logo

రామోజీరావుకు మరణం లేదు

రామోజీ రావుకు మరణం లేదని, భౌతికంగా ఆయన లేక పోయినా, సదా స్మరించుకునే గొప్ప పనులు చేశారని సీనియర్‌ పాత్రికేయులు, వివిధ రంగాల ప్రముఖులు కొనియాడారు.

Published : 20 Jun 2024 04:00 IST

ఆయన దార్శనికుడు, సదాస్మరణీయుడు
అక్షర యోధుడికి పాత్రికేయ రంగం సంతాపం

ఆదర్శమూర్తికి నివాళులర్పిస్తూ..

భువనేశ్వర్, న్యూస్‌టుడే: రామోజీ రావుకు మరణం లేదని, భౌతికంగా ఆయన లేక పోయినా, సదా స్మరించుకునే గొప్ప పనులు చేశారని సీనియర్‌ పాత్రికేయులు, వివిధ రంగాల ప్రముఖులు కొనియాడారు. మంగళవారం రాత్రి భువనేశ్వర్‌ జయదేవ్‌ భవన్‌లో రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో రామోజీ రావుకు సంతాప సభ నిర్వహించారు. భువనేశ్వర్‌ మేయరు సులోచనాదాస్‌ మాట్లాడుతూ... పాత్రికేయ రంగంలో రామోజీ ధ్రువతారని, ఆయన అధిరోహించిన శిఖరాలను ఎవరూ చేరుకోలేరన్నారు. లోగడ ఈటీవీ ఒడియా ఛానెల్‌ బ్యూరో చీఫ్‌గా తన ప్రస్థానం వివరించారు. తన ఎదుగుదలకు ఆయన పాత్ర కీలకమన్నారు. రాష్ట్ర చలనచిత్ర కార్పొరేషన్‌ అధ్యక్షుడు, ప్రముఖ జర్నలిస్టు కునా త్రిపాఠి మాట్లాడుతూ పాత్రికేయరంగంలో విలువలకు పట్టం కట్టిన రామోజీ గొప్ప దార్శనికుడిగా అభివర్ణించారు. సీనియర్‌ జర్నలిస్టు శిశిర్‌ మిశ్ర మాట్లాడుతూ... ‘ఈటీవీ’ ఒడియా ఛానెల్‌ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ ఆప్తుడిగా గుర్తింపు  పొందిన ఆయన ‘ఈనాడు’ వార్త ప్రతికను తన మానస పుత్రికగా చేసుకుని ప్రజల గొంతుకకు అక్షర రూపమిచ్చిన మహర్షిగా అభివర్ణించారు. సీనియర్‌ జర్నలిస్టులు రబిదాస్, ప్రసన్న మహంతి, జతిన్‌ దాస్, అక్షయసాహు, దయానిధి దాస్‌ డాక్టర్‌ సౌమ్యాపరిడ, ఇతర టీవీ ఛానెళ్లు, వార్తా పత్రికల ప్రాతికేయులు రామోజీరావు సేవలు ప్రస్తుతించారు. అక్షరాన్ని ఆయుధంగా చేసిన మానవతా మూర్తిగా కీర్తించారు. మౌనం పాటించి, మహనీయుడి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. భజన కార్యక్రమం కూడా జరిగింది.

క్రమశిక్షణ, సమయపాలన నేర్చుకున్నాం

రామోజీరావు సంతాప కార్యక్రమంలో పాల్గొన్న మీడియా ప్రతినిధులు, అతిథులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: మీడియా రంగంలో మహోన్నత వ్యక్తి రామోజీరావు అని వక్తలు అన్నారు. బ్రహ్మపుర ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సంస్మరణ సభను నిర్వహించారు. స్టేట్‌బ్యాంకు రోడ్డులోని ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన కార్యక్రమానికి జర్నలిస్టు సమీర్‌ కుమార్‌ ఆచార్య సమన్వయకర్తగా వ్యవహరించారు. గంజాం జిల్లా సమాచార, ప్రజా సంబంధాల అధికారి (డీఐపీఆర్‌వో) రబినారాయణ బెహర, ఈటీవీ ఒడియా మాజీ ఉద్యోగులు, బ్రహ్మపుర విశ్వవిద్యాలయం (వర్సిటీ) జర్నలిజం విభాగాధిపతి డాక్టర్‌ బందితా పండా, డాక్టర్‌ ఎ.అప్పారావు, సంతోష్‌ కుమార్‌ మిశ్రలు పాల్గొని మాట్లాడారు. క్రమశిక్షణ, సమయపాలన రామోజీరావు నుంచి నేర్చుకున్నామన్నారు. సమాజంలో జర్నలిస్టులుగా నిలదొక్కుకున్నామంటే ఆయన ప్రోత్సాహమే కారణమన్నారు. ఒడిశా మీడియా రంగానికి ఆయన ఆద్యుడని, మీడియా రంగంలో వచ్చే సాంకేతికను ప్రజా హితం కోసం వినియోగించేవారని గుర్తు చేసుకున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని వివరించారు. ఈటీవీ ఒడియా వినోద రంగంలో పనిచేసిన డాక్టర్‌ మిహిర్‌ కుమార్‌ త్రిపాఠి, అశోక్‌ బ్రహ్మలు మాట్లాడుతూ కళాకారులకు గౌరవమిచ్చిన ఆయన్ను ఎన్నడూ మరువలేమన్నారు. కార్యక్రమంలో బ్రహ్మపుర ప్రెస్‌ క్లబ్‌ గౌరవ అధ్యక్షుడు బిశ్వనాథ్‌ (గోపాల్‌్) పట్నాయక్, సీనియరు జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు బిఘ్నేశ్వర సాహు, నారాయణ మహంకుడొ, ఆశీర్వాద రౌత్, గోపాల రెడ్డి, కిరణ్, హిమాంశు సాబత్‌ గౌరీ శంకర మిశ్ర, కాళీ రథ్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు వారంతా రామోజీరావు చిత్రపటం వద్ద పుష్పాలుంచి, మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. సీనియరు జర్నలిస్టు, గాయకుడు సుదీప్‌ కుమార్‌ సాహు భజన పాట ఆలపించారు.

భారత రత్న ఇవ్వాలి!

మీడియా, సినీ తదితర రంగాలకు విశేష సేవలందించిన రామోజీరావుకు ‘భారత రత్న’ ఇవ్వాలని మీడియా ప్రతినిధులు డిమాండు చేశారు. ఆయనకు భారత రత్న ఇవ్వాలంటూ మంగళవారం బ్రహ్మపురలో జరిగిన సంతాప సభలో తెలుగు సంస్థలు చేసిన తీర్మానాన్ని వారు బలపరిచారు. బ్రహ్మపుర ప్రెస్‌ క్లబ్‌ తరఫున కూడా విజ్ఞప్తి చేస్తూ.. రాష్ట్రపతి, ప్రధాని ఇతర రాజకీయ ప్రముఖులకు లేఖలు రాయాలని సభలో తీర్మానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని