logo

పేద విద్యార్థులపై ప్రై‘వేటు’

కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులకు సీట్ల కేటాయింపు నిబంధన అపహాస్యం పాలవుతోంది. ప్రవేశాలు కల్పించడంపై ఆయా విద్యాసంస్థలు మీనమేషాలు లెక్కిస్తుండటంతో అర్హులకు న్యాయం జరగడం లేదు.

Updated : 21 Jun 2024 04:47 IST

ప్రవేశాలను పట్టించుకోని విద్యాసంస్థలు
ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు

కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులకు సీట్ల కేటాయింపు నిబంధన అపహాస్యం పాలవుతోంది. ప్రవేశాలు కల్పించడంపై ఆయా విద్యాసంస్థలు మీనమేషాలు లెక్కిస్తుండటంతో అర్హులకు న్యాయం జరగడం లేదు. ప్రైవేటు పాఠశాలల్లో చేరే వారిపై ఆంక్షలు పెడుతూ ఒత్తిడి తెస్తుండటం వల్ల తమ పిల్లలు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారని తలిదండ్రులు వాపోతున్నారు. 

న్యూస్‌టుడే, మార్కాపురం పట్టణం : కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రభుత్వ కోటా కింద చేర్చితే తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆశపడ్డ తల్లిదండ్రులకు నిరాశే మిగులుతోంది. పేద విద్యార్థులకు అయ్యే ఖర్చును ప్రభుత్వం చెల్లించకుంటే విద్యార్థుల తల్లిదండ్రులే అందజేయాల్సి ఉంటుందన్న అంగీకారపత్రాలు తీసుకుంటున్నారని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వ కోటా కింద వచ్చే పేద విద్యార్థుల తల్లిదండ్రులతో లెటర్‌ ప్యాడ్‌పై ఒప్పంద సంతకాలు తీసుకుంటుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రవేశాలను ఉపసంహరించుకుంటున్నారు. పశ్చిమ ప్రకాశంలో పెద్దఎత్తున ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలున్నాయి. ఒక్క మార్కాపురం పట్టణంలోనే మొత్తం మూడు కార్పొరేట్‌ పాఠశాలలు, ఇతర ప్రైవేటు పాఠశాలలు కలిపి 40 వరకు ఉన్నాయి. 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించారా.. లేదా అనే దానిపై విచారణ చేయాల్సిన విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా మొదటి తరగతిలో తమ పిల్లల ప్రవేశాల కోసం తాము ప్రయత్నిస్తున్నా, సరైన సమాచారం చెప్పేవారే కరవయ్యారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎంఈవోలూ పట్టించుకోక..

పశ్చిమ ప్రకాశంతో పాటు మార్కాపురం, పరిసర పట్టణాల్లో నిబంధనలు సక్రమంగా అమలు చేయించాల్సిన ఎంఈవోలు సైతం మెతకవైఖరి అవలంబిస్తున్నారు. దీంతో తాము అన్యాయానికి గురవుతున్నామని పలువురు పేద విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. సమస్య అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సరిగా స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఎంఈవో బి.రాందాస్‌ నాయక్‌ను వివరణ కోరగా, నిబంధనల ప్రకారం 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాల్సిందేనన్నారు. దీనిపై ఎలాంటి ఆంక్షలు పెట్టినా సంబంధీకులపై చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి వారికి దీనిపై వివరిస్తామన్నారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని