logo

మలేరియాకు ముకుతాడు పడేదెప్పుడో!

రాయగడ జిల్లాలో మలేరియా మహమ్మారికి ముకుతాడు వేయడంలో అధికారులు విఫలమవుతుండడం ప్రజలకు శాపంగా మారుతోంది.

Updated : 11 Jul 2024 06:42 IST

జిల్లాలో చాపకింద నీరులా విస్తరిస్తున్న వ్యాధి
కానరాని నియంత్రణ చర్యలు
రాయగడ పట్టణం, న్యూస్‌టుడే

దోమలకు నిలయంగా పూడిక తీయని మురుగునీటి కాలువ

రాయగడ జిల్లాలో మలేరియా మహమ్మారికి ముకుతాడు వేయడంలో అధికారులు విఫలమవుతుండడం ప్రజలకు శాపంగా మారుతోంది. ఏటా పెరుగుతున్న కేసుల్లో ఈ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కె.సింగుపూర్‌ సమితిలో తాజాగా 100 మందికిపైగా ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు మలేరియా సోకిన విషయం తెలిసిందే. గతంలోనూ మునిగుడ, బిసంకటక్, కె.సింగుపూర్‌ సమితుల్లో వ్యాధి విజృంభించింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు హడావుడి చర్యలతో సరిపెట్టుకుంటున్న యంత్రాంగం ఆ తరువాత చేతులు దులిపేసుకుంటుండడంతో కథ మొదటికి వస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయి నివారణ చర్యలు కానరాకపోవడంతో ఏటా సమస్య జటిలమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 13 సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ) ఉన్నాయి. ఒక్కో సీహెచ్‌సీ పరిధిలో నెలకు సగటున 50 పాజిటివ్‌ కేసులు నమోదవుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జనవరి- మే మధ్య ఇలాంటి పరిస్థితి ఉంటే, ఇకపై వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నందున కేసుల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కె.సింగుపూర్‌ సమితిలో ఆశ్రమ పాఠశాలలో తాజాగా వెలుగు చూసిన మలేరియా కేసులను ఇందుకు ఉదహరణగా చెబుతున్నారు.

కాలం చెల్లిన దోమ తెరలు

మలేరియా నియంత్రణలో భాగంగా జిల్లాలో పంపిణీ చేసిన దోమతెరలకు కాలం చెల్లి దాదాపు రెండేళ్లు పూర్తవుతోంది. 2019లో పంపిణీ చేసిన వీటి కాల పరిమితి 2022(మూడేళ్లు)లోనే ముగిసినా, ఇంతవరకు కొత్త దోమతెరల ఊసేలేదు. ఈ నేపథ్యంలో చాలాచోట్ల దోమతెరలను మొక్కలకు రక్షణగా, చేపలు పట్టేందుకు, ఇతరత్రా కార్యకలాపాలకు వినియోగిస్తుండడం గమనార్హం. గతేడాది జనవరి-మే తో పోల్చుకుంటే ఈ ఏడాది అదే సమయానికి మలేరియా పాజిటివ్‌ కేసులు ఎక్కువ నమోదైనట్లు రికార్డులు పేర్కొంటున్నాయి. గతేడాది జనవరి- మే మధ్య 2,245 కేసులు నమోదు కాగా, ఈ ఏడాదిలో ఇదే సమయానికి 2,508 నమోదయ్యాయి.

మొక్కలకు రక్షణ వలయంగా వాడుతున్న దోమతెర

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు