logo

గుండిచా పొహండి ఘటనపై గజపతి ఆవేదన

గుండిచా పొహండిలో మంగళవారం రాత్రి జరిగిన అపచారం తీవ్రమైనదని, పూరీ శ్రీక్షేత్ర చరిత్రలో మునుపెన్నడూ ఇలాంటి ఘటన జరగలేదని, ఇది తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని జగన్నాథుని ప్రథమ సేవకుడు, పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్‌ చెప్పారు.

Published : 11 Jul 2024 02:06 IST

14న రత్న భాండాగారం తెరవడానికి ప్రభుత్వానికి సిఫార్సు
శ్రీక్షేత్ర పాలకవర్గ సమావేశంలో నిర్ణయం

దివ్యసింగ్‌దేవ్‌ , వీర్‌ విక్రం యాదవ్‌

గోపాలపూర్, న్యూస్‌టుడే: గుండిచా పొహండిలో మంగళవారం రాత్రి జరిగిన అపచారం తీవ్రమైనదని, పూరీ శ్రీక్షేత్ర చరిత్రలో మునుపెన్నడూ ఇలాంటి ఘటన జరగలేదని, ఇది తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని జగన్నాథుని ప్రథమ సేవకుడు, పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్‌ చెప్పారు. బుధవారం మధ్యాహ్నం శ్రీక్షేత్ర కార్యాలయంలో ఆయన అధ్యక్షతన పాలకవర్గ సమావేశం జరిగింది. కార్యక్రమంలో శ్రీక్షేత్ర పాలనాధికారి వీర్‌విక్రం యాదవ్, పూరీ కలెక్టరు సిద్ధార్థ శంకర్‌ స్వయిన్, ఎస్పీ పినాకి మిశ్ర, ఇతర సభ్యులు పాల్గొన్నారు. గుండిచా పొహండిలో జరిగిన అపశ్రుతి, 14న పురుషోత్తముని రత్నభాండాగారం తెరవాలని జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ సంఘం తీసుకున్న నిర్ణయంపై కూలంకషంగా చర్చ జరిగింది. అనంతరం గజపతి విలేకరులతో మాట్లాడుతూ... రథాలపై సేవలతో ప్రమేయం లేని సేవాయత్‌లు గుంపులుగా ఉన్నారని, బలభద్రుని తాళధ్వజ రథంలో వారి సంఖ్య మరీ ఎక్కువగా కనిపించిందన్నారు. ఉద్దేశపూర్వకంగా పొహండి జాప్యం చేశారని, చారమాల సక్రమంగా కట్టకుండా రథం నుంచి పొహండి నిర్వహించారని, ఈ అనర్థాలన్నిటికీ సేవాయత్‌లే కారణమని, కొందరు గాయపడ్డారని, ఇది స్వామి వేసిన శిక్షగా వారు తెలుసుకుని మారతారన్న ఆశాభావం ఉందన్నారు.

చర్యలు తీసుకుంటాం

పాలనాధికారి యాదవ్‌ మాట్లాడుతూ... ఘటనకు బాధ్యులెవరు? ఎక్కడ పొరపాట్లు జరిగాయో అధ్యయనం చేయడానికి పూరీ జిల్లా అదనపు కలెక్టరు (ఏడీఎం), శ్రీక్షేత్ర అభివృద్ధి అధికారి, డీఎస్పీతో సంఘం ఏర్పాటు చేశామన్నారు. నీలాద్రి బిజె జరిగిన తర్వాత ఈ సంఘం అన్ని అంశాలను పరిశీలించి పాలక వర్గానికి నివేదిక సమర్పిస్తుందని, దీన్ని ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. 15న బహుడా యాత్ర, 19న నీలాద్రిబిజె ఉత్సవాల సమయంలో పొహండిలో తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. రత్నభాండాగారం తెరవాలన్న అధ్యయన సంఘం నిర్ణయానికి పాలకవర్గం ఆమోదించినట్లు పాలనాధికారి చెప్పారు.

సర్వత్రా అసంతృప్తి: గుండిచా పొహండిలో జరిగిన అపచారం పట్ల సర్వత్రా అసంతృప్తి, ఆవేదన వ్యక్తమవుతున్నాయి. బిజద, కాంగ్రెస్, నేతలు మాట్లాడుతూ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని