాగు లక్ష్యం త్వరలో ఖరారు చేస్తాం. అవసరమైన రైతులు దరఖాస్తు చేసుకోవాలి.

 మధుసూదన్, ఉద్యానశాఖ ఉప సంచాలకుడు

సాగు వివరాలు : జిల్లాలో మొత్తం సాగు : 4,600 ఎకరాలు

  •  రైతులు : 1,830 మంది
  • మొక్క ఖరీదు : రూ. 193
  • రైతు వాటా : రూ.20
  • ఎకరానికి నాటే మొక్కలు: 50
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని