logo

పట్టాభిషేక వేడుక.. ఆనంద వీచిక

×తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సీఎంగా, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, మరికొందరు కూటమి నేతలు మంత్రులుగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.

Published : 13 Jun 2024 03:21 IST

మార్కాపురం పట్టణంలో ఏర్పాటు చేసిన తెరపై..  

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సీఎంగా, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, మరికొందరు కూటమి నేతలు మంత్రులుగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం నియోజకవర్గాల్లోని వివిధ మండలాల్లోని  తెదేపా, జనసేన, భాజపా నేతలు కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు. ప్రత్యేక ఏర్పాటు చేసిన తెరపైనే, టీవీల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. అరాచక పాలన అంతమైందని.. ఇక అన్ని మంచిరోజులేనని నినాదాలు చేశారు. 

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా యర్రగొండపాలెంలో తెదేపా శ్రేణులు బుధవారం సంబరాలు చేసుకున్నారు. స్థానిక ఎన్టీఆర్‌ కూడలిలో నందమూరి తారకరామరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా ఒకరినొకరు మిఠాయి తినిపించుకున్నారు. జై చంద్రబాబు..  జోహార్‌ ఎన్టీఆర్‌ అంటూ నినాదాలు చేశారు.  ః కంభం: ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని మండలంలో బుధవారం ఉత్సాహంగా నిర్వహించారు. ప్రతి గ్రామంలోనూ నారా చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. మండల పరిషత్తు కార్యాలయం, ప్రతి సచివాలయంలోనూ భారీ తెరలు, టీవీలను ఏర్పాటు చేసి వీక్షించారు.  కందులాపురం కూడలిలో బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో పవన్‌ కల్యాణ్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.            

త్రిపురాంతకంలో ర్యాలీ నిర్వహిస్తున్న తెదేపా శ్రేణులు

  •  త్రిపురాంతకం: మండల కేంద్రంలో తెదేపా సీనీయర్‌ నాయకుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచా పేలుస్తూ, రంగులు చల్లుకుంటూ భారీ ప్రదర్శన నిర్వహించారు.  మండలంలోని సోమేపల్లిలో జనసైనికులు, మహిళలు కేకు కోసి రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. మిట్టపాలెంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో మాజీ సర్పంచ్‌ ఊట్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కును తీర్చుకున్నారు.                  
  • గిద్దలూరు పట్టణం: గిద్దలూరు నగర పంచాయతీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారాన్ని తిలకించేందుకు వీలుగా గోడ తెరలు ఏర్పాటు చేశారు.  కార్యక్రమంలో తెదేపా నాయకులు మాజీ సర్పంచ్‌ దప్పిలి భాస్కర్‌రెడ్డి, బాల ఈశ్వరయ్య, మస్తాన్‌వలి, తదితరులు పాల్గొన్నారు. ః మార్కాపురం పట్టణం: పట్టణంలోని సౌజన్య ఫంక్షన్‌ హాలులో సోమవారం ప్రత్యేక తెరను ఏర్పాటు చేశారు. నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి చంద్రబాబునాయుడు, పవన్‌ కల్యాణ్‌ ప్రమాణ స్వీకారాలను తిలకించారు.    
  •  బేస్తవారపేట: బేస్తవారపేటలోని స్థానిక సచివాలయం-1 ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెరపై ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో వీక్షించారు. 
  •  పొదిలి, పొదిలి గ్రామీణం: పొదిలి ప్రకాశ్‌నగర్‌లో తెదేపా నాయకుడు మౌలాలి భోజనాలు ఏర్పాటు చేశారు. పట్టణంలోని కొత్తూరు, పాతూరు ప్రాంతాల్లోని కూడళ్లలో ప్రజలు చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారాన్ని ఆసక్తిగా తిలకించారు. పట్టణంలో జనసేన పార్టీ యువకులు బైక్‌లకు పార్టీ జెండాలు కట్టుకొని సంతోషంగా గడిపారు
  • మండలంలోని కుంచేపల్లి గ్రామంలో తెదేపా సర్పంచి వరికుంట్ల కాంతమ్మ, కార్యకర్తల ఆధ్వర్యంలో మధ్యాహ్నం భారీ అన్నదానం చేపట్టారు.           
  • పెద్దారవీడు: ముంపు గ్రామాలైన గుండంచర్ల, కలనూతల, సుంకేసుల, మండలంలోని దేవరాజుగట్టు, శివాపురం, తంగిరాలపల్లి, మండల కేంద్రం పెద్దారవీడు తదితర గ్రామాల్లో బుధవారం తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. 

కంభం: పవన్‌ కల్యాణ్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేస్తూ...

తరలివెళ్లిన నాయకులు.. 

పొదిలి: రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారానికి పొదిలి మండలం నుంచి తెదేపా నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. తెదేపా రాష్ట్ర రైతుసంఘం కార్యదర్శి ఎ.యల్లమంద, మండల అధ్యక్షుడు ఓబులరెడ్డి, జిల్లా కార్యదర్శి వై.వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 



 బేస్తవారపేట: కేకు కోసి సంబరాలు చేసుకుంటున్న తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని