logo

Kondapi-Prakasam: అమాత్యుల ‘కొండ’పి.. నేతలకు అడ్డాగా గడ్డ

కొండపి.. పొగాకు, శనగ పంటల సాగుకే కాదు.. ఆది నుంచీ రాజకీయ చైతన్యం కలిగిన అసెంబ్లీ నియోజకవర్గం. 1955లో నియోజకవర్గం ఆవిర్భవించింది. ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అభ్యర్థులు ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసి గెలుపొందారు.

Updated : 16 Jun 2024 07:14 IST

బాలినేని, గంటా, జీవీ.శేషు

న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం: కొండపి.. పొగాకు, శనగ పంటల సాగుకే కాదు.. ఆది నుంచీ రాజకీయ చైతన్యం కలిగిన అసెంబ్లీ నియోజకవర్గం. 1955లో నియోజకవర్గం ఆవిర్భవించింది. ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అభ్యర్థులు ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్ర మంత్రి మండలిలోనూ పలు కీలకశాఖలకు అమాత్యులుగా వ్యవహరించి ఈ గడ్డకు గుర్తింపు తీసుకొచ్చారు. ఇటీవల సాగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలుపొందిన దామచర్ల జనార్దన్‌(ఒంగోలు), డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి(కొండపి), ఎం.ఎం.కొండయ్య(చీరాల), గంటా శ్రీనివాసరావు(భీమిలి), తాటిపర్తి చంద్రశేఖర్‌(యర్రగొండపాలెం) ఈ నియోజకవర్గానికి చెందినవారే కావడం విశేషం. 

ఆంజనేయులు,   స్వామి

చెంచురామ నాయుడు నుంచి స్వామి వరకు..

  • జరుగుమల్లి మండలం చింతలపాలేనికి చెందిన నలమోతు చెంచురామనాయుడు తొలిసారిగా కొండపి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన వరుసగా 1962, 1967 ఎన్నికల్లో కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1965 నుంచి 1972 వరకు కాసు బ్రహ్మానందరెడ్డి, పీవీ.నరసింహారావు మంత్రి వర్గాల్లో పురపాలక, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 
  • టంగుటూరు మండలం జమ్ములపాలేనికి చెందిన జీవీ.శేషు 1989లో సంతనూతలపాడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి మంత్రి మండలిలో పాడి పరిశ్రమ, జౌళిశాఖ, లిడ్‌క్యాప్‌ మంత్రిగా కొనసాగారు. 
  • టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలేనికి చెందిన దామచర్ల ఆంజనేయులు తెదేపా ఆవిర్భావం సమయంలో పార్టీలో చేరి 1983లో పీడీసీసీ బ్యాంక్‌ అధ్యక్షుడిగా, 1990లో తెదేపా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 1994, 1999 సార్వత్రిక ఎన్నికల్లో కొండపి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో చంద్రబాబు మంత్రి వర్గంలో దేవాదాయ, మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 
  • టంగుటూరు మండలం కొణిజేడు గ్రామానికి చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి తొలుత కాంగ్రెస్‌లో రాజకీయ జీవితం ప్రారంభించారు. 2009లో ఒంగోలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలుపొందిన ఆయన వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి మంత్రి మండలిలో గనులు, భూగర్భ, చేనేత, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైకాపాలో చేరి 2019లో గెలిచి జగన్‌ మోహన్‌ రెడ్డి మంత్రి వర్గంలో రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 
  • జరుగుమల్లి మండలం కామేపల్లికి చెందిన గంటా శ్రీనివాసరావు 1999లో రాజకీయాల్లోకి ప్రవేశించి అనకాపల్లి నుంచి తెదేపా తరఫున పోటీ చేసి తొలిసారి ఎంపీగా గెలుపొందారు. 2004 ఎన్నికల్లో చోడవరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీలో చేరి గెలుపొందారు. ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైనప్పుడు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా కొనసాగారు. 2014 ఎన్నికలకు ముందు తిరిగి తెదేపాలో చేరారు. విశాఖ జిల్లా భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై చంద్రబాబు మంత్రి మండలిలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 
  • 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కొండపి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ఎన్నికై హ్యాట్రిక్‌ సాధించారు. ఆయన స్వగ్రామం టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం. ప్రభుత్వ వైద్యాధికారి వృత్తిలో కొనసాగుతున్న ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి 2009లో కొండపి అసెంబ్లీ తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన వరుస ఎన్నికల్లో తెదేపా తరఫున పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం ఆయనకు చంద్రబాబు మంత్రి మండలిలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ, దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్స్‌ సంక్షేమం, సచివాలయం, వాలంటీర్ల వ్యవహారాల శాఖ చోటు లభించింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు