logo

అమ్మ చేతి గోరు ముద్ద

ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి సోమవారం కేంఝర్‌ జిల్లాలోని స్వగ్రామం రయికలాలోని స్వగృహానికి వెళ్లారు.

Published : 25 Jun 2024 04:23 IST

స్వగృహంలో పకాలు బువ్వ ఆరగించిన సీఎం

కుమారునికి పకాలు బువ్వ తినిపిస్తున్న అమ్మ

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి సోమవారం కేంఝర్‌ జిల్లాలోని స్వగ్రామం రయికలాలోని స్వగృహానికి వెళ్లారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ఆయనకు భార్య పాదాభివందనం చేసి హారతి పట్టిన తర్వాత ఇంట్లోకి ఆహ్వానించారు. అమ్మ వండిన వంకాయ పచ్చడి, తోటకూర వేపుడు, వడియాలు, పకాలు బువ్వ వడ్డించారు. కుమారునికి తల్లి ఆప్యాయంగా గోరుముద్దలు తినిపించారు. కడుపునిండా ఆరగించిన తర్వాత సీఎం విలేకరులతో మాట్లాడుతూ... తనకు బాల్యం నుంచి మూడు పూటలా పకాలు బువ్వ ఆరగించడం అలవాటన్నారు. పాఠశాలలో చదువుకున్నప్పుడు కూడా పాఠశాలకు తీసుకెళ్లేవాడినన్నారు. తానిప్పుడు సీఎం అయ్యాయని ఆహారపు అలవాట్లలో ఎలాంటి మార్పులేదని, అమ్మ తినిపిస్తే అమృతం కంటే తియ్యగా ఉంటుందన్నారు. కొద్దిసేపు కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో మాట్లాడారు. దీనికి ముందుగా గ్రామంలో జరిగిన సమావేశంలో ప్రజలు సీఎంను గజమాలతో సత్కరించారు. ఓ దివ్యాంగుడు సీఎంకు పుష్పగుచ్ఛం అందించారు. స్వగ్రామంలోని బలదేవ్‌జీ ఆలయంలో పూజలు చేశారు. రెండు రోజులు సొంత జిల్లాలో పర్యటించిన సీఎం సాయంత్రం భువనేశ్వర్‌ చేరుకున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని