logo

మరణాలకు అడ్డుకట్ట పడేదెప్పుడు?

జిల్లాలోని కాశీపూర్‌ సమితి మునుస్‌పొదర్‌ గ్రామంలో ఐదుగురు చిన్నారులు మృతికి కారణమైన అంతుచిక్కని వ్యాధి ఏంటన్నది ఇంతవరకు నిర్ధారణ కాలేదు.

Published : 17 Jun 2024 04:11 IST

కాశీపూర్‌ సమితి మునుస్‌పొదర్‌ను వీడని భయం 
వైద్య సిబ్బంది సెలవు రద్దుచేయాలంటూ కలెక్టర్‌ ఉత్తర్వులు 

గ్రామస్థులకు సూచనలిస్తున్న సీడీఎంవో రౌత్రాయ్‌

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలోని కాశీపూర్‌ సమితి మునుస్‌పొదర్‌ గ్రామంలో ఐదుగురు చిన్నారులు మృతికి కారణమైన అంతుచిక్కని వ్యాధి ఏంటన్నది ఇంతవరకు నిర్ధారణ కాలేదు. జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత చిన్నారుల రక్త నమూనాలు పరీక్షల కోసం భువనేశ్వర్‌ పంపించి దాదాపు వారం రోజులు కావస్తున్నా వాటి ఫలితాలు ఇంకా వెల్లడికాలేదు. గ్రామంలో మరికొందరికి వ్యాధి లక్షణాలు కనిపించిన నేపథ్యంలో గ్రామస్థుల్లో భయం వీడడంలేదు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గ్రామంలో బాధితులకు చికిత్సనందించే ఏర్పాట్లు చేయడం గమనార్హం. దీనికి తోడు జిల్లా ముఖ్య వైద్యాధికారి లాల్‌ మెహన్‌ రౌత్రాయ్‌ నేతృత్వంలో వైద్యబృందం శనివారం గ్రామానికి చేరుకొని గ్రామస్థులకు అవగాహన కల్పించారు. డిఫ్తీరియాగా అనుమానిస్తున్న ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. మరోవైపు ఇది పూర్తిస్థాయిలో నియంత్రణలోకి వచ్చేంతవరకు వైద్య సిబ్బంది సెలవులను రద్దుచేయాలంటూ కలెక్టర్‌ మనోజ్‌ సత్యవాన్‌ మహాజన్‌ ఉత్తర్వులిచ్చారు. నివేదిక వచ్చేంతవరకు వ్యాధి ఏంటన్న విషయమై స్పష్టత ఇవ్వలేమని వైద్యవర్గాలు చెబుతున్నాయి. భాజాపా జిల్లా అధ్యక్షుడు శివకుమార్‌ పట్నాయక్, ఎస్టీ సెల్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కాళీరాం మాఝి ఆధ్వర్యంలో పులువురు పార్టీ నేతలు గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబాలకు నిత్యావసర సరకులు అందజేసి వారికి ధైర్యం చెప్పారు. 

మునుస్‌పొదర్‌ గ్రామస్థులతో మాట్లాడుతున్న భాజపా నేతలు 

డిఫ్తీరియా అయితే సంక్రమించే అవకాశం

చిన్నారుల్లో ప్రబలుతున్న వ్యాధి డిఫ్తీరియాగా నిర్ధారణ అయితే ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే అవకాశాలున్నాయని వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. ‘కోరిన్‌ బ్యాక్టీరియం డిఫ్తీరియా’ అనే బాక్టీరియా వల్ల ఈ వ్యాధి సోకుతుందని వైద్యవర్గాలు వెల్లడించాయి. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గడం, తుమ్మడం, దగ్గరగా మాట్లాడడం వంటి చర్యలు వల్ల ఇది ఒకరినుంచి మరొకరికి సంక్రమిస్తుందని ఆ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఇంతవరకు వ్యాధి లక్షణాలతో అయిదుగురి చనిపోయినప్పటికీ తాజాగా బ్రహ్మపురం ఎమ్కేసీజీలో చికిత్స పొందుతూ మృతిచెందిన చిన్నారి మాత్రమే డిఫ్తీరియా మరణంగా వైద్య ఆరోగ్యశాఖ నిర్ధారించింది. మిగతా నలుగురు చిన్నారులు ఏ ఆసుపత్రిలోనూ చేరి చికిత్స పొందని కారణంగా వాటిని డిఫ్తీరియాగా ధ్రువీకరించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ఆ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి చికిత్స పొందుతున్న వారి రక్త నమూనాలకు సంబంధించి నివేదిక వచ్చాక వ్యాధి ఏంటన్నది తెలుస్తుందని ఆ శాఖ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని