logo

జెట్టీ కల సాకారమవుతుందా..?

జెట్టీ నిర్మాణం గోపాలపూర్‌ మత్స్యకారుల కల, ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించుకున్నా.. సాకరం కాలేదు. ప్రస్తుతం భాజపా ప్రభుత్వం అధికారంలోకి రావడం,

Updated : 17 Jun 2024 06:36 IST

ఉద్యమించిన నాయకుడే మంత్రిగా బాధ్యతల స్వీకారం 
చిగురిస్తున్న మత్స్యకారుల ఆశలు 

వలలు బాగు చేసుకుంటున్న మత్స్యకారులు 

గోపాలపూర్, న్యూస్‌టుడే: జెట్టీ నిర్మాణం గోపాలపూర్‌ మత్స్యకారుల కల, ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించుకున్నా.. సాకరం కాలేదు. ప్రస్తుతం భాజపా ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఎమ్మెల్యే బిభూతి భూషణ్‌ జెనా మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో గంగపుత్రుల్లో ఆశలు చిగురించాయి. 

బిభూతికి కీలక శాఖలు

బిభూతికి వాణిజ్య, రవాణా, ఉక్క గనుల శాఖలు కేటాయించారు. ఈయన నాయకత్వంలో గోపాలపూర్‌ ఓడరేవు విస్తరణ పనులు ఊపందుకుంటాయని, జెట్టీ నిర్మాణానికి శ్రీకారం చుడతారని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే తీర గ్రామాల్లో నివసించే మత్స్యకారుల పడవలు, వలలు భద్రపర్చుకునే అవకాశంతోపాటు చేపలు ఎండబెట్టేందుకు ప్లాట్‌ఫాంలు, నిల్వకు శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలి. ఇవి లేకపోవడంతో గంగపుత్రులు ఇసుకలోనే చేపలు ఎండబెట్టుకుంటున్నారు. వలలు మరమ్మతులు సైతం ఆరుబయటే చేసుకుంటున్నారు.

ప్లాట్‌ఫాం లేక ఇసుకపైనే కవ్వళ్లు ఎండబెడుతున్న మహిళలు 

హామీలు నిలబెట్టుకోలేదు

రెండున్నర దశాబ్దాలుగా జెట్టీ నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్న మత్స్యకారులు మాజీ సీఎం నవీన్‌ ఇతర బిజద నేతలను కలిసి వినతి పత్రాలు అందజేశారు. హామీ ఇచ్చినా.. ఒక్క ఇటుకైనా వేయలేదు. కొన్నేళ్ల కిందట ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రం పేరిట రూ.6 కోట్ల వ్యయంతో ప్లాట్‌ఫాం, గంగపుత్రుల విశ్రాంతి గదులు నిర్మించినా.. నిరుపయోగంగా మారాయి. గోపాలపూర్‌ ఓడరేవు ప్రైవేటీకరణ తరువాత విస్తరణ జరిగింది. దీంతో జెట్టీ నిర్మాణం సాధ్యం కాదని, ఉప్పుటేరుతో సముద్రానికి అనుంసధానం చేసేందుకు తీరద్వారం నిర్మిస్తామన్నారు. రూ.82 కోట్లు ఖర్చవుతుందని బిజద ప్రభుత్వం తెలిపింది. మాజీ ముఖ్యమంత్రి నవీన్‌ సైతం వీసీ ద్వారా పనులు ప్రారంభించారు. వారం రోజులపాటు ఇసుక డ్రెడ్జింగ్‌ పనులు చేయించి అనంతరం ఆపేశారు.

పడవలు ఉంచేందుకు ఉప్పుటేరే దిక్కు  

గంగపుత్రులకు అండగా 

బిజద హయాంలో జెట్టీ నిర్మాణానికి బిభూతి భూషణ్‌ జెనా ఉద్యమించారు. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 40 వేలు పైచిలుకు కుటుంబాల ఉపాధితో ముడిపడిన జెట్టీ నిర్మాణాన్ని విస్మరించడం తగదని వినతి పత్రాలు అందజేశారు. భువనేశ్వర్‌ వెళ్లి మంత్రులను కలిశారు. కానీ పని జరగలేదు.


కచ్చితంగా నిర్మిస్తాం 
-బిభూతి భూషణ్‌ జెనా, వాణిజ్య, రవాణా, ఉక్కుగనుల శాఖ మంత్రి 

మత్స్యకారులకు ఇచ్చిన హామీని కచ్చితంగా నెరవేరుస్తాం. జెట్టీ కోసం వారి తరఫున నిలబడి పోరాడాను. త్వరలో నిపుణులతో మాట్లాడి, సమగ్ర నివేదిక సిద్ధం చేస్తాం. అనంతరం పనులు ప్రారంభిస్తాం. కేంద్రం అండగా ఉండటంతో నిధులకు కొరత ఉండదు. జెట్టీ త్వరితగతిన అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాను.


నివేదిక అందజేస్తాం 
-ఎస్కే జెనా, ప్రాంతీయ మత్స్యశాఖ అధికారి 

జెట్టీ నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వం వద్ద ఎలాంటి నివేదిక లేదు. తీర ద్వారం నిర్మాణానికి సంబంధించి ప్రణాళికలు ఉన్నా.. నిధులు విడుదల కాకపోవటంతో పనుల్లో పురోగతి కనిపించలేదు. భాజపా ప్రభుత్వం ముందడుగు వేస్తే సమగ్ర నివేదిక అందజేసేందుకు సిద్ధంగా ఉన్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని