logo

ప్రక్షాళన జరగాలి.. సహకారం అందాలి!!

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో (పీఏసీఎస్‌) రైతులే సభ్యులు. గతంలో సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారే పాలకవర్గాలను ఎన్నుకునేవారు. దీంతో మెరుగైన సేవలు అందేవి.

Published : 18 Jun 2024 02:23 IST

అయిదేళ్లలో నిస్తేజంగా పరపతి సంఘాలు
పాలకవర్గాల రాజీనామాలకు ప్రభుత్వ ఆదేశాలు

పార్వతీపురం, విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో (పీఏసీఎస్‌) రైతులే సభ్యులు. గతంలో సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారే పాలకవర్గాలను ఎన్నుకునేవారు. దీంతో మెరుగైన సేవలు అందేవి. రుణాలు, ప్రభుత్వ పథకాల అమలు విషయంలో పాలకవర్గం కృషి చేసేది. గత ప్రభుత్వంలో రాజకీయ పలుకుబడి ఉన్నవారిని నామినేట్‌ చేయడంతో సంఘాల్లో రగడ మొదలైంది. ఈక్రమంలో రుణ వితరణ ప్రక్రియ మందగించింది. పథకాల అమలుపై అధికార పార్టీ ముద్ర స్పష్టంగా కనిపించేది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం దీన్ని ప్రక్షాళనకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే నామినేటెడ్‌ పదవుల్లో ఉన్న వారిని రాజీనామాలు చేయాలని ఆదేశించింది. త్వరలోనే పారదర్శక ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది.

డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు నియమించిన ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీలు ఇప్పటికే రాజీనామాలు చేసినట్లు అధికారులు ధ్రువీకరించారు. డీసీసీబీ ఛైర్మన్‌ వేచలపు చిన రామునాయుడు, డీసీఎంఎస్‌ ఛైర్‌పర్సన్‌ అవనాపు భావన, సభ్యుల రాజీనామాలు ఆమోదించి ప్రభుత్వానికి పంపించినట్లు వెల్లడించారు. విజయనగరం జిల్లాకు సంబంధించి 65 సొసైటీల్లో 16 ప్రాంతాల్లోని కమిటీలు రాజీనామా చేయడంతో అవన్నీ ఆమోదం పొందాయి. కొన్నిచోట్ల సభ్యులు, ఇంకొన్ని సొసైటీల్లో ఛైర్మన్లు కూడా వైదొలిగారు. మిగిలిన వారిని బయటకు పంపించేందుకు కసరత్తు సాగుతోంది. వీరందరికీ పదవీకాలం జులై నెలాఖరు వరకు ఉంది. అప్పటి వరకు పర్సన్‌ ఇన్‌ఛార్జులను నియమించి, తర్వాత ఎన్నికల అంశం పరిశీలించే అవకాశముందని భావిస్తున్నట్లు జిల్లా సహకార అధికారి రమేష్, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీఈవో కె.జనార్దన్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.


నామినేటెడ్‌గా పదవులు

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 108 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. విజయనగరం 65, మన్యం జిల్లాలో 43 నడుస్తున్నాయి. 2013లో పీఏసీఎస్‌లకు ఎన్నికలు జరిగాయి. 2018లో కాలపరిమితి ముగియడంతో పాత పాలకవర్గాలనే కొనసాగించింది. ఆరు నెలల కాలానికి రెండు దఫాలుగా ఏడాది పాటు కొనసాగించింది. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలకవర్గాల స్థానంలో నామినేటెడ్‌ కమిటీలను నియమించింది. పీఏసీఎస్‌లకు త్రిసభ్య కమిటీలు(ఇందులో ఒక ఛైర్మన్, ఇద్దరు సభ్యులు ఉంటారు), డీసీఎంఎస్, డీసీసీబీలకు ఏడుగురు సభ్యుల కమిటీలు ఏర్పాటయ్యాయి. నామినేటెడ్‌ పేరుతో సొంత పార్టీ వారిని ఆయా స్థానాల్లో కూర్చోబెట్టింది. ప్రతి ఆరు నెలలకూ కాలపరిమితిని పొడిగిస్తూ అయిదేళ్లుగా వారినే కొనసాగిస్తూ వచ్చింది. జనవరిలో దిగిపోవాల్సి ఉన్నా.. మళ్లీ ఆరు నెలలు పెంచింది. ప్రస్తుతం వారంతా రాజీనామాలు చేయాల్సి రావడంతో.. కుర్చీలు దిగక తప్పడం లేదు.


ఎన్నికలకు హడావుడి..

2020లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన (మార్చి) సమయంలోనే గత ప్రభుత్వం సొసైటీల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేసింది. ఓటుహక్కు కోసం రూ.300 వాటాధనంగా నిర్దేశించి సభ్యత్వ నమోదు చేపట్టింది. పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేసింది. పెద్దమొత్తంలో వాటాధనం నిర్దేశించడంపై విమర్శలొచ్చాయి. అప్పటికే  మెజార్టీ సభ్యులకు రూ.10 వాటాధనమే ఉంది. ఇటువంటి వారు మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తేనే సభ్యత్వం ఉంటుందని చెప్పడంతో కొందరు తప్పక కట్టారు. అయినా ఎన్నికలు జరగలేదు. 2021 ఏప్రిల్‌లో మళ్లీ నిర్వహించేందుకు మంత్రివర్గంలో నిర్ణయించినా కార్యరూపం దాల్చలేదు. ఇలా ఐదేళ్లలో అయినంత వరకు సహకార సంస్థను నిస్తేజంగా మార్చేసింది వైకాపా. కొత్త ప్రభుత్వం రాకతో ప్రక్షాళన జరిగి.. సొసైటీలకు ఊపిరిలూదాలని రైతులు భావిస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని