logo

Jagannath Temple in Puri: రెండు రోజులు జరగనున్న రథయాత్ర

ఈ నెల 22న దేవస్నాన పౌర్ణమి, జులై 7న విశ్వ ప్రసిద్ధ రథయాత్ర, తిథి, నక్షత్రాల ప్రకారం ఈసారి ఒనొసొనొ (చీకటి) మందిరంలో జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల (చతుర్థా మూర్తులు) రహస్య సేవలు 13 రోజులు చేపడతారు.

Updated : 16 Jun 2024 09:34 IST

తిథి, వార, లగ్న నక్షత్రాల ఆధారంగా నిర్ణయం
53 ఏళ్ల తరువాత పునరావృతం 

విశ్వ ప్రసిద్ధ రథయాత్ర (పాతచ్రితం)

గోపాలపూర్, న్యూస్‌టుడే: ఈ నెల 22న దేవస్నాన పౌర్ణమి, జులై 7న విశ్వ ప్రసిద్ధ రథయాత్ర, తిథి, నక్షత్రాల ప్రకారం ఈసారి ఒనొసొనొ (చీకటి) మందిరంలో జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల (చతుర్థా మూర్తులు) రహస్య సేవలు 13 రోజులు చేపడతారు. రథయాత్ర రోజే పురుషోత్తముని నేత్రోత్సవం చేయాల్సి ఉంది. 53 ఏళ్ల తర్వాత ఈ పరిస్థితి పునరావృతమైంది. తిథి, వార నక్షత్రాల కారణంగా ఇలా జరిగినట్లు సేవాయత్‌లు తెలిపారు. జులై 7న యాత్ర క్రతువు ముగిసే సరికి రాత్రి అవుతుంది. నిబంధనల ప్రకారం ఆ సమయంలో రథలు లాగకూడదు. దీంతో జులై 8న రథాలు లాగే కార్యక్రమం ఉంటుంది. 

 దేవస్నాన వేడుక 

22 నుంచి రహస్య సేవలు 

శుక్రవారం రాత్రి పూరీ నీలాద్రి భక్తనివాస్‌లో శ్రీక్షేత్ర పాలనాధికారి వీర్‌ విక్రం యాదవ్‌ అధ్యక్షతన 36 తెగల సేవాయత్‌లతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టరు సిద్ధార్థ్‌ శంకర్‌ స్వయిన్, ఎస్పీ పినాకిమిశ్ర ఇతర అధికారులు పాల్గొన్నారు. సమీక్ష తర్వాత తీసుకున్న నిర్ణయాల మేరకు 22న దేవస్నాన యాత్ర జరుగుతుంది. తెల్లవారు జాము 4 గంటలకు చతుర్ధామూర్తుల పొహండి ప్రారంభిస్తారు. 6 గంటలకు ఈ వేడుక ముగుస్తుంది. స్నానవేదికపై చతుర్దామూర్తులను ఆసీనులను చేస్తారు. తరువాత మంగళహారతి, గంగ, యమున బావుల నుంచి 108 కలశాల పవిత్ర జలం తీసుకొచ్చి చందనం, పసుపు, కస్తూరి, ఇతర సుగంధ ద్రవ్యాలు కలిపి స్నానవేడుక నిర్వహిస్తారు.  మధ్యాహ్నం 3 తర్వాత జగన్నాథుడి గజానన అవతారం ఏర్పాట్లు జరుగుతాయి. మంగళహారతి తరువాత భక్తులకు స్వామి దర్శన అవకాశం కల్పిస్తారు. 10.30 తరువాత చీకటి మందిరానికి మూర్తులను తరలిస్తారు. రహస్య సేవల ఘట్టం ప్రారంభమవుతుంది. 13 రోజులపాటు అనేక సేవలు చేస్తారు. 

ఒక అడుగు కదిలించి 

జులై 7న నేత్రోత్సవం, రథయాత్ర ఒకే రోజు జరగనుండటంతో మధ్యాహ్నం వరకు శ్రీక్షేత్రంలో ప్రత్యేసేవలు చేపడతారు. అనంతరం పురుషోత్తముని నవయవ్వన వేడుక నిర్వహించి. తరువాత రథయాత్ర పొహండి సాయంత్రం వరకు జరుగుతుంది. అనంతరం రథాల ప్రతిష్ఠ, ధ్వజస్థాపన, చెరాపహరా, సారథి, ఆశ్వాల అమరిక పూర్తయ్యే సరికి చీకటి పడుతుంది. ఈ నేపథ్యంలో ఆనవాయితీ ప్రకారం తొలుత బలభద్రుని తాళధ్వజ రథం పెంచిన తల్లి (గుండిచాదేవి) ఆలయానికి బయలు దేరాల్సి ఉండగా, ఒక్క అడుగు రథం ముందుకు లాగి ఉంచేస్తారు. మూడు రథాలు రాత్రంతా శ్రీక్షేత్రం వద్దే ఉండిపోతాయి. 8న మూడు రథాలు గుండిచా దేవి సన్నిధికి చేరుకుంటాయి. జులై 15న బహుడా యాత్ర జరుగుతుంది. 16న సున్నాభెషో ఉత్సవం నిర్వహిస్తారు. 

రథాలపైనే దర్శనభాగ్యం 

ఏడాదికోసారి పురుషోత్తముని నవయవ్వన దర్శనానికి భక్తులు వేచిచూస్తారు. ఈ సారి స్వామిని తిలకించే అవకాశం ఉండదు. రథాలపైకి దేవదేవుళ్లను తీసుకొచ్చి తరువాత ప్రజలకు దర్శనభాగ్యం కలుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని