logo

Mohan majhi: 5 రోజుల్లో లక్ష మందిని కలిసిన ఒడిశా సీఎం

ప్రజా సమస్యలు వినేందుకు ప్రజాప్రతినిధులు ఐదు నిమిషాలు కేటాయించడమంటే గగనంగా మారిపోతున్న రోజులివి.

Updated : 18 Jun 2024 08:30 IST

రాయగడ పట్టణం, భువనేశ్వర్, న్యూస్‌టుడే: ప్రజా సమస్యలు వినేందుకు ప్రజాప్రతినిధులు ఐదు నిమిషాలు కేటాయించడమంటే గగనంగా మారిపోతున్న రోజులివి. అలాంటిది కేవలం ఐదు రోజుల్లో దాదాపు లక్ష మందికి తనను కలిసే అవకాశం కల్పించి ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌ మాఝి వార్తల్లో నిలిచారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత రాష్ట్ర అతిథి గృహంలో తనను ప్రజలు కలిసేందుకు ఆయన అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో ఎంతో మంది ప్రముఖులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు నుంచి సాధారణ ప్రజలు వరకు దాదాపు లక్షమందిని సీఎం కలవడం గమనార్హం.

 అర్జున్‌కు గ్లాసుతో నీరు తాగిస్తున్న సీఎం మాఝి

ఈ సందర్భంగా ప్రమాదంలో కాళ్లు పొగొట్టుకున్న అర్జున్‌ నాయక్‌ అనే ఉపాధ్యాయుడు ఆదివారం ముఖ్యమంత్రిని కలిశారు. తనను కలిసేందుకు వచ్చిన ఆయనకు సీఎం లేచి నిలబడి ఓ గ్లాసు మంచినీరు తాగించడం చూసి అంతా నివ్వెరపోయారు. అతిథి గృహంలో ప్రజలతో కలయిక పూర్తయిన అనంతరం సీఎం మోహన్‌ మాట్లాడుతూ... తమ ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలలో రాష్ట్రం 50 ఏళ్ల అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం నుంచి ఎంతో ఆశిస్తున్న ప్రజల మద్దతు ఇందుకు ఎంతో అవసరమన్నారు. కింద స్థాయి, క్షేత్రస్థాయి నుంచి వచ్చిన తనకు ప్రజల కష్టాలు తెలుసని, వారి బాధలు ఒక్కసారి విన్నాక వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని