logo

గెడ్డగూడ ఘాట్‌లో వ్యాన్‌ బోల్తా

సీతంపేట మండలం గెడ్డగూడ సమీపంలోని ఘాట్‌ రోడ్డుపై సోమవారం తెల్లవారుజామున ఓ వ్యాన్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 16 మంది గిరిజనులు తీవ్రంగా గాయపడ్డారు.

Published : 18 Jun 2024 02:14 IST

16 మంది గిరిజనులకు తీవ్ర గాయాలు
వారపు సంతకు వెళ్తుండగా ఘటన

సీతంపేట, న్యూస్‌టుడే: సీతంపేట మండలం గెడ్డగూడ సమీపంలోని ఘాట్‌ రోడ్డుపై సోమవారం తెల్లవారుజామున ఓ వ్యాన్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 16 మంది గిరిజనులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాండ్ర, కిండ్రువాడ గ్రామాల నుంచి 25 మంది అటవీ ఉత్పత్తులతో సీతంపేటలో జరిగిన వారపు సంతకు బయలుదేరారు. గెడ్డగూడ దాటాక ఘాట్‌ దిగుతున్న సమయంలో వాహనం అదుపుతప్పింది. ఒక్కసారిగా వెనక్కి పల్టీలు కొట్టడంతో అందులో ఉన్నవారంతా కింద పడిపోయారు. పనస, అనాస, ఇతర అటవీ ఉత్పత్తులు చెల్లాచెదురయ్యాయి.

మిన్నంటిన హాహాకారాలు..

వాహనం బోల్తా పడిన వెంటనే ప్రయాణికులంతా బయటకు వచ్చేశారు. అయితే అప్పటికే వారికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలంలో వారి హాహాకారాలు మిన్నంటాయి. దీంతో స్థానికులు, అటుగా వెళ్లిన వాహనదారులు స్పందించారు. 108తో పాటు ఐటీడీఏ అంబులెన్సులకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను వెంటనే సీతంపేట ప్రాంతీయాసుపత్రికి తరలించారు. సూపరింటెండెంట్‌ బి.శ్రీనివాసరావు, ఆర్‌ఎంవో గౌరీశంకరరావు, ఆర్థో వైద్య నిపుణుడు కొల్ల రాజేష్‌ పర్యవేక్షణలో వైద్యులు సేవలు అందించారు. తలకు తీవ్రగాయమై పరిస్థితి విషమంగా ఉన్న సవర జర్నియాను రాగోలులోని జెమ్స్‌కు రిఫర్‌ చేశారు. గంగారావు, బూగన్న, సొంబురు, తిక్కమయి, తౌడు, ఎల్లంగును శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి పంపారు. సవర లుక్కో, కువ్వారి, మాసయ్య, బెన్న, దాలమ్మ, వీరన్న, కుర్నియాల్, సన్నాయి, చంద్రయ్య ప్రాంతీయాసుపత్రిలోనే ఉన్నారు. బాధితులను పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ సోదరుడు, తోటపల్లి ప్రాజెక్టు మాజీ ఛైర్మన్‌ నిమ్మక పాండురంగ, తెదేపా మండలాధ్యక్షుడు సవర తోటముఖలింగం తదితరులు పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై పి.సంజీవ్‌ తెలిపారు.

వరుస ప్రమాదాలతో కలవరం...

సీతంపేట మన్యంలోని ఘాట్‌ రోడ్లపై తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో గిరిజనులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన మార్గాల్లో తప్ప గిరిజన తండాలకు బస్సులు తిరిగే పరిస్థితి లేకపోవడంతో ఆటోలు, వ్యాన్‌లు, ఇతర వాహనాలను ఆశ్రయిస్తున్నారు. శుభకార్యాలు, ఉత్సవాలు, వారపు సంతలు జరిగే రోజుల్లో ప్రైవేటు వాహనాల్లో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. ఈక్రమంలో వాహనాలు ఘాట్‌లను ఎక్కలేక, దిగే సమయంలో అదుపుచేయలేక ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాలకు బ్రేకులు ఫెయిలవడం, టైర్లు అరిగిపోయి పేలిపోవడం, ఇంజిన్‌ సామర్థ్యం లేకపోవడం, సాంకేతిక లోపాలు తలెత్తడం, ఇతరత్రా అంశాలు కారణాలుగా నిలుస్తున్నాయి. ఇరువైపులా రక్షణ గోడలు నిర్మిస్తే ప్రమాదాల తీవ్రత తగ్గుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల ప్రమాదాలు ఇలా..

  • గతనెల 27న సీతంపేట మండలం వంబరిల్లి ఘాట్‌లో ఆటో బోల్తా పడిన సంఘటనలో 16 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు.
  • కొన్నిరోజుల క్రితం జజ్జువ వద్ద ఆటో బోల్తా పడి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
  • కొన్నినెలల క్రితం సీతంపేటలోని వైటీసీ వద్ద వాహనం అదుపు తప్పి 16 మంది క్షతగాత్రులయ్యారు.
  • రెండేళ్ల క్రితం చింతాడ ఘాట్‌లో ఆటో బోల్తా పడగా పది మంది ఆసుపత్రిపాలయ్యారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని