logo

సామాన్యుడిగా పేరు.. చిరస్మరణీయ పోరు

డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి... జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటుదక్కించుకోవడంతో అన్ని వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే మంత్రివర్గంలో ఆయనకు చోటు ఖాయమని తొలి నుంచీ ప్రచారం సాగింది.

Updated : 13 Jun 2024 05:51 IST

హ్యాట్రిక్‌ విజయాలతో స్వామికి మంత్రివర్గంలో చోటు

స్వామితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్న గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

ఈనాడు, ఒంగోలు; న్యూస్‌టుడే, టంగుటూరు: డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి... జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటుదక్కించుకోవడంతో అన్ని వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే మంత్రివర్గంలో ఆయనకు చోటు ఖాయమని తొలి నుంచీ ప్రచారం సాగింది. ఇప్పుడు అదే నిజమైంది. హ్యాట్రిక్‌ విజయాలు... పార్టీ పట్ల అచంచల విశ్వాసం... వైకాపా మూకలు దాడులకు తెగబడి, ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేసినా వెరవని ధీరత్వం ఆయనకు మంత్రి పదవిని కట్టబెట్టాయి.

2019లో రాష్ట్రమంతటా ఫ్యాన్‌ గాలి వీచినా... కొండపిలో మాత్రం స్వామి జయకేతనం ఎగురవేశారు. తరువాత ఆయనను తమవైపు తిప్పుకొనేందుకు వైకాపా పెద్దలు ఒత్తిడి చేసినా తలొగ్గలేదు. ప్రజా సమస్యలపై నిత్యం పోరు సాగించారు. తనపై వ్యక్తిగతంగా దూషణలు, దాడులకు తెగబడినా వెరవలేదు. ఈసారి ఎలాగైనా ఆయనను ఓడించాలన్న లక్ష్యంతో మంత్రి సురేష్‌ను వైకాపా బరిలో దించినా... భారీ ఆధిక్యంతో స్వామి విజయం సాధించారు.

వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు దంపతులు

కుటుంబ నేపథ్యం...

స్వామి స్వస్థలం టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెం. విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి... ప్రభుత్వ వైద్యుడిగా సేవలందించారు. ఆయన భార్య రాజేశ్వరి... ప్రభుత్వ జూ.కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేసి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. వీరికి ఓ కుమారుడు. తల్లిదండ్రులు కోటయ్య సిద్ధాంతి, సుబ్బమ్మ.

దాడులు చేసినా వెరవలేదు...

  • 2019లో రెండోసారి గెలిచిన స్వామిపై... ఆది నుంచే దాడులు మొదలుపెట్టారు. ఆ ఏడాది జులైలో రైతు భరోసా కార్యక్రమానికి వెళ్తుండగా వైకాపా మూకలు దాడి చేశాయి. ప్రొటోకాల్‌ ప్రకారం హాజరవ్వాలని ముందే చెప్పినా... అధికారులు సైతం పట్టించుకోలేదు. ఇదే తరహాలో పలు కార్యక్రమాల్లో అడ్డుకుని అలజడులు సృష్టించారు.
  • స్వచ్ఛ భారత్‌ కింద తెదేపా హయాంలో నిర్మించిన మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి చోటుచేసుకుందంటూ... గత ఏడాది జూన్‌లో ఆయన ఇంటిపై దాడికి సిద్ధమయ్యారు. అప్పుడు జరిగిన తోపులాటలో స్వామి చొక్కా సైతం చినిగిపోయింది. పరిస్థితి చేయిదాటినా... అధికార యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరిస్తూ వైకాపా మూకలకే సహకరించింది.
  • అంతకుముందు మార్చిలో... జీవో నంబరు-1 రద్దు చేయాలని అసెంబ్లీలో డిమాండ్‌ చేస్తూ స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టిన సమయంలో... సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు దాడి చేయడంతో పోడియం మెట్ల కింద పడిపోయారు. మంత్రి మేరుగు నాగార్జున సైతం వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు.
  • సంగమేశ్వరం పనులు పూర్తిచేసి సాగు, తాగు నీరు అందించాలంటూ అక్కడ వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది ఓర్చుకోలేని అప్పటి వైకాపా నియోజకవర్గ కన్వీనర్‌ వరికూటి అశోక్‌బాబు... పోటీగా అక్కడకు వెళ్లి ఉద్రిక్తతలు సృష్టించారు. అధికారులు సైతం వారికే వంతపాడుతూ... ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలను తొలగించారు.

రాజకీయ ప్రస్థానం..

నియోజకవర్గాల పునర్విభజనలో కొండపి  ఎస్సీ రిజర్వుడు కావడంతో... 2009లో వైద్య ఉద్యోగాన్ని వదిలి తెదేపా తరఫున పోటీ చేశారు. తొలిసారి ఓటమే ఆయనను పలకరించింది. అయినప్పటికీ కుంగిపోకుండా... లోపాలను సరిదిద్దుకుని 2014 బరిలో నిలిచారు. వైకాపా అభ్యర్థి జూపూడి ప్రభాకర్‌రావుపై 5,440 ఓట్ల ఆధిక్యంతో తొలి విజయం అందుకున్నారు. తరువాత 2019లో రాష్ట్రమంతటా ఫ్యాన్‌ గాలి వీచినా... స్వామి మాత్రం వైకాపా అభ్యర్థి మాదాసి వెంకయ్యపై 1,024 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తాజా ఎన్నికల్లో ఆయనను ఎలాగైనా ఓడించాలని మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్‌ను ఇక్కడి నుంచి బరిలో నిలిపినా ప్రయోజనం లేకపోయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 23,511 ఓట్ల భారీ ఆధిక్యంతో స్వామి విజయం సాధించారు. 

పక్షంలోన అభిమానులు...

స్వామి స్వతహాగా సౌమ్యుడు. వివాదాలకు దూరంగా ఉంటారు. పార్టీలకు అతీతంగా అండగా నిలిచి అందరికీ చేతనైన సాయం చేస్తుంటారు. ఈ లక్షణాలే వైరి పార్టీలోనూ ఆయనకు అభిమానులను సంపాదించి పెట్టింది. ‘స్వామి ఉన్నారు కాబట్టే నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది. మావాళ్లు గెలిచుంటే అరాచకంతో అల్లాడిపోయేవాళ్లమ’ని పలువురు వైకాపా నేతలే వ్యాఖ్యానిస్తున్నారంటే... ఆయన వ్యవహారశైలి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దామచర్ల కుటుంబమూ ఆయన వెన్నంటి నిలవడంతో... రాజకీయంగా ఒక్కో మెట్టూ ఎక్కి, నేడు మంత్రి స్థాయికి చేరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని