logo

సుద్దముక్కకూ డబ్బుల్లేవ్‌...!

గత అయిదేళ్ల కాలంలో వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రాథమిక విద్యారంగానికి శాపంగా మారాయి. 117 జీవో తెచ్చి 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతోనే వ్యవస్థ కుదేలైంది. రెండేళ్లలో ఒకటో తరగతి ప్రవేశాలు ఇరవై శాతం మేర తగ్గాయి.

Updated : 13 Jun 2024 05:56 IST

వైకాపా సర్కారు మిగిల్చిన ఇక్కట్లు 

నేటి నుంచి బడులు పునఃప్రారంభం

పాత ముడివేములలో అసంపూర్తిగా ఆగిన పాఠశాల భవనం

గత అయిదేళ్ల కాలంలో వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రాథమిక విద్యారంగానికి శాపంగా మారాయి. 117 జీవో తెచ్చి 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతోనే వ్యవస్థ కుదేలైంది. రెండేళ్లలో ఒకటో తరగతి ప్రవేశాలు ఇరవై శాతం మేర తగ్గాయి. గత ఏడాది ఒకటో తరగతిలో చేరే పిల్లలు నలభై వేల మంది ఉన్నట్లు సర్వే ద్వారా గుర్తించారు. వీరిలో సగం మంది ప్రభుత్వ విద్యాలయాల్లో చేరతారని అంచనా వేసినా... ప్రవేశాలు పదివేలు దాటలేదు. ఒకటి, రెండు తరగతులు చదివాక మూడో తరగతిలో చేరేందుకు ఉన్నత పాఠశాలలు దూరంగా ఉండటమే ఇందుకు కారణం. పిల్లల సంఖ్య పడిపోవడంతో జిల్లాలో దాదాపు 300 మంది ఎస్జీటీలు మిగులుగా తేలారు.

ఓ పాఠశాలలో మూలకు చేరిన టీవీ

పైసలివ్వక చిక్కులు...

ప్రభుత్వ పాఠశాలలకు సమగ్ర శిక్ష సంస్థ ద్వారా ఏటా స్కూల్‌ గ్రాంట్, టీచర్‌ గ్రాంట్‌ ఇచ్చేవారు. విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక్కో పాఠశాలకు కనిష్ఠంగా రూ.10 వేల నుంచి గరిష్ఠంగా రూ.లక్ష వరకు వస్తుంది. కృత్యాధార బోధన పరికరాల కొనుగోలుకు రూ.500 చొప్పున ఇచ్చేవారు. టీచర్‌ గ్రాంట్‌ అయిదేళ్లుగా నిలిచిపోగా... స్కూట్‌ గ్రాంట్‌ గత ఏడాది పూర్తిగా ఇవ్వలేదు. బడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలు వచ్చేందుకు రవాణా ఛార్జీలు ఇచ్చేవారు. ఆ నిధుల జాడా లేదు. ఆన్‌లైన్‌లో ప్రశ్న పత్రాలు పంపి పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. వాటి జిరాక్సులు తీసేందుకు డబ్బులివ్వకపోవడంతో... ఉపాధ్యాయులే తలాకొంత భరించాల్సి వచ్చింది. నిర్వహణకు అవసరమైన రిజస్టర్లు, స్టేషనరీ, విద్యుత్తు బిల్లులకు నిధులు లేక అవస్థలు తప్పడం లేదు.

రూ.లక్షల పరికరాలు నిరుపయోగం...

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉన్నత పాఠశాలల్లో డిజిటల్, వర్చువల్‌ బోధన ప్రారంభించారు. ఇందుకోసం టీవీ, వీసీఆర్, కంప్యూటర్లు ఏర్పాటు చేసి... నెట్‌ సౌకర్యం కల్పించారు. 340 పాఠశాలల్లో డిజిటల్‌ బోధనకు, 260 బడుల్లో వర్చువల్‌ తరగతుల నిర్వహణకు పరికరాలు అందజేశారు. ఒక్కో ఉన్నత పాఠశాలకు సుమారు రూ.2 లక్షల విలువైన పరికరాలు వచ్చాయి. వర్చువల్‌ తరగతుల నిర్వహణకు నగరంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో రూ.30 లక్షల వ్యయంతో ప్రత్యేకంగా స్టూడియో ఏర్పాటు చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక వీటన్నిటినీ పక్కన పెట్టేసి... కొత్తగా బైజూస్‌ విధానం అమల్లోకి తెచ్చింది. దీంతో విలువైన ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఎందుకూ కాకుండా పోయాయి. చాలా చోట్ల అపహరణకు గురయ్యాయి. గురువారం నుంచి బడులు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో సుమారు 240 మంది సబ్జెక్టు టీచర్ల కొరత ఉందని... వాటిని భర్తీ చేస్తే మెరుగైన బోధన అందించవచ్చని చెబుతున్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని