logo

రైలు ప్రమాదంలో తెగిపడిన కాళ్లు

అనుకోని ప్రమాదంలో ఓ వ్యక్తి తన రెండు కాళ్లూ పోగొట్టుకున్నాడు. ఏం జరిగిందో తెలిసేలోపే తన శరీరం నుంచి తెగిపడడంతో అతడి రోదన వర్ణనాతీతంగా మారింది.

Published : 18 Jun 2024 02:09 IST

గంటల పాటు నరకయాతన

కొత్తవలస, న్యూస్‌టుడే: అనుకోని ప్రమాదంలో ఓ వ్యక్తి తన రెండు కాళ్లూ పోగొట్టుకున్నాడు. ఏం జరిగిందో తెలిసేలోపే తన శరీరం నుంచి తెగిపడడంతో అతడి రోదన వర్ణనాతీతంగా మారింది. ఈక్రమంలో కొన్ని గంటల పాటు నరకయాతన అనుభవించాడు. అనంతరం స్పృహ కోల్పోయాడు. దాదాపు 11 గంటల తరువాత స్థానికులు గుర్తించడంతో ఆసుపత్రిలో చేరి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషాదకర ఘటన కొత్తవలసలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. కొత్తవలసకు చెందిన జి.పెంటయ్య(58) ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో బహిర్భూమికని స్థానిక రైలు పట్టాల వైపు వెళ్లాడు. అదే సమయంలో ఓ గుర్తుతెలియని రైలు వచ్చింది. గమనించకపోవడంతో పట్టాలపైనే ఇరుక్కుపోయాడు. ఈక్రమంలో అతని రెండు కాళ్లు లోపలి భాగంలో ఉండడంతో తెగిపడ్డాయి. అక్కడే గంటల తరబడి రోదించాడు. బాధను తట్టుకోలేక నరకయాతన అనుభవించాడు. రాత్రి సమయం కావడంతో ఎవరూ గుర్తించలేకపోయారు. కొంతసేపటి తరువాత స్పృహ కోల్పోయాడు. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో స్థానికులు చూశారు. 108 వాహనంలో విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారని 108 వాహన టెక్నీషియన్‌ ఈశ్వరరావు చెప్పారు.


ప్రాణం తీసిన నిద్రమత్తు

మేడ పైనుంచి పడి ఇంటిపెద్ద దుర్మరణం

వంగర, న్యూస్‌టుడే: నిద్రమత్తు ఓ వ్యక్తిని బలిగొంది. మేడ పైనుంచి జారిపడడంతో ఇంటిపెద్ద మృత్యువాత పడిన ఘటన వంగర మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. రాజాం పట్టణంలోని చిన్నచెరువు గట్టు ప్రాంతానికి చెందిన బి.వెంకటరావు(30) అరసాడ కూడలిలో ఉన్న ఓ బేకరీలో వంట మనిషిగా పని చేసేవారు. ఆదివారం ఇంటికి ఆలస్యంగా వస్తానని భార్యకు ఫోన్‌ చేశారు. అయితే రాకుండా రాత్రికి అక్కడే మేడపై నిద్రపోయారు. రక్షణ గోడలు లేకపోవడంతో నిద్రమత్తులో అర్ధరాత్రి సమయంలో ప్రమాదవశాత్తూ జారిపడినట్లు స్థానికులు అతని భార్య మహేశ్వరికి సమాచారం అందించారు. ఈలోపు బాధితుడ్ని హుటాహుటిన అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. తీవ్రగాయాలతో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జనార్దన్‌ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని