logo

ద్వారాలు తెరిచారు.. ఇబ్బందులు తొలగలేదు..

భాజపా ప్రభుత్వం ఏర్పడిన 12 గంటల్లో పూరీ శ్రీక్షేత్రం నాలుగు ద్వారాలు తెరిపించింది. 13న ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌ మాఝి ఆయన మంత్రివర్గ సహచరులంతా పూరీ వచ్చి.. స్వయంగా తలుపులు తెరిచారు.

Published : 17 Jun 2024 04:07 IST

శ్రీక్షేత్రంలో మారని పరిస్థితి 
తొక్కిసలాటకు అడ్డుకట్ట వేయలేకపోతున్న సిబ్బంది 

గోపాలపూర్, న్యూస్‌టుడే: భాజపా ప్రభుత్వం ఏర్పడిన 12 గంటల్లో పూరీ శ్రీక్షేత్రం నాలుగు ద్వారాలు తెరిపించింది. 13న ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌ మాఝి ఆయన మంత్రివర్గ సహచరులంతా పూరీ వచ్చి.. స్వయంగా తలుపులు తెరిచారు. రద్దీ నియంత్రణకు మాత్రం చర్యలు తీసుకోలేదు. దీంతో గర్భగుడిలో తొక్కిసలాట జరుగుతోంది. 

భక్తుల తాకిడి

రొజ్జొ పండగ సెలవులు కావడంతో పూరీకి భక్తులు, సందర్శకుల తాకిడి పెరిగింది. శ్రీక్షేత్రంలోపల జగన్నాథునికి నిత్యం 119 రకాల సేవలు నిర్వహిస్తారు. రహస్య సేవల సమయంలో దర్శనాలు సాధ్యం కాదు. భక్తులు నిరీక్షించాలి. లోపల జరుగుతున్న సేవల వివరాలు ఆలయ వెలుపల డిజిటల్‌ బోర్డులో శ్రీక్షేత్ర సిబ్బంది తెలియజేస్తారు. 21 మెట్లు దాటి గర్భగుడికి వెళ్లేందుకు మరో 7 సోపానాలు దాటాలి. అక్కడ నుంచి రద్దీ అధికమవుతుంది. ఈ అవస్థల మధ్యే దేవుడిని క్షణకాలం మాత్రమే చూసే వీలవుతుంది. వృద్ధులు, దివ్యాంగులకు సరైన ఏర్పాట్లు చేయలేదు. దీంతోపాటు ఒబడా ప్రసాదాలు నచ్చిన ధరలకు విక్రయిస్తున్న సువార్, మహా సువార్‌ సేవాయత్‌ల అన్యాయాలకు అడ్డుకట్ట పడటం లేదు.

ఆలయం ఆవరణలో భక్తుల రద్దీ  

మంత్రి దృష్టి సారించాలి

శ్రీక్షేత్రం ఇబ్బందులు, అవసరాలపై పూర్తి అవగాహన ఉన్న పృథ్వీరాజ్‌ హరిచందన్‌ న్యాయ మంత్రిగా నియమితులయ్యారు. ఆయన సమస్యలపై దృష్టిసారించి చిత్తశుద్ధి కనబరిస్తే భక్తులకు సులభ దర్శన వ్యవస్థ సాధ్యమవుతుందని అంతా ఆశాభావంతో ఉన్నారు. హరిచందన్‌ ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, భక్తులకు అసౌకర్యం కలగకుండా చూస్తామన్నారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని హామీ ఇచ్చారు. త్వరలో అధికారులతో సమావేశం నిర్వహించి చర్చిస్తామని వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని