logo

కన్నేసి.. వాలేసి

భూమి లేని నిరుపేదలకు గతంలో ప్రభుత్వం పంపిణీ చేసిన భూములపై పెద్దలు కన్నేసి గద్దల్లా వాలిపోయారు. గత ప్రభుత్వం అసైన్డ్‌ భూములకు యజమాన్య హక్కు కల్పించనుందని తెలిసి వాటి అమ్మకాలు, కొనుగోళ్లు చట్ట ప్రకారం చెల్లవని తెలిసినా అనధికార లావాదేవీలతో గుంజుకున్నారు.

Published : 18 Jun 2024 02:30 IST

పేదల డి.పట్టా భూములపై గద్దలు
గతంలో 43,202 ఎకరాలు పంపిణీ
ఈనాడు-పార్వతీపురం మన్యం

భూమి లేని నిరుపేదలకు గతంలో ప్రభుత్వం పంపిణీ చేసిన భూములపై పెద్దలు కన్నేసి గద్దల్లా వాలిపోయారు. గత ప్రభుత్వం అసైన్డ్‌ భూములకు యజమాన్య హక్కు కల్పించనుందని తెలిసి వాటి అమ్మకాలు, కొనుగోళ్లు చట్ట ప్రకారం చెల్లవని తెలిసినా అనధికార లావాదేవీలతో గుంజుకున్నారు.

మ్మడి జిల్లాలో వైకాపా ప్రభుత్వ హయాంలో అత్యధిక లావాదేవీలు జరిగాయి. రాయలసీమ, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన నాయకులు, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు కొందరు స్థానిక నాయకులను ప్రసన్నం చేసుకుని వారి మధ్యవర్తిత్వంలో డి-పట్టాదారులతో చర్చించి  అమ్మకానికి ఒప్పించారు. నామమాత్రంగా ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.మూడు లక్షల లోపు అడ్వాన్స్‌లు చెల్లించి ఒప్పంద పత్రాలు రాయించుకున్నారు. తద్వారా విలువైన వేలాది ఎకరాల డి-పట్టా భూములు తమ గుప్పెట్లో పెట్టుకున్నారు.

‘మీ వద్ద డి-పట్టా భూములు ఎంత కాలం ఉన్నా వాటికి విలువ ఉండదు.. వంశపారంపర్యంగా అనుభవించడమే.. అవసరానికి ఆదుకోలేవు. వాటి అమ్మకాలు సైతం కుదరవు.. మాతో ఒప్పందం కుదుర్చుకుంటే ఉన్నత స్థాయిలో పని చేయించుకుంటాం.’’ అని నమ్మబలికారు. అంగీకరించిన వారికి అడ్వాన్స్‌లు చెల్లించారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో మిగిలిన మొత్తం చెల్లిస్తామన్నారు. 

విజయనగరం జిల్లాలో 2004 సంవత్సరానికి ముందు అప్పటి ప్రభుత్వం 43,202 ఎకరాలను 52,661 మంది, పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో 26 వేల ఎకరాలకు పైగా 34 వేల మంది పేదలకు పంపిణీ చేసింది. గతేడాది జారీ చేసిన జీవో 516 ప్రకారం ఆ భూములకు రెవెన్యూ అధికారులు హక్కులు కల్పించాలి. ఒకవేళ ఎవరైనా పట్టాదారు సమర్పించిన పాస్‌పుస్తకం నకిలీదని తహసీల్దారు ధ్రువీకరిస్తే దాన్ని నిరూపించే బాధ్యత అతనిదే. అయితే రెవెన్యూ పాలనలో జరిగిన మార్పుల వల్ల రికార్డులు అందుబాటులో లేవనే కారణంతో భూములకు యాజమాన్య హక్కులు నిరాకరించకూడదని సీసీఎల్‌ఏ జారీ చేసిన మార్గదర్శకాల్లో ఉండటం గమనార్హం. 

ఎలా చేతులు మారాయంటే..

  • బొబ్బిలి నియోజకవర్గంలోని నారాయణప్పవలస, కాశిందొరవలస, ఎరుబరువు, పీఎస్‌ఆర్‌ పురం, రామన్నదొరవలస, మామిడివలస, పారాది తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు చేజిక్కించుకున్నారు. కడప జిల్లాకు చెందిన రెడ్డి ఒకరు సుమారు 400 ఎకరాల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నారు. అడ్వాన్స్‌గా ఎకరాకు రూ.2 నుంచి రూ.3 లక్షలు చెల్లించారు. 22-ఎ నిషేధిత జాబితాలో ఉన్న ఆ భూముల రికార్డులు మార్చేందుకు ప్రయత్నించారు. తహసీల్దార్లు, వీఆర్వోల చేతులు తడిపారు. ఇంతలో ఎన్నికల నేపథ్యంలో కొందరు బదిలీపై వెళ్లిపోయారు. 
  • గజపతినగరం నియోజకవర్గం పరిధిలో 99 ఏళ్లకు లీజు అగ్రిమెంట్లు రాయించుకున్నారు. 
  • మెంటాడ మండలంలో గిరిజన ప్రాంత కొండలను ఆనుకుని ఉన్న డి-పట్టా భూములను కృష్ణా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన వారు కొనుగోలు చేసి వాటిలో పండ్ల తోటలు పెంచుతున్నారు. వాటి చుట్టూ కంచె వేసుకున్నారు. 
  • ఎస్‌.కోట నియోజకవర్గం ఎస్‌.కోట, వేపాడ మండలాల్లో ఎక్కువ లావాదేవీలు జరిగాయి. ఎస్‌.కోట మండలం ముషిడిపల్లి పరిధిలో పెద్ద ఎత్తున చేతులు మారినట్లు తెలిసింది. దీని వెనుక వైకాపా కీలక నేతల బంధువులు ఉన్నట్లు సమాచారం. 
  • నెల్లిమర్ల, విజయనగరం నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున భూముల లావాదేవీలు జరిగాయి. 

గతంలో గంట్యాడ మండలంలో డి-పట్టాదారులు తమ భూములను ఇతరులకు అమ్మేశారు. దీనిపై రెవెన్యూ అధికారులు న్యాయస్థానంలో కేసులు వేశారు. పట్టాదారులకు అనుకూలంగా న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత వారు తమ కుటుంబ అవసరాలకు మళ్లీ ఇతరులకు విక్రయించినట్లు సమాచారం. నియోజకవర్గం మొత్తమ్మీద 1200 ఎకరాల వరకు  చేతులు మారినట్లు సమాచారం. 


ఆ మండలాల్లో గిరాకీ

తంలో భోగాపురం మండలంలో 1222 మందికి 1003 ఎకరాలు, పూసపాటిరేగ మండలంలో 3,724 మందికి 2466.29 ఎకరాలు పంపిణీ చేశారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం ప్రారంభించిన తర్వాత ఈ రెండు చోట్ల అత్యధిక విస్తీర్ణంలోని భూములు చేతులు మారాయి. వీటికి ముందుగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకునేందుకు ప్రీహోల్డ్‌ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే ఇందులో పదెకరాల్లోపే రిజిస్ట్రేషన్లు జరగ్గా, మిగిలిన వాటి ప్రక్రియ మొదలు పెట్టక ముందే రాష్ట్రంలో ప్రభుత్వం మారింది.  


తంలో చీపురుపల్లి మండలంలో 2049 మందికి 1844.27 ఎకరాలు, మెరకముడిదాం మండలంలోని 2346 మందికి 2733.72 ఎకరాలు, గరివిడి మండలంలో 4,964 మందికి 3040.99 ఎకరాలు, గుర్ల మండలంలో 3387 మందికి 1881.3 ఎకరాలు పంపిణీ చేయగా, ఇక్కడ చాపకింద నీరులా అక్రమ లావాదేవీలు జరిగినట్లు సమాచారం. ఇందులో వెయ్యి ఎకరాలను ఫ్రీహోల్డ్‌ చేయించేందుకు అప్పటి ప్రభుత్వంలో ఒత్తిడి చేసినట్లు తెలిసింది.  


డప జిల్లాకు చెందిన రెడ్డి ఒకరు మక్కువ మండలంలో ఒకే ప్రాంతంలో ఉన్న డి-పట్టా భూముల కొనుగోలుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా ఎకరాకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు చెల్లించారు. ఈ ప్రాంతంలో పరిశ్రమ నెలకొల్పుతానని, ఇందుకు పెద్ద ఎత్తున భూములు అవసరమని స్థానికులతో నమ్మబలికినట్లు తెలిసింది.


పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట, పాలకొండ, వీరఘట్టం, జియ్యమ్మవలస మండలాల్లోనూ తక్కువ ధరకు లభించే డి-పట్టా భూములు కొనుగోలు చేశారు. వందలాది ఎకరాల్లో ప్రస్తుతం పామాయిల్‌ తోటల పెంపకం చేపట్టారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని