logo

నేను బతికే ఉన్నా.. పింఛను ఇవ్వండి

బతికి ఉన్న వ్యక్తి మృతి చెందాడని మూడు నెలలుగా పింఛను నిలిపివేసిన ఘటన నందపూర్‌ సమితిలో జరిగింది. బాధితుడి కథనం మేరకు..

Published : 17 Jun 2024 03:54 IST

అర్జున్‌ కోరా

సిమిలిగుడ, న్యూస్‌టుడే: బతికి ఉన్న వ్యక్తి మృతి చెందాడని మూడు నెలలుగా పింఛను నిలిపివేసిన ఘటన నందపూర్‌ సమితిలో జరిగింది. బాధితుడి కథనం మేరకు.. నందపూర్‌ సమితి కిముడుగుడ పంచాయతీ సలబ్‌ గ్రామానికి చెందిన అర్జున్‌ కోరా (68) గత నాలుగు నెలల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అనారోగ్యంతో ఆయన మృతి చెందినట్లు పంచాయతీ అధికారులు నిర్ధారించుకుని అర్జున్‌కు పింఛను తొలగించారు. అర్జున్‌ శనివారం గ్రామంలో ఉన్న అమో బ్యాంక్‌కు పింఛను డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లాడు. గత మూడు నెలలుగా పింఛను సొమ్ము జమ కాలేదని బ్యాంకు అధికారులు తెలియజేయడంతో అర్జున్‌ నిరాశ చెందాడు. పంచాయతీ అధికారులను నిలదీయడంతో అధికారులు బాధితుడు మృతి చెందినట్లు భావించి పింఛను ఆపేశామని దస్త్రాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. తాను బతికే ఉన్నా రికార్డుల పరంగా చంపేసి, పింఛను ఆపేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని అధికారులను కోరాడు. ఈ విషయంపై నందపూర్‌ సమితి అభివృద్ధి అధికారి దుర్గా ప్రసాద్‌ దొరను ‘న్యూస్‌టుడే’ ప్రశ్నించగా అర్జున్‌ అనారోగ్యం పాలవడంతో అప్పటి పంచాయతీ కార్యనిర్వహణ అధికారి నర్సింగ్‌ దాస్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం పింఛను ఆగిందని, ఆయన ఉద్యోగ విరమణ పొందాడని, కొత్త అధికారి కమల్‌ స్మిత్‌కు ఈ విషయం గురించి ఏమీ తెలియదని, సోమవారం విచారించి బాధితుడు అర్జున్‌కు పింఛను అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని