logo

కలెక్టర్‌గా తమీమ్‌ అన్సారియా

ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్‌గా తమీమ్‌ అన్సారియా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Updated : 23 Jun 2024 04:40 IST

దినేష్‌ కుమార్‌ , తమీమ్‌ అన్సారియా

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్‌గా తమీమ్‌ అన్సారియా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2015 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అన్సారియా.. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీకాకుళం కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు అన్నమయ్య జిల్లా జేసీగా పని చేశారు. ఈమె భర్త 2012 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన మనజీర్‌ జిలానీ సామూన్‌ ప్రస్తుతం శ్రీకాకుళం కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. గత ప్రభుత్వం ఇద్దరినీ ఒకేసారి శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేసింది. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్‌గా పని చేసిన కాలంలో ఆమె పారిశుద్ధ్యం మెరుగుకు పటిష్ఠ చర్యలు తీసుకున్నారు. ఎన్నికల నియమావళి సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకున్నారు.  

అల్లూరి జిల్లాకు దినేష్‌ కుమార్‌ బదిలీ...: ప్రస్తుత కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ అల్లూరి సీతారామరాజు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. తమిళనాడుకు చెందిన ఆయన జిల్లాల విభజన తర్వాత 2022 ఏప్రిల్‌ 4న ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సులకు ప్రాధాన్యమిచ్చారు. ఈ క్రమంలో కొన్నిసార్లు నిబంధనలకు విరుద్ధంగానూ వ్యవహరించారనే విమర్శలున్నాయి. ఒంగోలు నగరానికి చెందిన 22 వేల మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాల పంపిణీ నిమిత్తం ఎన్‌.అగ్రహారం, వెంగముక్కపాలెం, యరజర్ల గ్రామాల వద్ద సుమారు 500 ఎకరాలు సేకరించారు. అక్కడ బహిరంగ మార్కెట్‌లో ఎకరా ప్రస్తుతం రూ.15 లక్షలుంటే.. అందుకు రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు చెల్లింపులు చేశారు. ఆయా గ్రామాల్లో ఎక్కువ శాతం మంది రైతులు వైకాపా అనుకూలురు కావడం గమనార్హం. సార్వత్రిక ఎన్నికల ముగింట ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు, సీఎంవో ఒత్తిడి మేరకు ఈ దస్త్రానికి ఆయన పచ్చ జెండా ఊపారు. సేకరించిన స్థలంలో లేఅవుట్‌కు రూ.21 కోట్ల మేర నిధులతో అంచనా వేయగా, టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. నిబంధనల మేరకు ఖరారు చేయకుండానే అత్యవసరం పేరిట ఇతర వ్యక్తులకు గుత్తేదారు బాధ్యతలు అప్పగించారు. ఈ విషయంలో వైకాపా నేతలు చెప్పిందే వేదం అన్నట్లు నడుచుకున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని