logo

కూర‘గాయాల’ నుంచి కోలుకునేదెప్పుడు?

జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న కూరగాయల ధరలు సామాన్య ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటి సాగుకు ఏటా అధికారులు నిర్దేశిస్తున్న లక్ష్యం నీరుగారుతుండడం, ఇప్పటికీ వీటి కోసం పొరుగు రాష్ట్రంపై ఆధారపడుతుండడంతో దిగుమతుల భారం తప్పడం లేదు.

Updated : 25 Jun 2024 06:42 IST

జిల్లాలో నీరుగారుతున్న కూరగాయల సాగు లక్ష్యం

 మార్కెట్లో విక్రయిస్తున్న కూరగాయలు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే

జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న కూరగాయల ధరలు సామాన్య ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటి సాగుకు ఏటా అధికారులు నిర్దేశిస్తున్న లక్ష్యం నీరుగారుతుండడం, ఇప్పటికీ వీటి కోసం పొరుగు రాష్ట్రంపై ఆధారపడుతుండడంతో దిగుమతుల భారం తప్పడం లేదు. దీంతో కూరగాయల పేరు చెబితే చాలు సామాన్యులు వణికిపోయే పరిస్థితులు కలుగుతున్నాయి. దీనికి తోడు వర్షాభావ పరిస్థితులు మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు అన్న చందంగా మారాయి.

జిల్లాలో కూరగాయల దిగుబడి అంతంతమాత్రం కావడం, దిగుమతుల భారం కారణంగా వీటి ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు కిలోల స్థానంలో గ్రాములతో సరిపెట్టుకుంటున్నారు. జిల్లాలో వేలాది హెక్టార్లలో కూరగాయల సాగుకు లక్ష్యం నిర్ధేశిస్తుండగా కేవలం వందల సంఖ్యలో వీటి సాగు జరుగుతుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. వీటితో పాటు పప్పుదినుసులు, నూనె గింజల సాగు కూడా ఇదే మాదిరిగా ఉండడం గమనార్హం. వంకాయలు, బెండకాయలు మినహా మిగతావి కిలో రూ.100, ఆపైబడి ధరలు పలుకుతున్నాయి. దీంతో బెంబేలెత్తిపోయిన కొంతమంది పెరటి సాగువైపు దృష్టి సారిస్తున్నారు. ఇంటి పెరట్లలో ఖాళీగా ఉన్న అరకొర స్థలంలో వంకాయలు, బెండ వంటి రకాలు సాగుచేస్తుండగా, మరికొందరు ఇంటి చుట్టూ వేసిన కంచెపై బీర, కాకర, దొండకాయలు తదితర పాదు జాతులను పెంచుతుండడం గమనార్హం.

రాయగడలో ఓ ఇంటి చుట్టూ కంచెపై వేసిన వివిధ పాదు జాతి మొక్కలు

గతేడాదితో పోలిస్తే తక్కువే

 గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు నిర్ధేశించిన కూరగాయలు, పప్పు దినుసులు, నూనెగింజల సాగు లక్ష్యం పూర్తి బాగా తగ్గుముఖం పట్టాయి. ఈ విషయమై జిల్లా వ్యవసాయ ముఖ్య అధికారి సుమన్‌సింగ్‌ పట్నాయక్‌ మాట్లాడుతూ వర్షాలు ప్రారంభమైతే సాగు ఊపందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో వరితో పాటు కూరగాయలు, నూనెగింజలు, పప్పుదినుసులు తదితరాల సాగు పెంచేందుకు దృష్టి సారిస్తున్నామన్నారు. ఆ దిశగా అన్నదాతలు ముందుకొచ్చేలా ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశామన్నారు. గతేడాది జూన్‌తో పోలిస్తే, ఈ ఏడాది ఇదే సమయానికి జిల్లాలో వీటి సాగు వివరాల్లో భారీ తేడా కనిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని