logo

ఘోర తప్పిదానికి బాధ్యులెవరు?

బలభద్రుని పొహండి వేడుకలో జరిగిన ఘోర తప్పిదానికి బాధ్యులెవరు? దారు (దివ్య) విగ్రహం ఎందుకు ముందుకు ఒరిగింది? సేవలతో ప్రమేయం లేని యువ సేవాయత్‌లు అధిక సంఖ్యలో రథంపై గుంపుగా ఉండడమే ఇందుకు కారణమా?

Published : 11 Jul 2024 02:10 IST

అగ్రజుని విగ్రహం ఎందుకు ఒరిగింది?
అనుభవంలేని యువసేవాయత్‌లతో పొహండి
ఇది జగన్నాథేచ్ఛ అన్న మంత్రి హరిచందన్‌
సీఎం, నవీన్‌ల ఆవేదన: భక్తుల్లో అసంతృప్తి

ఒరిగిన బలభద్రుని విగ్రహం

గోపాలపూర్, న్యూస్‌టుడే: బలభద్రుని పొహండి వేడుకలో జరిగిన ఘోర తప్పిదానికి బాధ్యులెవరు? దారు (దివ్య) విగ్రహం ఎందుకు ముందుకు ఒరిగింది? సేవలతో ప్రమేయం లేని యువ సేవాయత్‌లు అధిక సంఖ్యలో రథంపై గుంపుగా ఉండడమే ఇందుకు కారణమా? లేక చారమాల సక్రమంగా కట్టలేదా? అన్నది చర్చనీయాంశమైంది. భక్తుల్లో అసంతృప్తి, ఆవేదన వ్యక్తమైంది.

ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారు

పూరీ గుండిచా ఆలయం వద్ద జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల (చతుర్థామూర్తులు) పొహండి మంగళవారం రాత్రి సేవాయత్‌లు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారు. సేవలతో ప్రమేయం లేనివారు రథాలపై గుంపులుగా పొగయ్యారు. భక్తుల నుంచి సంభావన (దక్షిణ) అందుకోవడానికి సేవాయత్‌లకు పొహండి వేడుక గొప్ప అవకాశం. వేడుక తిలకించడానికి వచ్చిన భక్తులతో గుండిచా ఆవరణ కిక్కిరిసిపోయింది. తొలుత రాముడు, కృష్ణుడు (జగన్నాథుడి ఉత్సవ విగ్రహాలు), సుదర్శనుని పొహండి తర్వాత బలభద్రున్ని అమ్మ సన్నిధికి తీసుకెళ్లే సమయంలో రథంపై సేవాయత్‌లు ఎక్కువ సమయం తీసుకున్నారు. స్వామి వెనుకవైపు ‘చారమాల’ సక్రమంగా కట్టలేదు. దివ్య విగ్రహాల తరలింపు ఘట్టంలో ఊపుతూ తీసుకెళతారు. వెనుక చారమాల కట్టడంలో లోపం ఉంటే విగ్రహం ముందుకు ఒరిగిపోతుంది. కలపతో తయారైన విగ్రహాలు బరువు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో శ్రీక్షేత్ర, గుండిచా పొహండి వేడుకల్లో అనుభవం గల సేవాయత్‌లు నిష్టగా తమ విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

సేవాయత్‌ల తప్పిదం లేదు: మంత్రి

ఈ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌ మాఝి, విపక్షనేత నవీన్‌ పట్నాయక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అపచారాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నవీన్‌ పేర్కొన్నారు. సీఎం రాత్రికి రాత్రి ఉపముఖ్యమంత్రి ప్రభాతి పరిడ, న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్‌ హరిచందన్‌లను పూరీ పంపించారు. పరిస్థితి అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఈ ఘటనలో 7 మంది సేవాయత్‌లు గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ప్రభాతి పరామర్శించారు. న్యాయశాఖ మంత్రి హరిచందన్‌ రాత్రి 12 వరకు పూరీలో ఉన్నారు. చతుర్థామూర్తుల పొహండి ముగిసే వరకు పరిస్థితి సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పొహండి ఘటనను జగన్నాథేచ్ఛగా అభివర్ణించారు. ఇందులో సేవాయత్‌ల తప్పిదమేమీ తమ దృష్టికి రాలేదన్నారు. ఇలాంటి అపశ్రుతులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, బహుడా, నీలాద్రి బిజె పొహండి సక్రమంగా చేపడతామన్నారు. ఉపముఖ్యమంత్రి ప్రభాతి మాట్లాడుతూ.. గాయపడిన సేవాయత్‌లంతా బాగున్నారని, సీఎం ఆదేశాల మేరకు దీనిపై నివేదిక సమర్పిస్తామని చెప్పారు.

ఆసుపత్రిలో గాయపడిన సేవాయత్‌ను పరామర్శిస్తున్న ప్రభాతి

జనసంద్రంగా శారదాబలి

చతుర్థామూర్తుల గుండిచా పొహండిని పురస్కరించుకొని శారదాబలి ఆవరణ జనసంద్రంగా మారింది. జగన్నాథ నామస్మరణ, కీర్తనల ఆలాపనతో మార్మోగింది. రాత్రి ఒంటిగంట వరకు భక్తులు ఆలయాన్ని వీడలేదు. గుండిచా మందిరంలోని అడప మండపంపై దివ్య విగ్రహాలు ఆసీనమయ్యాక సేవాయత్‌లు మంగళహారతి, అబకాశ, మైలం, తిలకధారణ, జగన్నాథుని బొడొసింహార సేవలు చేపట్టారు.

ఎవర్నీ ఖాతరు చేయరు

శ్రీక్షేత్ర సేవాయత్‌లలో కొంతమంది ఎవర్నీ ఖాతరు చేయడం లేదు. యంత్రాంగం ఆదేశాలు పట్టించుకోరు. సేవలతో ప్రమేయం లేని వారు రథాలపై ఉండరాదన్న నిబంధన పూరీలో అమలుకావడం లేదు. విర్రవీగుతున్నవారిపై అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని