logo

సుప్రీం ఉత్తర్వులు బేఖాతరు

విశ్వప్రసిద్ధ పూరీ శ్రీక్షేత్రానికి సంస్కరణలు, సౌకర్యాలు కల్పించాలని, జగన్నాథుని సేవలు నిర్ణీత వేళల్లో చేపట్టడానికి పూర్తిస్థాయి ఐఏఎస్‌ అధికారిని పాలనాధికారిగా నియమించాలని సుప్రీంకోర్టు 2019లో ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 25 Jun 2024 06:43 IST

శ్రీక్షేత్రానికి పూర్తిస్థాయి పాలనాధికారి కరవు
సంస్కరణకు చెల్లుచీటీతో భక్తుల్లో అసంతృప్తి

పూరీ శ్రీక్షేత్రం

గోపాలపూర్, న్యూస్‌టుడే: విశ్వప్రసిద్ధ పూరీ శ్రీక్షేత్రానికి సంస్కరణలు, సౌకర్యాలు కల్పించాలని, జగన్నాథుని సేవలు నిర్ణీత వేళల్లో చేపట్టడానికి పూర్తిస్థాయి ఐఏఎస్‌ అధికారిని పాలనాధికారిగా నియమించాలని సుప్రీంకోర్టు 2019లో ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతవరకు ఈ ఆదేశాలు అమలుకాలేదు. లక్షలాది మంది భక్తులతో అలరారుతున్న ఈ దివ్యక్షేత్రంలో సంస్కరణలు, సౌకర్యాలు అధ్వానంగా ఉన్నాయన్న అసంతృప్తి వ్యక్తమవుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు.

దురదృష్టకరం: భక్తులు

ఆహార, పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్‌ కార్యదిర్శి వీర్‌విక్రం యాదవ్‌కు ఇదివరకు నవీన్‌ ప్రభుత్వం శ్రీక్షేత్ర పాలనాధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆయన భువనేశ్వర్‌ లోక్‌సేవాభవన్‌కే పరిమితంగా ఉంటున్నారు. మొక్కుబడిగా పూరీ వచ్చి వెళుతున్నారు. దీనికి ముందుగా సురేష్‌ మహాపాత్ర్, ప్రదీప్త మహాపాత్ర్, సమర్థవర్మ, అరవింద పాఢి తాత్కాలిక పాలనాధికారులుగా విధులు నిర్వహించారు. 2023 ఏప్రిల్‌లో నాటి ప్రభుత్వం సీనియర్‌ ఐఏఎస్‌ రంజన్‌దాస్‌ను పూర్తిస్థాయి అధికారిగా జగన్నాథ సన్నిధిలో నియమించింది. ఆయన శ్రీక్షేత్రంలో సంస్కరణలు ప్రారంభించారు. పాన్, గుట్కా నిషేధం, భక్తుల డ్రెస్‌కోడ్‌ అమలు చేశారు. స్వామి సేవలు, సౌకర్యాలపై దృష్టి సారించారు. ఆరేడు నెలలు తిరక్కుండా రంజన్‌కు స్థాన చలనం జరిగింది. వీర్‌విక్రంకు అదనపు బాధ్యతలు కేటాయించారు. శ్రీక్షేత్రంలో సంస్కరణలు నిలిచిపోయాయి. సేవాయత్‌ల మధ్య సమన్వయం కొరవడింది. రథయాత్ర సమీపించిన తరుణంలో జగన్నాథ కార్యాలయంలో పూర్తిస్థాయి అధికారి ఉండి ఏర్పాట్లు పర్యవేక్షించలేకపోవడం దురదృష్టకరమని భక్తులంటున్నారు.

3 నెలల్లో అన్నీ చక్కదిద్దుతాం

న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్‌ హరిచందన్‌ ఆదివారం రాత్రి పూరీ వచ్చారు. శ్రీక్షేత్రంలో ఇబ్బందులను విలేకరులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా 3 నెలల్లో అన్నీ చక్కదిద్దుతామన్నారు. శ్రీక్షేత్రంపై గత ప్రభుత్వం చిత్తశుద్ధి చూపకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. ఈ విషయాన్ని విపక్షంలో ఉన్న సమయంలో భాజపా శాసనసభలో ప్రస్తావించిన సంగతి గర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో 100 రోజుల్లో అంతా చక్కదిద్దుతామన్న హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రస్తుతం అన్నికోణాల్లో సమీక్షిస్తున్నామని, కొద్ది రోజుల్లో పూర్తిస్థాయి పాలనాధికారిని నియమిస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని