logo

మనోహరం... చెన్నకేశవుని ఆలయం

 ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే మార్కాపురం శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి వారి దేవస్థానం తలమానికంగా మారబోతోంది. రూ.5.56 కోట్లతో నాలుగు ప్రాకార గోపురాలు నిర్మాణం చేపట్టి దేవాలయాన్ని మనోహరంగా తీర్చేందుకు శ్రీకారం చుట్టారు.

Published : 01 Apr 2023 04:12 IST

నాలుగు ప్రాకారాలతో గోపురాల నిర్మాణం
రూ.10 కోట్లతో అభివృద్ధి

దేవస్థానం నూతన నమూనా చిత్రం

మార్కాపురం, న్యూస్‌టుడే :  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే మార్కాపురం శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి వారి దేవస్థానం తలమానికంగా మారబోతోంది. రూ.5.56 కోట్లతో నాలుగు ప్రాకార గోపురాలు నిర్మాణం చేపట్టి దేవాలయాన్ని మనోహరంగా తీర్చేందుకు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించిన నమూనాను దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వారి సౌకర్యార్థం మొత్తం దేవాలయంలో అభివృద్ధి పనులకు రూ.10 కోట్ల వరకు నిధులు కేటాయించారు.  ఉత్తరం, దక్షిణం గోపురాలు ఎత్తు 53 అడుగులు, తూర్పు, పడమర గోపురాలు 71 అడుగులు ఎత్తు నిర్మాణం చేయనున్నారు. ప్రస్తుతం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. వీటితో పాటు అండాళ్లమ్మ అమ్మవారు, రంగనాయక స్వామి వారి దేవాలయాలు, డార్మింటరీ, స్థలహారాల నిర్మాణం చేయనున్నారు. దేవాలయం మొత్తం ఆవరణలో ఫ్లోరింగ్‌ నిర్మాణానికి నిధులు కేటాయించారు. గోపురాలను సుందరంగా  ఆకట్టుకునే విధంగా,  నిర్మాణం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

నిర్మాణంలో ఉన్న ఓ గోపురం

5 నుంచి బ్రహ్మోత్సవాలు...

శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల గోడపత్రాలను... ఆలయ సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. పట్టణంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న వేడుకలను భక్తులంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఏప్రిల్‌ అయిదో తేదీన అంకురార్పణతో మొదలై... 17వ తేదీతో ఉత్సవాలు ముగుస్తాయని ఈవో జి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. 6న స్వామివారి కల్యాణోత్సవం, సూర్య వాహన సేవ; 7న చంద్ర, 8న సింహ, 9న శేష, 10న వ్యాలి, 11న పొన్న, 12న హనుమంత, 13న గరుడ, 14న గజ వాహన సేవ ఉంటాయన్నారు. 15న రథోత్సవం, 16న అశ్వ, 17న హంస వాహన సేవ ఉంటాయన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఎడ్ల బండ లాగుడు పోటీలు, విద్యుత్తు ప్రభలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.


పనులు శరవేగంగా సాగుతున్నాయి..

ప్రభుత్వ ఆదేశాలు, స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు, దాతల సహకారంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దేవాలయంలో అన్ని నిర్మాణాలు పూర్తయితే మనోహరంగా ఉంటుంది. జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే చెన్నకేశవస్వామి దేవస్థానం ప్రత్యేకంగా నిలవనుంది. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించబోతున్నాం. నిర్మాణం పనులు శరవేగంగా చేపడుతున్నాం. ఎప్పటికప్పుడు  పర్యవేక్షణ చేస్తున్నాం.

శ్రీనివాసరెడ్డి, ఈవో, లక్ష్మీచెన్నకేశవస్వామి దేవస్థానం, మార్కాపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు