logo

లంచమిస్తే మాత్రం అరుస్తావేంటి!.. వీఆర్వో, రైతు సంభాషణ వైరల్‌

‘డబ్బులిస్తే మాత్రం ఏంటి! పని చేసే వరకు ఆగాల్సిందే. నువ్వు డబ్బులిచ్చి రెండు నెలలైనా కాలేదు. ఏం ఆగలేవా.! ఆగలేకుంటే మార్కాపురం వచ్చి నువ్వు ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకుని పో..

Updated : 18 Jun 2024 07:58 IST

పెద్దారవీడు, న్యూస్‌టుడే: ‘డబ్బులిస్తే మాత్రం ఏంటి! పని చేసే వరకు ఆగాల్సిందే. నువ్వు డబ్బులిచ్చి రెండు నెలలైనా కాలేదు. ఏం ఆగలేవా.! ఆగలేకుంటే మార్కాపురం వచ్చి నువ్వు ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకుని పో.. తెలుగుదేశం వాళ్లు వచ్చి నాలుగు రోజులు కాలేదు అప్పుడే వైకాపా వాళ్లకు పనులు చేయొద్దని చెబుతున్నారు మరి’... ఇవీ పెద్దారవీడు మండలంలో పనిచేసే వీఆర్వో ఒకరు మద్దలకట్ట గ్రామానికి చెందిన రైతుతో మూడు రోజుల క్రితం అన్న మాటలు. సదరు ఆడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మద్దలకట్టకు చెందిన ఓ రైతు తన పొలం ఆన్‌లైన్‌ కోసం మండలంలో పనిచేసే వీఆర్వోకు రెండు నెలల క్రితం లంచంగా డబ్బులు ఇచ్చారు. ఎంతకీ పని చేయకపోవడంతో సదరు వీఆర్వోను రైతు ఫోన్‌లో సంప్రదించారు. ఎందుకు చేయడం లేదంటూ నిలదీశారు. దీంతో వీఆర్వో ఆవేశంగా మాట్లాడారు. ఈ సంభాషణను రికార్డు చేసిన సదరు రైతు.. కొద్దిరోజుల క్రితం తొలుత మండల స్థాయిలోని కొన్ని వాట్సప్‌ గ్రూపులలో పెట్టారు.

రంగంలోకి దిగిన కొందరు వైకాపా నాయకులు ఆయా గ్రూప్‌ అడ్మిన్‌లతో మాట్లాడి ఆ కాల్‌ రికార్డ్‌ను తొలగించారు. తాజాగా ఈ మాటలు మూడు రోజుల క్రితం మళ్లీ వెలుగులోకి వచ్చాయి. దీంతో రెవెన్యూ శాఖలో కొందరు అధికారులు, సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే లంచం తీసుకోవడమే తప్పు అయితే అందుకు సిగ్గు పడాల్సిన వీఆర్వో.. తాను పనిచేయకపోవడానికి కారణం ఇటీవల అధికారంలోకి వచ్చిన తెదేపా ప్రభుత్వం అనేలా నిందలు వేయడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. కొత్త ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తహసీల్దార్‌ దాసును ‘న్యూస్‌టుడే’ వివరణ కోరింది. ఆయన మాట్లాడుతూ.. కొందరు వీఆర్వోలు గ్రామాల్లో తనకు తెలియకుండానే ఇలాంటి పనులు చేస్తున్నారన్నారు. వీఆర్వో, రైతు సంభాషణ ఇంకా దృష్టికి రాలేదని చెప్పారు. సదరు వీఆర్వోను కార్యాలయానికి పిలిపించి విచారిస్తామని తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని