logo

నాటి వైభవం.. చంద్రన్నతో సాధ్యం

మన్యంలోని గిరిశిఖర గ్రామాల్లో మాతాశిశు మరణాలు తగ్గించేందుకు గతంలో తెదేపా ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని సాలూరులో గిరిజన గర్భిణుల వసతి గృహం ఏర్పాటు చేసింది.

Published : 18 Jun 2024 02:26 IST

గర్భిణుల వసతి గృహాల్లో అయిదేళ్లు ఇబ్బందులు 

గుమ్మలక్ష్మీపురం, సాలూరు, న్యూస్‌టుడే: మన్యంలోని గిరిశిఖర గ్రామాల్లో మాతాశిశు మరణాలు తగ్గించేందుకు గతంలో తెదేపా ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని సాలూరులో గిరిజన గర్భిణుల వసతి గృహం ఏర్పాటు చేసింది. ఏడు నెలలు నిండిన గర్భిణులను ఇక్కడికి తీసుకొచ్చి కాన్పు అయ్యే వరకు పోషకాహారం అందించడంతో పాటు యోగా చేయించేవారు. 24 గంటలు ఇద్దరు ఏఎన్‌ఎంలు వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించేవారు. ఇక్కడ సత్ఫలితాలు రావడంతో గుమ్మలక్ష్మీపురంలో మరో వసతి గృహం ఏర్పాటు చేశారు.  

గిరిజన గర్భిణుల వసతి గృహాలు అందుబాటులోకి రావడంతో మన్యంలో మాతాశిశు మరణాలు తగ్గుముఖం పట్టాయి. నీతి ఆయోగ్‌ బృందం పర్యటించి ఈ ప్రాజెక్టు దేశానికే ఆదర్శమని కితాబు ఇచ్చింది. వైకాపా అధికారంలోకి వచ్చాక అప్పటి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ వీటిని సందర్శించి రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని సూచించారు. కానీ ఎలాంటి ముందడుగు పడలేదు. దీనికి తోడు ఉన్న వాటిని సైతం సక్రమంగా పట్టించుకోలేదు.  

వేతనాలకు ఎదురుచూపులు 

గర్భిణుల వసతి గృహంలో సేవలు అందిస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు సుమారు 15 నెలలుగా వేతనాలు అందలేదు. దీంతో అప్పులు చేసి జీవనం సాగించాల్సి వస్తోందని వాపోతున్నారు. భోజనాలు పెడుతున్న నిర్వాహకులకు ఎనిమిది నెలలుగా బిల్లులు చెల్లించలేదని వాపోతున్నారు. దీంతో పోషకాహారం అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గుమ్మలక్ష్మీపురం వైటీసీలో కిందనున్న మరుగుదొడ్లు పూర్తిగా పాడయ్యాయి. దీంతో గర్భిణులకు సహాయంగా వచ్చే వారు అవస్థలు  పడుతున్నారు.  

చిగురిస్తున్న ఆశలు 

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే గిరిజన గర్భిణుల వసతి గృహాలను నెలకొల్పారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో సమస్యలతో గర్భిణులు నెట్టుకొస్తున్నారు. మరోసారి తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వసతి గృహాలు పూర్వ వైభవానికి వస్తాయని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. పూర్తిస్థాయిలో సౌకర్యాలు మెరుగుపరిస్తే మాతృ మరణాలు తగ్గే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.  


వెలుగులు నింపని సూరీడు.. 

గుమ్మలక్ష్మీపురం, సాలూరు వైటీసీల్లో గిరిజన గర్భిణుల వసతి గృహాలు నిర్వహిస్తున్నారు. విద్యుత్తు అంతరాయం ఏర్పడితే ఇబ్బందులు తలెత్తకుండా సుమారు రూ.20 లక్షల విలువైన సౌర ప్లాంట్లు ఏర్పాటు చేశారు. విద్యుత్తు నిల్వ చేసే బ్యాటరీలు లేకపోవడంతో సోలార్‌ ఫలకలు ఏళ్ల తరబడి నిరుపయోగంగా మారాయి. ప్రతి నెలా రూ.వేలల్లో విద్యుత్తు బిల్లులు రావడంతో పాటు అంతరాయం ఏర్పడితే గర్భిణులకు కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం ఎండలు మండుతుండటంతో ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.   


సౌకర్యాల మెరుగు చర్యలు 

- మురళీధర్, ఏపీవో,  ఐటీడీఏ, పార్వతీపురం

గర్భిణుల వసతి గృహాల్లో సమస్యలు గుర్తించాం. సౌకర్యాలు మెరుగు పర్చేందుకు చర్యలు చేపడుతున్నాం. సిబ్బంది వేతనాలు, బిల్లులకు సంబంధించి సీఎఫ్‌ఎంఎస్‌లో పెండింగ్‌ ఉన్నాయి. నగదు నేరుగా ఖాతాల్లో జమ అవుతుంది. సౌర పరికరాలు వినియోగంలోకి తీసుకొస్తాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని