logo

ఉరిమిన కరవు..

జిల్లాలో గతేడాది తీవ్ర కరవు పరిస్థితులు అలముకున్నాయి. కీలక తరుణంలో వరుణుడు ముఖం చాటేయడంతో ఖరీఫ్‌ పంటలు ఎండిపోగా, రబీ కూడా ఆశాజనకంగా సాగలేదు.

Published : 21 Jun 2024 03:14 IST

కన్నెత్తి చూడని నాటి వైకాపా పాలకులు

ఈనాడు, ఒంగోలు: జిల్లాలో గతేడాది తీవ్ర కరవు పరిస్థితులు అలముకున్నాయి. కీలక తరుణంలో వరుణుడు ముఖం చాటేయడంతో ఖరీఫ్‌ పంటలు ఎండిపోగా, రబీ కూడా ఆశాజనకంగా సాగలేదు. పొలం పనుల్లో నిమగ్నమై ఉండాల్సిన రైతులు, కూలీలు ఆకాశం వైపు చూడాల్సిన దుస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలో ఆదుకోవాల్సిన వైకాపా ప్రభుత్వం మీనమేషాలు లెక్కించింది. పంట నష్టపోయిన పొలాల వైపు కూడా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడకున్నారు. 

నిలువునా ఎండిన పంటలు...: గతేడాది జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు ఖరీఫ్‌ సీజన్‌లో సాధారణ వర్షపాతం 366 మిల్లీ మీటర్లకు గాను 300.7 మి.మీ మాత్రమే కురిసింది. ఆగస్టులో ఏకంగా 70.9 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో ఖరీఫ్‌ సాగులో ప్రధాన పంటలైన పత్తి, కంది తదితర పంటలకు సమయం మించిపోగా, మిర్చి, జొన్న, మొక్కజొన్న, తదితర ఇతర పంటలు నిలువునా ఎండిపోయాయి. దీంతో ఖరీఫ్‌లో 5.36 లక్షల ఎకరాలకు గాను 3 లక్షల ఎకరాలు మాత్రమే సాగయ్యింది. సెప్టెంబరులో విస్తారంగా వర్షాలు కురవడంతో పొగాకు, శనగ, మిర్చి, వరి తదితర పంటలకు రైతులు మొగ్గుచూపారు. తీరా విత్తు, నారు నాటే సమయానికి వర్షం జాడ లేకుండా పోయింది. ఏడాదిలో జిల్లా సాధారణ వర్షపాతం 841 మిల్లీ మీటర్లుంటే.. అందులో అక్టోబరులోనే 200 మి.మీ వర్షపాతం ఉంటుంది. అలాంటిది గతేడాది అక్టోబరులో 50 మి.మీ కూడా నమోదు కాలేదు. అక్టోబరు, నవంబరు, డిసెంబరు మూడు నెలల్లో కలిపి 214 మిల్లీ మీటర్లు నమోదయినా అప్పటికి చాలా పంటలకు అదును దాటిపోయింది. దీంతో చాలామంది రైతులు పంటలు సాగు చేయలేకపోయారు.

ఇవీ ప్రభావిత మండలాలు...: గతేడాది జిల్లాలో తీవ్ర కరవు నెలకొన్ని 20 మండలాల్లో యర్రగొండపాలెం, దోర్నాల, కురిచేడు, ముండ్లమూరు, దర్శి, పొదిలి, మర్రిపాడు, పెద్దారవీడు, హెచ్‌ఎంపాడు, వెలిగండ్ల, పీసీపల్లి, సీఎస్‌పురం, పామూరు, ఎస్‌ఎన్‌పాడు, ఒంగోలు, కొత్తపట్నం, పుల్లలచెరువు ఉన్నారు. ఓ మోస్తరు కరవు మండలాల్లో దొనకొండ, కొనకనమిట్ల, అర్థవీడు, బేస్తవారపేట, రాచర్ల, గిద్దలూరు, కొమరోలు, కనిగిరి, ఎన్‌జీపాడు, చీమకుర్తి, కొండపి ఉన్నాయి. ఈ 31 మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదు కావడంతో 50 శాతానికి పైగా పంట నష్టం వాటిల్లింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని