logo

ఒకరిద్దరే ముద్దు..!

అధిక సంతానం స్త్రీమూర్తిని శారీరకంగా బలహీనం చేస్తుంది. అధిక జనాభా పుడమి తల్లికి భారమవుతోంది. పుడుతున్న ప్రతి వ్యక్తి కోసం ధరిత్రి తన సహజత్వాన్ని(సహజ సంపద) కోల్పోతోంది.

Published : 11 Jul 2024 05:09 IST

కుటుంబ నియంత్రణకు వైద్యారోగ్య శాఖ ప్రణాళిక
ప్రపంచ జనాభా దినోత్సవం నేడు
న్యూస్‌టుడే, ఇందూరు ఫీచర్స్‌

ధిక సంతానం స్త్రీమూర్తిని శారీరకంగా బలహీనం చేస్తుంది. అధిక జనాభా పుడమి తల్లికి భారమవుతోంది. పుడుతున్న ప్రతి వ్యక్తి కోసం ధరిత్రి తన సహజత్వాన్ని(సహజ సంపద) కోల్పోతోంది. పుడమి లేకుంటే మానవాళి మనుగడ లేదు. అధికంగా ఉంటే ప్రమాదకరమేనని నిపుణుల అభిప్రాయం. జనాభా నియంత్రణకు ఏటా జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా ఈసారి ఇందూరు జిల్లాలోని వైద్యారోగ్య శాఖ యంత్రాంగం కుటుంబ నియంత్రణపై సమాయత్తమవుతోంది. ప్రజల్లో అవగాహన కల్పించడానికి సిద్ధమవుతోంది. రాబోయే రోజుల్లో కు.ని. శిబిరాల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేసింది. విజయవంతం చేయడానికి లక్ష్యం నిర్దేశించింది. మొత్తం ఐదు వేసక్టమీ శస్త్రచికిత్సల శిబిరాలు ఏర్పాటుచేయనుంది.

ఇదీ నేపథ్యం..

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభాతో ఎదురవుతున్న సవాళ్లు, ప్రభావాలపై అవగాహన కల్పించడానికి ఏటా ఈ దినోత్సవం జరుపుతున్నారు. ప్రపంచ జనాభా 500 కోట్లు చేరుకున్న సందర్భంగా 1987లో మొదటగా నిర్వహించారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో ఏటా ఒక నేపథ్యంతో కార్యక్రమం చేపడుతుంటారు. ఈసారి ‘భారతదేశానికి కొత్త గుర్తింపు. కుటుంబ నియంత్రణ ప్రతి జంటకు గర్వకారణం’ అన్న నినాదంతో తలపెట్టారు.

ప్రోత్సాహకాలతో అవగాహన..

కుటుంబ నియంత్రణ పాటించే వారిని ప్రోత్సహించడానికి అధికారులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా మూడు విభాగాల్లో ఒకరిని లక్కీడ్రా ద్వారా ఎంపిక చేసి రూ.1000 చొప్పున బహుమతి అందించనున్నారు. ఈ మేరకు ఒకే సంతానానికి శాశ్వత కు.ని చికిత్స చేసుకున్న వారు, ఐయూడీ పద్ధతిలో, అంతర ఇంజెక్షన్‌తో నియంత్రణ పాటిస్తున్న వారిలో ఒకరు చొప్పున ఎంపిక చేస్తున్నారు. ఈ మూడు విభాగాల్లో అర్హత కలిగిన 160 మందిలో ఒకరిని లక్కీడ్రాలో ఎంపిక చేసినట్లు తెలిసింది.


ప్రత్యామ్నాయ పద్ధతుల్లో..

పుడమిపై భారం తగ్గించాలంటే కుటుంబీకుల సంఖ్యను తగ్గించుకోవాలి. ఒకరు లేదా ఇద్దరు సంతానానికి పరిమితమైతే అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. నియంత్రణ పద్ధతులు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. గతంలో డీపీఎల్‌ చికిత్సలు చేసేవారు. ఈ శస్త్రచికిత్సల నిపుణుల కొరతతో డీపీఎల్‌ శిబిరాల నిర్వహణ దాదాపుగా కనుమరుగైంది. కానీ ప్రత్యామ్నాయాల్లో నియంత్రణ పాటిస్తున్నారు.


ఉత్పన్నమయ్యే సమస్యలివి..

అంతర్జాతీయంగా ఎదురవుతున్న సమస్యలే స్థానికంగానూ ఉంటాయి. ఇప్పటికే మండిపోతున్న ధరలు, తగ్గుతున్న అడవులతో ఉష్ణోగ్రతల పెంపు, ఆకాశాన్ని తాకుతున్న భూముల ధరలు.. ఇలా అన్నింటికీ డిమాండ్‌ ఏర్పడుతోంది. ఫలితంగా జీవన ప్రమాణాలపై ప్రభావం పడుతుంది. వాటిలో ప్రధానమైనవి...

  • జనాభా పెరిగినా భూవైశాల్యం అంతే ఉంటుంది. కాబట్టి పుడమిపై ఒత్తిడి పెంచుతుంది.
  • సాగుభూములు ఆవాస ప్రాంతాలుగా మారడంతో వ్యవసాయోత్పత్తులు తగ్గుతాయి. ఫలితంగా ధరలు ఆకాశాన్నంటుతాయి.
  • ఇంధన వనరుల వినియోగం పెరిగిపోయి.. సహజ వనరులు క్షీణిస్తాయి. దీంతో దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుంది.
  • అడవుల విస్తీర్ణం తగ్గి పర్యావరణ సమతౌల్యం దెబ్బ తింటుంది.
  • ప్రకృతి సంపదపై ఆధిపత్యం పెరిగి ఘర్షణలు తలెత్తి శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుంది.
  • నీటి అవసరం అధికమై కరవు ఏర్పడుతుంది.
  • భూమి ఒత్తిడికి గురైనట్లే జీవన వ్యయం పెరిగి ప్రజలు ఆందోళన చెందుతారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని