logo

ఆ ఖాకీ.. వైకాపా చేతిలో లాఠీ

ఆయనో పోలీసు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌. ఎన్నికల బదిలీల్లో భాగంగా నెల్లూరు జిల్లా నుంచి బదిలీపై యర్రగొండపాలెం నియోజకవర్గానికి వచ్చారు. తన బాధ్యతలను నిజాయతీగా నిర్వహించాల్సిన ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరించారు.

Updated : 23 Jun 2024 04:41 IST

చిత్తూరు పుష్పకు అనుకూలంగా విధులు
అనుమతి లేకుండా డ్రోన్‌ కెమెరాతో దృశ్యాలు
వైకాపాకు కొమ్ముకాసేలా నిబంధనలు బేఖాతరు

న్యూస్‌టుడే, యర్రగొండపాలెం: ఆయనో పోలీసు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌. ఎన్నికల బదిలీల్లో భాగంగా నెల్లూరు జిల్లా నుంచి బదిలీపై యర్రగొండపాలెం నియోజకవర్గానికి వచ్చారు. తన బాధ్యతలను నిజాయతీగా నిర్వహించాల్సిన ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. కీలకమైన ఎన్నికల వేళ పూర్తిగా దారి తప్పారు. నిబంధనలకు నిలువునా పాతరేస్తూ అప్పటి అధికార పార్టీకి తొత్తులా మారారు. వారు చెప్పిందే వేదం అన్నట్లు నడుచుకున్నారు. నాటి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడమే పనిగా మలుచుకున్నారు. నియోజకవర్గ ఎన్నికల అధికారి ఆదేశాలు, సూచనలు కూడా పట్టించుకోకుండా స్వామిభక్తి ప్రదర్శించారు. వైకాపా నాయకులకు ఎనలేని వినయ విధేయతలు చూపారు. వారి చేతిలో లాఠీగా పేరు తెచ్చుకున్నారు.

ఆర్వోకు సహాయ నిరాకరణ...: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో రెవెన్యూ, పోలీసు అధికారుల పాత్ర కీలకం. నిబంధనలు నిక్కచ్చిగా అమలు చేయాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అక్రమాలు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా చూడాల్సి ఉంది. ఈ క్రమంలో నియోజకవర్గ ఎన్నికల ఆధికారి ఆదేశాలను పాటిస్తూ సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాల్సి ఉంది. సదరు సీఐ మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా పనిచేశారు. ఆర్వో ఆదేశాలు ఏమాత్రం లెక్క చేయలేదు. సరికదా పూర్తిగా సహాయ నిరాకరణ చేశారు. తన సొంత నిర్ణయాలతో ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాశారు. వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నా పట్టించుకోలేదు. సరికదా వారికి మరింత వత్తాసు పలికారు. ఈ విషయాలపై ఆర్వో చాలాచార్లు పిలిచి అసహనం వ్యక్తం చేసినా ఖాతరు చేయకుండా ఆయన తన స్వామిభక్తిని కొనసాగించారు. 

‘ప్రైవేట్‌’తో కలిసి పీఎస్‌ల వద్దకు...: పోలింగ్‌ వేళ కేంద్రాల వద్ద డ్రోన్‌ ఎగురవేసేందుకు ఎలాంటి అనుమతులు లేవు. కానీ, సదరు సీఐ మాత్రం ప్రైవేట్‌ డ్రోన్‌తో పాటు ఆపరేటర్‌ను నియమించుకున్నారు. అతన్ని వెంటబెట్టుకుని పోలింగ్‌ కేంద్రాల వద్ద వీడియోలు తీయించారు. ప్రధానంగా తెదేపాకు పట్టున్న గ్రామాల్లో ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. అనుమతులు లేకున్నా ఎందుకు డ్రోన్‌ ఎగురవేస్తున్నారంటూ సీఐని ఎన్నికల ఆర్వో ప్రశ్నించినా పట్టించుకోలేదు. ఉన్నతాధికారులకు చెప్పే తాను డ్రోన్‌ ఎగురవేస్తున్నట్లు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఆర్వో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. వై.పాలెం మండలం మొగుళ్లపల్లెలోని పోలింగ్‌ కేంద్రం వద్ద ఎక్కువ సేపు డ్రోన్‌ ఎగురవేశారు. పోలింగ్‌ రోజు ఉదయం ఇదే గ్రామంలో వైకాపా నాయకులు కరపత్రాలను రోడ్లపై వెదజల్లారు. తెదేపా నాయకులు అభ్యంతరం తెలపడంతో పోలింగ్‌ ఆలస్యంగా మొదలైంది. ఇంత జరుగుతున్నా.. సదరు సీఐ అక్కడే ఉన్నా ఇవేమీ పట్టించుకోలేదు. వై.పాలెం పీఎస్‌ నం.19 వద్దా డ్రోన్‌ను ఎగురవేసి దృశ్యాలు చిత్రీకరించారు.

ఎంపీ అభ్యర్థి చేతికి ఫుటేజీ...! 

సార్వత్రిక ఎన్నికల వేళ డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించిన వీడియోలు, ఫొటోలు సదరు సీఐ ఎవరికి పంపించారనేది ప్రశ్నార్థకంగా మారింది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి, చిత్తూరు ‘పుష్ప’కు ఈ ఫుటేజీ, చిత్రాలు చేరవేసినట్లు సమాచారం. ఎన్నికల్లో నిబంధనలకు నిలువునా పాతరేసి సహకరించినందుకు గాను సదరు నేత నుంచి భారీగా ముట్టినట్లు విమర్శలున్నాయి. పోలింగ్‌ రోజున వీరభద్రాపురంలో వివాదం చోటుచేసుకుంది. ఆర్వోకు, సీఐకి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంలోనూ సీఐనే సదరు వైకాపా అభ్యర్థి వెనుకేసుకొచ్చారు. ఆర్వోపై ఏకంగా బెదిరింపులకు దిగారు. ఇక్కడ ఓ స్టేషన్‌లో పనిచేసే ఎస్సైని గుప్పిట్లో పెట్టుకుని ఎన్నికల వ్యవహారాలు, ప్రైవేట్‌ పంచాయితీలు అంతా తానై సదరు సీఐ సాగించారు. నెల్లూరు జిల్లా నుంచే ఎన్నికల విధులకు వచ్చిన ఓ తహసీల్దార్‌తో స్నేహంగా మెలుగుతూ ఎన్నికల అధికారికి సహాయ నిరాకరణ చేసేలా మంత్రాంగం నడిపారు. వీరిద్దరి వ్యవహారంపై ఆర్వో పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ చూసీచూడనట్లు ఉండాలంటూ అటునుంచి ఉచిత సలహాలు రావడంతో మిన్నకుండిపోయారు. వీరి వ్యవహారశైలితో తీవ్ర ఒత్తిడికి గురైన ఆర్వో.. చివరికి ఎన్నికల సంఘం వేటుకు గురికావాల్సి వచ్చింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని