logo

సదరం స్లాటు.. ఎప్పుడైనా చేసుకోవచ్చు

దివ్యాంగుల వైకల్యం నిర్ధారించేందుకు మొదట సదరం స్లాటు నమోదు చేసుకొని ఆ తర్వాత శిబిరానికి హాజరు కావాల్సి ఉంటుంది. బాధితులు ఎక్కువ సంఖ్యలో ఉంటే స్లాటు తక్కువగా విడుదల చేసే వారు.

Updated : 11 Jul 2024 06:30 IST

దివ్యాంగులకు వెసులుబాటు కల్పించిన సర్కారు

నిజామాబాద్‌ మీ-సేవ కేంద్రంలో సందడి

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ కలెక్టరేట్‌: దివ్యాంగుల వైకల్యం నిర్ధారించేందుకు మొదట సదరం స్లాటు నమోదు చేసుకొని ఆ తర్వాత శిబిరానికి హాజరు కావాల్సి ఉంటుంది. బాధితులు ఎక్కువ సంఖ్యలో ఉంటే స్లాటు తక్కువగా విడుదల చేసే వారు. దీంతో చాలా మంది రోజుల తరబడి మీ-సేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఏదో ఒక రూపంలో సదరం ధ్రువపత్రం ఇస్తే చాలని భావించే వారు. దివ్యాంగుల అలసత్వం ఆసరాగా చేసుకొని మీ-సేవ నిర్వాహకులు స్లాటు నమోదుకు ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు వసూలు చేసే వారు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి మీ-సేవ కేంద్రాల్లో ఎప్పుడైనా స్లాటు నమోదు చేసుకునేలా వెసులుబాటు కల్పించింది. ఈ కొత్త విధానంతో చాలా మంది దివ్యాంగులకు ప్రయోజనం చేకూరనుంది.

కేటాయింపు ఎలా అంటే?

స్లాటు పొందేందుకు మీ-సేవ కేంద్రంలో ఆధార్, పీపీ ఫొటో ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. శిబిరం నిర్వహించే తేదీ, సమయం, సమాచారం చరవాణికి వస్తుంది. ఆయా తేదీల్లో శిబిరానికి వెళ్లాలి. నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో నిర్వహించే శిబిరానికి వెళ్తే వైద్యులు పరీక్షించి వైకల్యం నిర్ధారించి ధ్రువపత్రం అందజేస్తారు. ధ్రువపత్రం ఉన్న వారు పునరుద్ధరించుకునేందుకు(రెన్యువల్‌) కూడా స్లాటు అవసరం.

మూడు రోజుల పాటు శిబిరాలు

10, 24, 31 తేదీల్లో సదరం శిబిరాలు ఖరారు చేశారు. ధ్రువీకరణ పత్రం కావాల్సిన వారు స్లాటు నమోదు చేసుకోవచ్చు. ఈ నెలలో 858 స్లాట్లు కేటాయించారు. ఇకపై దివ్యాంగులు ఎప్పుడైనా స్లాటు నమోదు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని గ్రామీణాభివృద్ధి సంస్థ డీపీఎం (పింఛన్‌) రాచయ్య ‘న్యూస్‌టుడే’తో తెలిపారు.


ఇది వరకు ఎలా ఉండేదంటే..?

సదరం శిబిరానికి సంబంధించిన తేదీలను గ్రామీణాభివృద్ధి అధికారులు ప్రతి నెలా ఖరారు చేస్తారు. నెల ప్రారంభం కాగానే మూడు, నాలుగు రోజుల్లో శిబిరాలు నిర్వహిస్తారు. అధికారులు తేదీలు ఖరారు కాగానే ఒక రోజు ముందు దివ్యాంగులకు స్లాట్‌ నమోదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చేవారు. పరిమిత సంఖ్యలో వీటిని విడుదల చేయడంతో దివ్యాంగులు తెల్లవారుజాము నుంచే మీ-సేవ కేంద్రాల వద్ద బారులు తీరే వారు. ఒక్కోసారి సాంకేతిక సమస్యలు తలెత్తేవి. నెలలో ఎంత సంఖ్యలో స్లాట్లు ఇచ్చారో అంతకు మించి నమోదు చేసే వారు. సమయం తక్కువ ఉండడంతో అందరికీ దొరికేది కాదు. మిగతావారు ఎదురుచూసేవారు. వారి కష్టాలు దూరం చేసేందుకు ఈ సులువైన విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు