logo

అంతా సిద్ధం.. వరుణుడిదే ఆలస్యం

జిల్లాలోని రైతులు దుక్కులు దున్ని వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో నాట్లు వేసేందుకు వారు సంసిద్ధమవుతున్నారు. ఈ నెలలో మొదటి వారంలో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షం పడటంతో వారిలో ఆశలు చిగురించాయి.

Published : 24 Jun 2024 05:02 IST

ఖరీఫ్‌కు పూర్తయిన దుక్కులు
కంది, పత్తి వేసేందుకు ఆసక్తి

ట్రాక్టర్‌తో పొలం దున్నుతున్న రైతు

పొదిలి, న్యూస్‌టుడే: జిల్లాలోని రైతులు దుక్కులు దున్ని వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో నాట్లు వేసేందుకు వారు సంసిద్ధమవుతున్నారు. ఈ నెలలో మొదటి వారంలో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షం పడటంతో వారిలో ఆశలు చిగురించాయి. అయితే ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

జూన్‌ నెల మూడో వారం వచ్చినా వర్షాలు లేకపోవడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. సకాలంలో వానలు పడుతాయి..నాట్లు వేద్దామని పొలాలు సిద్ధం చేసిన వారికి దిక్కుతోచడం లేదు. వారం రోజులుగా ఎండతీవ్రత పెరిగింది. జూన్‌ సాధారణ వర్షపాతం 47.3 మి.మీ. కాగా మొదటి వారంలో 74 మి.మీ.వర్షపాతం పడింది. ఆ సమయంలో పొలాలు దున్ని సిద్దం చేశారు. ప్రసుత్తం వానలొస్తే పొలాలు పదునెక్కితేనే రైతులు విత్తు వేసేందుకు అవకాశం ఉంటుంది.

పొగాకు, కందికి మంచి ధరలతో..

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 90 వేల హెక్టార్లకు పైగా పంటలు సాగవుతుంటాయి. ఇందులో అత్యధికంగా 70 నుంచి 75 వేల హెక్టార్లలో కంది వేస్తుంటారు. కొన్నిచోట్ల అంతరపంటగా సజ్జ పండిస్తారు. ప్రస్తుతం కంది, పొగాకుకు మంచి ధరలు ఉండటంతో ఎక్కువమంది వీటి సాగుకు మొగ్గు చూపుతున్నారు. మార్కాపురం, యర్రగొండపాలెం ప్రాంతంలో రైతులు పత్తి సాగుచేస్తుంటారు. మరికొంతమంది జొన్న, నువ్వు, పెసర, సజ్జలు ఖరీఫ్‌లో వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే సచివాలయాల్లో రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. మార్కాపురం నియోజకవర్గంలో ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 30 వేల హెక్టార్లు. పొదిలి మండలంలో 8816 హెక్టార్లు, కొనకనమిట్ల మండలంలో 8966 హెక్టార్లు, మార్కాపురంలో 7280 హెక్టార్లలో పంటలు సాగుచేస్తారు. వాతావరణం అనుకూలంగా ఉండటంతో రైతులు ఎన్నో ఆశలతో సాగుకు సిద్ధమవుతున్నారు.


సాగునీటి కాలువలు లేక..

పది రోజులుగా వర్షం పడకపోవడంతో రైతులు డీలా పడ్డారు. ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో సాగునీటి కాలువలు లేకపోవడంతో కేవలం వర్షాధారంపై ఆధారపడే ఖరీఫ్‌ సాగవుతోంది. సకాలంలో వర్షాలు పడి వాతావరణం అనుకూలిస్తేనే అంతంతమాత్రంగా పంటలు పండుతాయి. అలాంటిది అదును దాటిపోయినా, మధ్యలో వర్షాలు పడకపోయినా దిగుబడులు తగ్గి అప్పుల పాలయ్యే ప్రమాదం ఉంది. వారం రోజులుగా ఎండ మే నెలను తలపిస్తోంది. ఉక్కపోత, వేడికి ప్రజలు అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడినా జిల్లాలో మాత్రం జాడ కనిపించడం లేదు. గతేడాది వర్షాలు లేక నష్టపోయిన రైతులు ఈ ఏడాది సకాలంలో పడాలని రైతులు కోరుతున్నారు. పలు చోట్ల వరుణదేవుడికి పూజలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని