logo

వైకాపా విధానాలతో ఆర్థిక ఇబ్బందులు

పట్టణవాసుల నెత్తిపై బండలా మారిన చెత్తపన్నును కూటమి ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. ఈమేరకు అన్ని జల్లాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలోని విజయనగరం నగరపాలక సంస్థ, పార్వతీపురం పురపాలక సంఘంలో పన్ను విధించేవారు.

Published : 18 Jun 2024 02:19 IST

క్లాప్‌ బకాయిలపై అధికారులు తర్జనభర్జన
నిధుల సర్దుబాటు ప్రశ్నార్థకం!!
న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం, పార్వతీపురం పురపాలక  

పట్టణవాసుల నెత్తిపై బండలా మారిన చెత్తపన్నును కూటమి ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. ఈమేరకు అన్ని జల్లాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలోని విజయనగరం నగరపాలక సంస్థ, పార్వతీపురం పురపాలక సంఘంలో పన్ను విధించేవారు. ప్రస్తుత నిర్ణయంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్యాలు చేరుకోలేక ఇంతకాలం నోటీసులు అందుకున్న సచివాలయ శానిటేషన్‌ కార్యదర్శులు, సిబ్బంది ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇప్పటికే పేరుకుపోయిన బకాయిలపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో గందరగోళంలో పడ్డారు.

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌(క్లాప్‌) అమలులో భాగంగా గత ప్రభుత్వం చెత్తపన్నును తీసుకొచ్చింది. విజయనగరం నగరపాలక సంస్థలో ప్రతినెలా గృహ సముదాయాల నుంచి రెండు రకాలుగా వసూలు చేసేవారు. పేదల ఇళ్ల నుంచి రూ.60, మధ్యతరగతి వారైతే రూ.90 తీసుకునేవారు. వాణిజ్య దుకాణాలు, క్లినిక్‌లు, కల్యాణ మండపాలు, లాడ్జిల యజమానులను రూ.150 నుంచి రూ.15 వేల వరకు కట్టమనేవారు. పార్వతీపురంలో గృహాల నుంచి రూ.50, వాణిజ్య దుకాణాల నుంచి రూ.110- రూ.220 మధ్య వసూళ్లు సాగేవి. నగదు తీసుకుంటున్నా పారిశుద్ధ్య పనులు చేయకపోవడంతో పన్ను కట్టేందుకు ప్రజలు ముందుకు రాలేదు. దీంతో ప్రారంభంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. విజయనగరంలోని పలు ప్రాంతాల్లో నగరపాలక సిబ్బంది కొన్ని అపార్టుమెంట్ల ముందు చెత్త సైతం వేసేవారు.


సాధారణ నిధుల నుంచి..

విజయనగరంలో 84,624 గృహాలు, 4,123 వరకు వాణిజ్య దుకాణాలున్నాయి. ఇక్కడ చెత్తపన్ను వసూళ్ల డిమాండు నెలకు రూ.55.62 లక్షలుగా ఉంది. ఈ సొమ్ము నుంచి క్లాప్‌ వాహనాలకు కట్టాలి. అయితే ప్రజలు ముందుకు రాకపోవడంతో ఆ భారం నగరపాలికపై పడింది. మే నెలలో రూ.3 లక్షలు మాత్రమే వచ్చింది. ఇప్పటివరకు సాధారణ నిధుల నుంచి రూ.52 లక్షలు చెల్లించారు. ప్రైవేటు ఏజెన్సీకి ఇంకా రూ.3.15 కోట్ల మేర బకాయిలున్నాయి. ః పార్వతీపురం పురపాలికలో 13,557 గృహ సముదాయాలు, 650 వాణిజ్య దుకాణాలున్నాయి. నెలకు డిమాండు రూ.6.20 లక్షలు కాగా.. రూ.3.80 లక్షలు వచ్చేది. గత రెండు నెలల నుంచి ఆ సంఖ్య రూ.వేలకు పడిపోయింది. సాధారణ నిధుల నుంచి ఇప్పటివరకు రూ.19 లక్షలు కట్టారు. ఇంకా చెల్లించాల్సి ఉంది. ఈ నిధులను ఎలా సర్దుబాటు చేయాలన్నదానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. చెత్తపన్ను రద్దుకు ఇంకా ఉత్తర్వులు రాలేదని కమిషనర్లు ఎం.మల్లయ్యనాయుడు, కె.శ్రీనివాస్‌ తెలిపారు. బకాయిల విషయాన్ని కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళతామని చెప్పారు.


అమలు భారంగా..

రోవైపు క్లాప్‌ కార్యక్రమాన్ని సైతం వైకాపా పక్కాగా అమలు చేయలేకపోయింది. విజయనగరంలో చెత్త తరలింపునకు ఓ ప్రైవేటు ఏజెన్సీ నుంచి తొలుత 63 వాహనాలు కేటాయించారు. 2021 నవంబరులో వాటిని ప్రారంభించారు. ఈ మేరకు ఒక్కోవాహనానికీ అద్దె కింద సంబంధిత ఏజెన్సీకి రూ.68,943 చెల్లించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అంటే నెలకు ఏకంగా రూ.43.43 లక్షలు కట్టాల్సి వచ్చేది. ఏటా 5 శాతం అదనంగా పెంచారు. అంత భారం భరించలేక ఇక్కడి అధికారులు వాటిలో కొన్నింటిని వెనక్కి పంపించారు. ప్రస్తుతం 45 ఉండగా.. అందులో రెండింటిని పక్కనుంచారు. ఈక్రమంలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా సాగడం లేదు. ః పార్వతీపురంలో తొలుత 16 వాహనాలు నడిపేవారు. ఆర్థికభారంతో 10కి కుదించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని