logo

Puri Temple: 40 ఏళ్లకు మోక్షం.. 8న తెరుచుకోనున్న పూరీ రత్నభాండాగారం

ఎట్టకేలకు పూరీ శ్రీక్షేత్రం రత్నభాండాగారం తెరుచుకోనుంది. 40 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. జులై 8న తెరిచి మరమ్మతులు చేపడతామని పురావస్తుశాఖ (ఏఎస్‌ఐ) తెలిపింది.

Updated : 20 Jun 2024 08:14 IST

పూరీ శ్రీక్షేత్రం

గోపాలపూర్, న్యూస్‌టుడే: ఎట్టకేలకు పూరీ శ్రీక్షేత్రం రత్నభాండాగారం తెరుచుకోనుంది. 40 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. జులై 8న తెరిచి మరమ్మతులు చేపడతామని పురావస్తుశాఖ (ఏఎస్‌ఐ) తెలిపింది. హామీ ప్రకారం భాజపా ప్రభత్వం అధికారం చేపట్టిన 12 గంటల్లోగా జగన్నాథ సన్నిధి నాలుగు ద్వారాల నుంచి ప్రవేశానికి అనుమతించారు. ఇప్పుడు రత్నభాండాగారంపై దృష్టిసారించారు.

సమావేశంలో రాని ప్రస్తావన

బుధవారం పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌ దేవ్‌ అధ్యక్షతన జరిగిన పాలకవర్గం సమావేశంలో ఈ ప్రస్తావన రాలేదు. సమావేశం అనంతరం ఏఎస్‌ఐ సూపరింటెండెంట్‌ డి.బి.గడనాయక్‌ విలేకరులకు ఈ విషయాన్ని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జులైన 8న తలుపులు తెరిచి మరమ్మతులు చేస్తామన్నారు. 2019 ఫిబ్రవరి 4న అప్పట్లో ఏర్పాటైన నిపుణుల సంఘం రత్నభాండాగారం లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించినా.. తాళం చెవి కనిపించకపోవడంతో వెళ్లలేకపోయారు. బయట నుంచే గోడలు పరిశీలించి గోడలు, పైకప్పు బలహీనంగా మారి, పగుళ్లు ఏర్పడినట్లు గుర్తించారు. అదే సంవత్సరం ఫిబ్రవరి 23న ఏఎస్‌ఐ అధికారులు లేజర్‌ స్కానింగ్‌ చేసి మరోసారి నిర్ధారించుకున్నారు. ఆ అప్పటి నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వానికి శ్రీక్షేత్రపాలక వర్గానికి సమర్పించారు. ప్రస్తుతం జరిగే మరమ్మతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోర్‌కమిటీ, టెక్నికల్‌ కమిటీ నిపుణుల సూచనల మేరకు జరుగుతాయన్నారు. దీనికి ఎన్ని రోజులు పడుతుందో గడనాయక్‌ స్పష్టత ఇవ్వలేదు. పురుషోత్తముని ఆభరణాల లెక్కింపు అంశంపైనా మాట్లాడలేదు.

త్వరలో తెలియజేస్తాం

శ్రీక్షేత్ర పాలనాధికారి వీర్‌ విక్రం యాదవ్‌ విలేకరులతో మాట్లాడుతూ... రత్నభాండాగారం తెరవడానికి ముందుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంఘం సమావేశమవుతుందని సంపద లెక్కింపు, భద్రతకు సంబంధించి నిర్ణయం జరిగిన తర్వాత మరిన్ని వివరాలు చెబుతామన్నారు.

భక్తుల్లో హర్షం

రత్నభాండాగారం తలుపులు తెరవనున్నట్లు ప్రకటించడంతో భక్తుల్లో ఆనందం వెల్లివిరిసింది. సేవాయత్‌లు హర్షం వ్యక్తం చేశారు. భాజపా ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకుందన్నారు. తలుపులు తెరిచిన తర్వాత మరమ్మతులు జరిపిస్తే ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. రథయాత్రలో జగన్నాథుడు సుమారు 13 రోజులు ఆలయం బయట తల్లి గుండిచా మందిరంలో ఉంటాడు. ఈ వ్యవధిలో మరమ్మతులు పూర్తి చేయగలరో లేదో వేచి చూడాలి. అందులో ఉన్న నిధిని లెక్కించడం త్వరగా జరిగే ప్రక్రియ కాదు. ఇలాంటి సున్నిత అంశాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అంతా చర్చించుకుంటున్నారు.

1984 తర్వాత తెరవలేదు

1976లో నందని శత్పథి ప్రభుత్వం రత్నభాండాగారం తెరిపించి ఆభరణాల లెక్కించి, వాటి వివరాలు భద్రపర్చింది. మళ్లీ 1984లో జె.బి.పట్నాయక్‌ సర్కార్‌ మరోసారి తెరిచి మళ్లీ లెక్కింపు చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని మొక్కబడిగా నిర్వహించడంతో వివరాలు వెల్లడి కాలేదు. 2000లో అధికారంలోకి వచ్చిన నవీన్‌ దీనిపై ఆసక్తి చూపలేదు. హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు ఈ అంశం వెళ్లినా.. స్పందించలేదు.


దేవస్నానం, రథయాత్రపై సమీక్ష

పాలక వర్గం సమావేశంలో గజపతి దివ్యసింగ్‌ దేవ్, ఇతర ప్రతినిధులు

గోపాలపూర్, న్యూస్‌టుడే: పూరీ నీలాద్రి భక్తనివాస్‌లో బుధవారం మధ్యాహ్నం రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్‌ అధ్యక్షతన శ్రీక్షేత్ర పాలక వర్గం సమావేశం జరిగింది. ఈ నెల 22న జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల (చతుర్థా మూర్తులు) దేవస్నానం, జులై 7న జరగనున్న రథయాత్రపై కూలంకషంగా చర్చ జరిగింది. అన్ని అంశాలను సమీక్షించారు. ఈసారి చతుర్థామూర్తుల చీకటి మందిరంలో రహస్య సేవలు 13 రోజులు మాత్రమే జరగనున్నాయి. జులై 7న పురుషోత్తముని నవయవ్వన (నేత్రోత్సవం) వేడుక, రథయాత్ర ఒకేరోజు కావడంతో స్వామి సేవలకు అంతరాయం లేకుండా చూడాలని, నిర్ణీత వేళల్లో కార్యక్రమాలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని గజపతి యంత్రాంగానికి సూచించారు. కార్యక్రమాల సూచీ (అజెండా) వెంటనే ముద్రించాలన్నారు. సమావేశంలో పాలనాధికారి వీర్‌విక్రం యాదవ్, పూరీ కలెక్టరు సిద్ధార్థ్‌ శంకర్‌ స్వయిన్, ఎస్పీ పినాకి మిశ్ర, అభివృద్ధి అధికారి అజయ్‌ జెనా, ఇతర అధికారులు, పాలకవర్గం ప్రతినిధులు పాల్గొన్నారు. స్వామి రహస్య సేవలతో ప్రమేయం ఉన్న కొంత మంది దైతాపతి సేవాయత్‌లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని