logo

చంద్రన్న సంతకం.. మొదలైంది నవశకం

నిరుద్యోగుల నిరీక్షణ ఫలించింది. భూములు ఎక్కడ లాక్కుంటారోనన్న అభద్రతా భావం సామాన్యుల్లో తొలగిపోయింది. పెరిగిన పింఛనుతో అవ్వాతాతల ఆశ నెరవేరింది. పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్లు మళ్లీ తెరుచుకోనున్నాయి.

Published : 14 Jun 2024 03:19 IST

ప్రగతి పాలకుని పంచామృతాలు

నిరుద్యోగుల నిరీక్షణ ఫలించింది. భూములు ఎక్కడ లాక్కుంటారోనన్న అభద్రతా భావం సామాన్యుల్లో తొలగిపోయింది. పెరిగిన పింఛనుతో అవ్వాతాతల ఆశ నెరవేరింది. పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్లు మళ్లీ తెరుచుకోనున్నాయి. యువతలో ఉద్యోగ నైపుణ్యాలు పెంచేందుకూ తొలి అడుగు పడింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వేళ... ఇచ్చిన మాట ప్రకారం తొలి అయిదు సంతకాలూ ఈ దస్త్రాలపైనే పెట్టడంతో అంతటా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

- న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం, నగరం

మెగా డీఎస్సీతో సంబరాలు...

ఇచ్చిన మాట ప్రకారం... ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మెగా డీఎస్సీ  దస్త్రంపై చంద్రబాబు తొలి సంతకం చేయడంతో నిరుద్యోగుల ఆనందానికి అవధుల్లేవు. గత ప్రభుత్వం డీఎస్సీ ప్రకటించినా టెట్‌ మాత్రమే నిర్వహించి విరమించుకుంది. అందులోనూ ఉమ్మడి జిల్లాకు కేవలం ఆరు వందల పోస్టులు మాత్రమే కేటాయించడంతో తొలి నుంచే అభ్యర్థుల్లో నైరాశ్యం నెలకొంది. కొత్త ప్రభుత్వం... తొలి రోజునే మెగా డీఎస్సీ ప్రకటించి 16,347 పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చింది. ఇందులో జిల్లాకు వెయ్యికి పైగా పోస్టులు వస్తాయని అంచనా. పూర్తిస్థాయి ప్రకటన వెలువడే నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది ఆరు వేల మంది టెట్‌ రాశారు. అంతకుముందు టెట్‌ రాసినవారు దాదాపు పదిహేను వేలమందికిపైగా ఉంటారని అంచనా. మొత్తంగా మెగా డీఎస్సీ వల్ల ఇరవై వేల మంది నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి.

భూములకు భద్రత...

జిల్లాలో భూ వివాదాలు ఎక్కువ. ఒక రైతుకు చెందిన భూమి మరొకరి పేరిట వెబ్‌ల్యాండ్‌లో నమోదవడం, ఆన్‌లైన్‌లో ఎక్కించడం వంటి ఘటనలు ప్రతి పల్లెలోనూ ఉన్నాయి. ప్రతి సోమవారం నిర్వహించే స్పందనకు వచ్చే అర్జీల్లోనూ ఎనభై శాతానికి పైగా భూ వివాదాలకు సంబంధించినవే కావడం సమస్య తీవ్రతకు దర్పణం పడుతోంది. ఇటువంటి తరుణంలో వివాదాస్పదమైన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను... 2023 అక్టోబరు నెలాఖరులో అమల్లోకి తెస్తూ వైకాపా ప్రభుత్వం హడావుడిగా జీవో జారీ చేసింది. పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజల భూములకు రక్షణ కొరవడేలా నిబంధనలు ఉండడం ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారితీశాయి. న్యాయవాదులు సైతం రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. అధికారంలోకి వచ్చాక ఈ చట్టం రద్దుపైనే రెండో సంతకం చేస్తానని చెప్పిన చంద్రబాబు... ఆ మాట నిలుపుకోవడంతో న్యాయవాదులతో పాటు, అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అవ్వాతాతలకు భరోసా... 

రూ.3 వేలుగా ఉన్న సామాజిక పింఛను రూ.4 వేలకు పెంచడంతో... జిల్లాలో 2,91,968 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. పెంచిన మొత్తాన్ని ఏప్రిల్‌ నుంచే వర్తింపజేస్తామని ప్రకటించారు. అందుకు అనుగుణంగానే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితర విభాగాల వారికి... జులై ఒకటో తేదీన రూ.7 వేలు (పింఛను రూ.4 వేలు, ఏప్రిల్‌ నుంచి నెలకు రూ.వెయ్యి చొప్పున కలిపి) పంపిణీ చేయనున్నారు. 2014లో తెదేపా అధికారంలోకి రాగానే... రూ.200గా ఉన్న పింఛనును అయిదు రెట్లు పెంచి రూ.వెయ్యి చేశారు. 2019 ఎన్నికలకు ముందు ఆ మొత్తాన్ని రూ.2 వేలకు పెంచారు.

మళ్లీ అన్నం పెడుతున్నారు...

వైకాపా ప్రభుత్వం కక్షాపూరితంగా మూయించిన అన్న క్యాంటీన్లు మళ్లీ తెరుచుకోనున్నాయి. ఒంగోలు నగరంలోని కూరగాయల మార్కెట్, కర్నూలు రోడ్డు, కొత్తపట్నం బస్టాండ్‌ కూడలిలోని రైతు బజార్, పాత రిమ్స్‌తో పాటు... మార్కాపురం, కనిగిరిలో వీటిని నిర్వహించారు. మరికొన్ని ప్రాంతాల్లో ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఒక్కో కేంద్రంలో రోజుకు రెండు వేల నుంచి మూడు వేల మందికి... రూ.5కే రుచి శుచితో కూడిన ఆహారం, అల్పాహారం అందించేవారు. వివిధ పనుల నిమిత్తం దూరప్రాంతాల నుంచి నగరానికి వచ్చే పేదలకు ఈ క్యాంటీన్లు కడుపు నింపేవి. అటువంటి కేంద్రాలను జగన్‌ ప్రభుత్వం మూసేసి... ఆయా భవనాలను ఇతర అవసరాలకు వినియోగించింది. కొత్త ప్రభుత్వ నిర్ణయంతో... వాటిని స్వాధీనం చేసుకుని అన్న క్యాంటీన్ల నిర్వహణకు వీలుగా సిద్ధం చేసి, డ్వాక్రా సంఘాల ద్వారా నిర్వహించాలని మెప్మా కార్యాలయానికి ఆదేశాలందాయి.

ఉద్యోగ నైపుణ్యాభివృద్ధిరస్తు...

ఉన్నత చదువులు పూర్తి చేసినా అవసరమైన నైపుణ్యాలు లేక యువత ఉద్యోగాలు సాధించలేకపోతున్న విషయాన్ని గుర్తించి... నాటి తెదేపా ప్రభుత్వం 2015లో నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. సదరు సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో రెండు చోట్ల సీమెన్స్‌ శిక్షణ కేంద్రాలు మరో మూడు చోట్ల సీఎం ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలు నిర్వహించారు. ఇవి కాకుండా 38 డిగ్రీ కళాశాలల్లో ఎంప్లాయిబిలిటీ నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేసి... ఒక్కో కేంద్రానికి 30 ట్యాబ్‌లు, 30 ల్యాప్‌టాప్‌లు అందజేశారు. అప్పట్లో నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో మొత్తంగా 8,080 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. 2019లో వచ్చిన వైకాపా ప్రభుత్వం నైపుణ్య కేంద్రాలు కొనసాగించి, హబ్‌లు ఏర్పాటు చేసినా... మొక్కుబడిగా నిర్వహించడంతో పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. కొత్త ప్రభుతం ‘నైపుణ్య గణన’ను మళ్లీ పట్టాలెక్కించనుండడంతో నిరుద్యోగ యువతకు ప్రయోజనం చేకూరనుంది.

అవకాశం రాదనుకున్నా...

2008లో బీఈడీ పూర్తిచేశా. మూడు డీఎస్సీలు రాసినా వివిధ కారణాలతో సాధించలేకపోయా. ప్రస్తుతం ఒంగోలులోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నా. వయసు మీరిపోతోంది. మరి అవకాశం రాదనుకున్నా. ఇప్పుడు ఇలా డీఎస్సీ ప్రకటించడం చెప్పలేనంత ఆనందంగా ఉంది. ప్రస్తుతం నా వయసు నలభై ఏళ్లు. ఎస్సీ రిజర్వేషన్‌ ఉన్నందున 44 ఏళ్ల వరకు అర్హత ఉంది. ఇదే చివరి అవకాశం అనుకుంటున్నా.

- జి.హరిబాబు, శాఖవరం, వలేటివారిపాలెం మండలం

అందరికీ ఉపశమనం...

ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు రద్దు చేశారు. ఆ చట్టం అమల్లోకి వచ్చి ఉంటే చిన్న సన్నకారు రైతులు, పేద, మధ్య తరగతి వారి భూములకు రక్షణ కరవయ్యేది. ప్రభుత్వం నియమించిన అధికారి ప్రజాప్రతినిధుల మాట వింటాడు. అలాంటివారి చేతుల్లో మన భూమి పత్రాలు ఉంచడం ఏమిటి? చిన్న లిటిగేషన్‌ వచ్చినా సామాన్యులు నానా అవస్థలు పడాల్సి వచ్చేది.

- నాగిశెట్టి మోహన్‌దాస్, ఒంగోలు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు 

కొలువుల సాధనకు అవకాశం...

డిగ్రీ, బీటెక్, ఇతర ఉన్నత చదువులు చదివినా ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు లేనందునే ప్రాంగణ ఎంపికల్లో యువత అవకాశాలు సాధించలేకపోతున్నారు. ఇప్పుడు ఆ లోటు భర్తీ చేసేలా నైపుణ్య గణనకు కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవడం విద్యార్థులందరికీ మేలు చేసేదే. ఉన్నత కొలువులు సాధించేందుకు ఇది ఎంతో దోహదపడుతుంది.

- వలేటి ఖ్యాతి కీర్తన, వలేటివారిపాలెం

ఆకలి బాధ ఉండదు.

అన్న క్యాంటీన్లు వస్తే ఎవరూ ఆకలితో అలమటించాల్సిన పని ఉండదు. అప్పట్లు రూ.5కే మంచి భోజనం అందించేవారు. వీటి వల్ల మాలాంటి కార్మికులతో పాటు కూలీలకు ఎంతో మేలు జరిగింది. మళ్లీ వాటిని ప్రారంభించనుండడం ఆనందంగా ఉంది.  

- ఎస్‌కే బాజీ, మోటార్‌ మెకానిక్, నెహ్రూనగర్‌

ఎందరికో మేలు...

నా అన్నవారెవరూ లేరు. వచ్చే పింఛను మొత్తమే ఆధారం. అన్ని రకాల ధరలతో పాటు... విద్యుత్తు ఛార్జీలు పెరిగాయి. బీపీ, షుగర్‌ ఉండడంతో ఆ మందులూ కొనుక్కోవాల్సి రావడంతో... ఇప్పుడిస్తున్న పింఛను చాలడం లేదు. ఈ మొత్తాన్ని చంద్రబాబు రూ.4 వేలకు పెంచడం వల్ల నాలాంటి అభాగ్యులెందరికో మేలు కలుగుతుంది.

- పార్వతి, పెద్ద మసీదు సెంటర్, ఒంగోలు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని