logo

పీఎం కిసాన్‌లో మరో 6 లక్షల మందికి చోటు

ప్రధానమంత్రి కిసాన్‌ (పీఎం కిసాన్‌) సమ్మాన్‌ నిధి కార్యక్రమంలో మరో 6 లక్షల మందిని లబ్ధిదారుల జాబితాలో చేర్చడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 11 Jul 2024 02:07 IST

కేబినెట్‌  సమావేశంలో నిర్ణయాలు

 కేబినెట్‌ సమావేశంలో సీఎం మోహన్, ఉపముఖ్యమంత్రులు ప్రభాతి పరిడ, కనకవర్ధన్‌ సింగ్‌దేవ్‌

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ప్రధానమంత్రి కిసాన్‌ (పీఎం కిసాన్‌) సమ్మాన్‌ నిధి కార్యక్రమంలో మరో 6 లక్షల మందిని లబ్ధిదారుల జాబితాలో చేర్చడానికి ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం లోక్‌సేవాభవన్‌లో ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌ మాఝి అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరిగింది. అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడుతూ.. అన్నదాతల ప్రయోజనాలకు కట్టుబడిన ప్రభుత్వం పీఎం కిసాన్‌లో బలహీన రైతులకు అవకాశం కల్పిస్తుందని, దీనిపై చర్చించామన్నారు. పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని కార్మికులకు చెల్లిస్తున్న కూలి పెంచామన్నారు. మట్టి పనులు చేసే సామాన్య కూలీల రోజువారీ కూలి రూ.352 నుంచి రూ.450లకు, మధ్యతరహా కూలీలకు రూ.392 నుంచి రూ.500లు, నిపుణులకు రూ.502లుగా ఉన్న కూలీ రూ.600కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. పాఠశాలల్లో 20 వేల మంది ఉపాధ్యాయులను నియమించనున్నామన్నారు. రాష్ట్రంలో మాతృభాష (ఒడియా)కు గ్రహణం పట్టినందున భాషాభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని విశ్వ విద్యాలయాల్లో ఒడియా పీఠాలు ఏర్పాటవుతాయని, తాళపత్ర గ్రంథాల సంరక్షణకు పెద్దపీట వేస్తామన్నారు. అన్ని స్కూళ్లలో మాతృభాషలో బోధన జరిగేలా చర్యలు తీసుకుంటామని, సాంస్కృతిక భవన నిర్మాణం జరుగుతుందని, దీనికోసం రూ.200 కోట్లు కార్పస్‌ నిధి కేటాయించనున్నట్లు సీఎం చెప్పారు. కటక్‌ బాలి జాతరకు అంతర్జాతీయ గుర్తింపు దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. రూ.1,084 కోట్ల వ్యయంతో మూలపడిన సాగునీటి ప్రాజెక్టులను వినియోగంలోకి తెస్తామని మోహన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని