logo

వైకాపా నేతల మనో వైకల్యం

అధికారం అండ చూసుకుని వైకాపా నేతలు అయిదేళ్లూ పేట్రేగిపోయారు..పైసలొచ్చే ఏ మార్గాన్నీ వదల్లేదు.. ప్రకృతి వనరుల దోపిడీ..సంక్షేమం గారడీతో రూ.కోట్లకు పడగలెత్తారు. ఆఖరికి విధి వంచితుల జీవితాలతో ఆటలాడారు.

Updated : 23 Jun 2024 04:43 IST

మూడువేల దివ్యాంగ పత్రాల సృష్టి 
విధి వంచితుల పేరిట రూ.లక్షల దోపిడీ

అర్థవీడు, న్యూస్‌టుడే: అధికారం అండ చూసుకుని వైకాపా నేతలు అయిదేళ్లూ పేట్రేగిపోయారు..పైసలొచ్చే ఏ మార్గాన్నీ వదల్లేదు.. ప్రకృతి వనరుల దోపిడీ..సంక్షేమం గారడీతో రూ.కోట్లకు పడగలెత్తారు. ఆఖరికి విధి వంచితుల జీవితాలతో ఆటలాడారు. పైసలిచ్చిన వారికే నకిలీ ధ్రువపత్రాలందించి దండుకున్నారు. ఎవరికైనా శారీరక, మానసిక వైకల్యం ఉంటుందని..వైకాపా నేతలది మనో వైకల్యానికి ఈ పరిణామం అద్దంపడుతోందని పశ్చిమ ప్రాంతవాసులు ఈసడించుకుంటున్నారు. ఇది సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది.
వికలాంగ ధ్రువపత్రాల మంజూరులో వైకాపా నేతల చేతివాటం ప్రదర్శించారు. ఈ పత్రాలు ఇప్పించేందుకు వారు లబ్ధిదారుల నుంచి రూ.వేలల్లో నగదు వసూళ్లకు పాల్పడ్డారు.  మార్కాపురం జిల్లా వైద్యశాల వేదికగా ఈ నకిలీ బాగోతం మూడేళ్లుగా సాగినా..ప్రశ్నించే నాథుడే కరవయ్యారు. ఇటీవల నూతనంగా గెలుపొందిన తెదేపా ఎమ్మెల్యేలతో జిల్లా అధికారుల పరిచయ కార్యక్రమం ఒంగోలులోని కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ నేపథ్యంలో పశ్చిమ ప్రాంతంలో పెద్దఎత్తున నకిలీ వికలాంగ ధ్రువపత్రాలతో అనర్హులు పింఛన్లు పొందుతున్నారని, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అక్కడి అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో నకిలీ బాగోతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

గిద్దలూరు పరిధిలో...

పశ్చిమ ప్రాంతంలోని గిద్దలూరు నియోజకవర్గ పరిధిలో 3 వేల నకిలీ వికలాంగ పత్రాలను సృష్టించారు. అర్థవీడు మండలంలోని కేవలం ఒకే గ్రామంలో 60 మందికి పైగా అనర్హులు వీటితో పింఛన్లు పొందుతున్నట్లు సమాచారం. ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలకు పైగా వసూళ్లు చేసి ఈ తతంగం నడిపించారు. మార్కాపురం జిల్లా వైద్యశాలలోని ఓ విభాగం నుంచి ఎక్కువ మొత్తంలో నకిలీ ధ్రువపత్రాలు మంజూరైనట్లు తెలుస్తోంది.  ఎలాంటి శారీరక లోపం లేకపోయినా 40 శాతం నుంచి 50 శాతం వైకల్యం ఉన్నట్లు జారీ చేశారు. అక్కడ వైద్యుడి వద్ద ఉన్న ఓ సహాయకారి వైకాపా నాయకులతో చేతులు కలిపి..ఒక్కో పత్రానికి రూ.15 వేల వరకూ నగదు తీసుకుని తతంగం నడిపినట్లు తెలుస్తోంది. పార్టీ నాయకులు ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.50 వేలు తీసుకుని కేవలం  రూ.15 వేలు వైద్య విభాగంలో వారికి ముట్టజెప్పి మిగతావి తమ జేబుల్లో వేసుకున్నారు. దీనిపై కొత్త ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం విచారణ చేపడితే అక్రమార్కుల బాగోతం వెలుగులోకి వస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని