logo

సీఎల్పీ నేత ఎవరు?

కాంగ్రెస్‌ సభాపక్షం (సీఎల్పీ) నేత ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. ఈ పదవిపై చాలామంది పార్టీ సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు

Updated : 20 Jun 2024 06:21 IST

భువనేశ్వర్‌ కాంగ్రెస్‌ భవన్‌

భువనేశ్వర్, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ సభాపక్షం (సీఎల్పీ) నేత ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. ఈ పదవిపై చాలామంది పార్టీ సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. జయపురం నుంచి 3వ సారి ఎమ్మెల్యేగా గెలిచిన తారాప్రసాద్‌ వాహినిపతి మరింత ఎక్కువగా ఆశిస్తున్నారు. ఏఐసీసీ నాయకత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో తాము సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపిస్తున్నట్లు సమాచారం.

అనుభవజ్ఞులు లేరు

2019 ఎన్నికల్లో 9 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్‌ ఈ సారి 14 సీట్లు గెలిచింది. లోక్‌సభలో 15, అసెంబ్లీలో 90 సీట్లు సొంతం చేసుకుంటామని ఆ పార్టీ పెద్దలు ప్రకటించినా.. కనీసం విపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేలలో సీనియర్‌ నేత వాహినిపతి మాత్రమే ఉన్నారు.

ప్రచారానికి గైర్హాజరు

ఎన్నికల ప్రచారానికి ఏఐసీసీ నేతలు రాలేదు. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ మొక్కుబడిగా పాల్గొన్నారు. కాస్తో, కూస్తో ప్రతిష్ఠ, అర్థబలం ఉన్న నాయకులు ఎన్నికల బరిలో దిగారు. తమ సీట్లు నిలబెట్టుకోవడానికి సర్వశక్తులు ఒడ్డినా ఓటమి పాలయ్యారు. పోటీ చేసిన అభ్యర్థులకు ఏఐసీసీ నాయకత్వం రూపాయి కేటాయించలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలు ఒంటరి పోరాటం చేశారు. ఉత్తరాది రాష్ట్రాలపైనే దృష్టి పెట్టిన ఏఐసీసీ అభ్యర్థుల జాబితా ప్రకటించి ఆ తర్వాత పట్టించుకోలేదని అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

15 రోజులైనా జాడ లేదు

ఎన్నికల ఫలితాలు వెలువడి పక్షం రోజులైనా పార్టీ ఘోర పరాజయం వెనుక కారణలేమిటన్న దానిపై సమీక్షించడానికి హస్తిన పెద్దలెవరూ భువనేశ్వర్‌ రాలేదు. దీంతో పార్టీ కార్యాలయం వెలవెలబోతోంది. పీసీసీ అధ్యక్షుడు శరత్‌పట్నాయక్‌సైతం ఏమీ మాట్లాడలేదు. నువాపడ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన శరత్‌ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.


నేను అర్హుడినే

తారా ప్రసాద్‌ వాహినీపతి

సీఎల్పీ నేత ఎవర్నది ఇంకా నిర్ణయించలేదు. ఇంతవరకు సభాపక్షం సమావేశం కాలేదు. దిల్లీ నుంచి నేతలు వచ్చిన తరువాత పరాజయానికి కారణాలపై సమీక్షించి, తరువాత సీఎల్పీ నాయకుని ఎన్నుకుంటారని ఎమ్మెల్యేలు వేచి చూస్తున్నారు. మంగళవారం ప్రమాణ స్వీకారానికి అసెంబ్లీకి వచ్చిన తారా ప్రసాద్‌ విలేకరులతో మాట్లాడుతూ సీఎల్పీ పదవికి తాను అర్హుడినేనని తెలిపారు. అయినప్పటికీ ఏఐసీసీ నాయకత్వం నిర్ణయం శిరోధార్యమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని