logo

Odisha: బంగారు ఆభరణాలు చోరీ

బస్సులో తోటి ప్రయాణికుడిగా మత్తు పదార్థం కలిపిన పానీయమిచ్చి శుభ్రత్‌ పాఢి అనే యువకుడి బంగారు ఆభరణాలు లూటీ చేయగా, అస్వస్థతకు గురైన బాధితుడు పాఢి ఎమ్కేసీజీ ఆసుపత్రిలో చికిత్సతో కోలుకున్నాడు.

Updated : 25 Jun 2024 17:13 IST

బ్రహ్మపుర నగరం: బస్సులో తోటి ప్రయాణికుడిగా మత్తు పదార్థం కలిపిన పానీయమిచ్చి శుభ్రత్‌ పాఢి అనే యువకుడి బంగారు ఆభరణాలు లూటీ చేయగా, అస్వస్థతకు గురైన బాధితుడు పాఢి ఎమ్కేసీజీ ఆసుపత్రిలో చికిత్సతో కోలుకున్నాడు. గంజాం జిల్లా చికిటి సమితిలోని లోకనాథపూర్‌ గ్రామానికి చెందిన పాఢి మంగళవారం ఎమ్కేసీజీ మెడిసిన్‌ వార్డులో విలేకరులకు వివరాలు తెలిపాడు. బాధితుడు సోమవారం భువనేశ్వర్‌లో ఓ ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. సాయంత్రం అక్కడి బరముండ బస్టాండు నుంచి బస్సులో బ్రహ్మపుర బయలుదేరాడు. బస్సులో అతడి పక్కన కూర్చున్న గుర్తు తెలియని యువకుడు పాఢితో మాటలు కలిపాడు. తను బెంగళూరు నుంచి బ్రహ్మపుర వెళుతున్నానని, ఓ హోటల్‌లో వంట మనిషిగా పనిచేస్తున్నానని చెప్పాడు. తన చరవాణి నెంబరు కూడా పాఢికు ఇచ్చాడు. అతడిని మాటల్లో పెట్టిన గుర్తు తెలియని యువకుడు పాఢికు తెరిచి ఉన్న ఓ అమూల్‌ కూల్‌ శీతల పానీయం అందించాడు. తానొక పానీయం తాగాడు. అది తాగిన కొంతసేపటి తర్వాత పాఢి స్పృహ కోల్పోయాడు. బ్రహ్మపురలో బాధితుడికి స్పృహ వచ్చింది. తన మెడలోని బంగారం గొలుసు, చేతి వేలికున్న ఉంగరం కనిపించలేదు. పక్క సీట్లో ఉన్న గుర్తు తెలియని యువకుడు కూడా మాయమయ్యాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు బి.ఎన్‌.పూర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుర్తు తెలియని యువకుడు ఇచ్చిన చరవాణి నెంబరుకు సంప్రదించగా, అది పనిచేయడంలేదని తేలడంతో దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని