logo

ఆ వ్యాధి డిఫ్తీరియానే..!

రాయగడ జిల్లా కాశీపూర్‌ సమితి డొంగశిల పంచాయతీ మనుస్‌పొదర్‌ గ్రామాన్ని గత కొద్ది రోజులుగా వణికిస్తున్న వ్యాధి డిఫ్తీరియాగా తేలింది. దీనికి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న కొరాపుట్, కలహండి జిల్లాలకు డిఫ్తీరియా వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తోంది.

Updated : 20 Jun 2024 04:18 IST

కొరాపుట్, కలహండి జిల్లాలకు వ్యాప్తి
వ్యాధి సంక్రమించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు దిశానిర్దేశం

రాయగడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాయగడ జిల్లా కాశీపూర్‌ సమితి డొంగశిల పంచాయతీ మనుస్‌పొదర్‌ గ్రామాన్ని గత కొద్ది రోజులుగా వణికిస్తున్న వ్యాధి డిఫ్తీరియాగా తేలింది. దీనికి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న కొరాపుట్, కలహండి జిల్లాలకు డిఫ్తీరియా వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తోంది. వ్యాధి సంక్రమించకుండా అవసరమగు చర్యలు తీసుకోవాలని రాయగడ కలెక్టర్‌ మనోజ్‌ సత్యవాన్‌ మహాజన్‌కు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు ఆరోగ్య కార్యదర్శి శాలిని పండిట్‌ మంగళవారం కలెక్టర్‌కు లేఖ పంపారు. సమితి పరిధిలోని మునుస్‌పొదర్‌ చుట్టుపక్కల గ్రామాల్లో పరిస్థితిని పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. చిన్నారుల్లో ఎవరికైనా గొంతు నొప్పి, వాపు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే ముందుగానే వారిని గుర్తించి జిల్లా కేంద్రాసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమితి పరిధిలో టీకాలు వేయించుకోని చిన్నారులను గుర్తించి, వారికి టీకాలు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీడిత గ్రామంలో డిఫ్తీరియా వ్యాధి బారిన పడి ఐదుగురు చిన్నారులు మృతి చెందగా, మరో 15 మందికి వ్యాధి సోకిన విషయం తెలిసిందే.

12 గ్రామాల్లో కానరాని టీకాలు

కాశీపూర్‌ సమితి పరిధి మునుస్‌పొదర్‌తో పాటు మరో 11 గ్రామాల్లో చిన్నారులకు సర్కార్‌ అమలు చేస్తున్న టీకాలు ఇవ్వకపోవడం గమనార్హం. మిషన్‌ ఇంద్రధనుష్‌ ప్రోగ్రాం కింద ఇచ్చే ఈ టీకాలకు ఆయా గ్రామాలకు చెందిన చిన్నారులకు వేయకపోవడం ఈ పరిస్థితికి దారి తీసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాలకు సరైన రహదారి లేకపోవడం, మారుమూల ప్రాంతాలు కావడంతో చిన్నారులు టీకాలకు దూరమైనట్లు తెలుస్తోంది. డిఫ్తీరియా వ్యాధితో రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన మనుస్‌పొదర్‌కు సరైన రహదారి సౌకర్యం లేని కారణంగా వాగులు, చిన్నచిన్న గుట్టలు దాటుకుంటూ దాదాపు 5 కి.మీ. నడిచి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ విషయమై ప్రజారోగ్య అధికారి మమతా చౌదురి మాట్లాడుతూ చిన్నారులకు డీపీటీ టీకాలు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. దురదృష్టవశాత్తూ మునుస్‌పొదర్‌తో కలుపుకొని పన్నెండు గ్రామాల్లో చిన్నారులకు ఈ టీకాలు వేయనట్లు తెలిసిందన్నారు. డిఫ్తీరియా వ్యాప్తికి ఇది కూడా ఒక కారణం కావచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి జిల్లా కేంద్రాసుపత్రిలో ఇద్దరు చిన్నారులకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని