logo

ఊళ్లను పంచుకున్న దొంగల ముఠా

పశ్చిమ ప్రకాశం వైకాపా ప్రభుత్వ హయాంలో గత అయిదేళ్లగా భూ అక్రమాలకు అడ్డాగా మారింది. ప్రత్యేకించి మార్కాపురంలో ప్రభుత్వ భూములతో పాటు, అసైన్డ్‌ భూములను వైకాపా నాయకులకు రెవెన్యూ అధికారులు కట్టబెట్టేశారు.

Updated : 23 Jun 2024 11:30 IST

అయిదేళ్లపాటు ‘తమ్ముడి’ భూదందాలు
అవినీతితో అంటకాగిన తహసీల్దార్లు, వీఆర్వోలు
17 గ్రామాల్లో 378 ఎకరాలకు ఎసరు

పశ్చిమ ప్రకాశం వైకాపా ప్రభుత్వ హయాంలో గత అయిదేళ్లగా భూ అక్రమాలకు అడ్డాగా మారింది. ప్రత్యేకించి మార్కాపురంలో ప్రభుత్వ భూములతో పాటు, అసైన్డ్‌ భూములను వైకాపా నాయకులకు రెవెన్యూ అధికారులు కట్టబెట్టేశారు. ఛోటా నయీమ్‌గా పేరు పడిన ఆ నియోజకవర్గ మాజీ ప్రజాప్రతినిధి తమ్ముడు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కొందరు అధికారులు ఆయనతో అంటకాగారు. దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు.. వీరంతా సెటిల్‌మెంట్లు, బెదిరింపులతో కంట పడిన భూములను అనుచరుల పేరుపై ఆన్‌లైన్‌లో ఎక్కించేసుకున్నారు. మొత్తం పదిహేడు గ్రామాల్లోని 378 ఎకరాలకు ఎసరు పెట్టారు.

న్యూస్‌టుడే: ఒంగోలు గ్రామీణం, మార్కాపురం 

కుటుంబానికి రాసేసుకున్న వీఆర్వో...

 ప్రభుత్వ భూములను వైకాపా నాయకులకు ఆన్‌లైన్‌ చేసిన విషయం వెలుగులోకి రావడంతో అప్పటి జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ స్పందించారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టరు సరళావందనాన్ని విచారణాధికారిగా నియమించారు. 2021 జూన్‌లో విచారణ చేపట్టిన ఆమె.. ఏకంగా 578 దస్త్రాలు స్వాధీనం చేసుకుని క్షుణ్నంగా పరిశీలించారు. అప్పటి రాయవరం వీఆర్వో సుబ్బారెడ్డి విలువైన ప్రభుత్వ భూమిని తన కుటుంబ సభ్యుల పేరిట అక్రమంగా ఆన్‌లైన్‌ చేసుకున్నట్లు గుర్తించి నివేదిక సమర్పించారు. అదే ఏడాది జులై 13న ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

భూ అక్రమాలపై విచారణ చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టు పూర్వపు ప్రత్యేక కలెక్టర్‌ సరళావందనం (పాత చిత్రం)

అక్రమం అని తేల్చినప్పటికీ... 

విచారణ చేపట్టి భూ అక్రమాలు నిజమని అధికారులు తేల్చారు. నివేదికలూ అందజేశారు. అక్రమార్కులపై చర్యలూ తీసుకున్నారు. అక్రమంగా ఆన్‌లైన్‌ చేసిన భూమిని తొలగించి పూర్తిగా రద్దు చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఆ మేరకు ఆన్‌లైన్‌లోని అడంగల్‌తో పాటు 1బీ రాకుండా రెడ్‌ మార్క్‌లో పెట్టారు. ఆ తర్వాత అలానే వదిలేశారు. మళ్లీ ఏడాది తర్వాత వైకాపా నాయకుల ఒత్తిడి మేరకు రెడ్‌ మార్కు తొలగించారు. దీంతో అక్రమం అని తేల్చిన 378 ఎకరాల భూమి ఇంకా వారి పేర్ల పైనే కొనసాగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టి ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అవసరం ఉంది.

పదకొండు మంది వీఆర్వోలపై ఒకేసారి వేటు... 

తదనంతరం చేపట్టిన విచారణలో మరో వీఆర్వో మాకం కోటయ్య, ఏఆర్‌ఐ గోపి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించి సస్పెండ్‌ చేశారు. చివరికి అక్రమాల డొంకంతా కదిలి మరికొందరి ప్రయేమం వెలుగు చూసింది. విశ్రాంత తహసీల్దారు విద్యాసాగరుడుపై ఏకంగా క్రిమినల్‌ కేసు నమోదు చేయగా.. 2021 ఆగష్టు 31న అక్రమాలకు బాధ్యులైన 11 మంది వీఆర్వోలతో పాటు ఒక గ్రామ సర్వేయర్‌ను అధికారులు సస్పెండ్‌ చేశారు. ఒప్పంద కంప్యూటర్‌ ఆపరేటర్‌ను విధుల నుంచి శాశ్వతంగా తొలగించారు. ఈ విషయం రెవెన్యూ ఉద్యోగుల్లో తీవ్ర కలకలం రేపింది. ఒకేరోజు ఇంత మందిపై వేటు వేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. 

 వైకాపా నేతలకు అధికారులు కట్టబెట్టిన మార్కాపురం- కంభం రహదారిలోని అసైన్‌మెంట్‌ భూమి

ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టేశారు... 

2020-21లో మార్కాపురం మండలంలోని 17 గ్రామాల్లో భూదందా సాగింది. మొత్తం 702 ఎకరాలు ఆన్‌లైన్‌ నమోదు చేయగా.. అందులో 378.89 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇతరులకు కట్టబెట్టారు. భూపతిపల్లిలో 29.76 ఎకరాలు, బడేఖాన్‌పేట 0.02, మాల్యవంతునిపాడులో 4.01, నికరంపల్లి 0.41, జమ్మనపల్లి 15.18, కొలభీమునిపాడు 0.68, గజ్జలకొండ 19.73, శివరాంపురం 5.66, గొగులదిన్నే 14.37, మార్కాపురం 10.45, ఇడుపూరు 77.08, రాయవరం 65.13, బొడపాడు 2.08, పెద్ద యాచవరం 45.03, చింతగుంట్ల 89.30 ఎకరాల చొప్పున రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్నీ వైకాపా నాయకులు, వారి కుటుంబ సభ్యులు, రెవెన్యూ సిబ్బంది తమ కుటుంబ సభ్యుల పేరిట అక్రమంగా ఆన్‌లైన్‌ చేసుకున్నారు. ఈ క్రమంలోనే అక్రమాలకు పాల్పడిన అప్పటి వీఆర్వోలు ఎస్‌.శ్రీనివాసరెడ్డి, కుందురు రాజశేఖర్‌రెడ్డి, జి.శ్రీనివాసరెడ్డి, వై.గోవిందరెడ్డి, ఎస్కే.కాశీంవలి, వై.కాశీ ఈశ్వరరెడ్డి, కాశీరెడ్డి, ఐ.చలమారెడ్డి, డి.మస్తాన్‌వలి, ఎం.రామచంద్రరావు, పి.మల్లికార్జునరావు, చింతగుంట్ల గ్రామ సర్వేయర్‌ ఎం.విష్ణు ప్రసన్నకుమార్‌ను సస్పెండ్‌ చేశారు. దస్త్రాలన్నీ అక్రమంగా ఆన్‌లైన్‌ చేసిన ఒప్పంద ఉద్యోగి పి.నాగరాజును శాశ్వతంగా ఉద్యోగం నుంచి  తొలగించారు.

మార్కాపురం మండలం దరిమడుగులోని ఈ పాడుపడిన బావిని కూడా  వైకాపా  నాయకులకు అధికారులు ఆన్‌లైన్‌ చేశారు... 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని