logo

ఆర్టీసీ స్థలంలో పుష్ప పాగా!

ఆర్టీసీకి చెందిన రూ.కోట్ల విలువైన స్థలాన్ని లీజు పేరిట కారుచౌకగా వైకాపా నేతకు కట్టబెట్టారు సంస్థ అధికారులు. ఎన్నికలకు ముందు ఫిబ్రవరి నెలలో జరిగిన ఈ చీకటి ఒప్పందం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

Published : 24 Jun 2024 05:29 IST

కారుచౌకగా పదిహేనేళ్ల లీజుకు...
తాజాగా వెలుగులోకి వచ్చిన చీకటి ఒప్పందం
న్యూస్‌టుడే - ఒంగోలు నగరం

లీజు స్థలాన్ని పరిశీలిస్తున్న జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్‌ తదితరులు

ర్టీసీకి చెందిన రూ.కోట్ల విలువైన స్థలాన్ని లీజు పేరిట కారుచౌకగా వైకాపా నేతకు కట్టబెట్టారు సంస్థ అధికారులు. ఎన్నికలకు ముందు ఫిబ్రవరి నెలలో జరిగిన ఈ చీకటి ఒప్పందం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

నిబంధనలకు విరుద్ధంగా అగ్రిమెంట్‌...

ఒంగోలు ఆర్టీసీ డిపోకు పశ్చిమం వైపున సైకిల్‌ స్టాండ్‌ను ఆనుకుని... రూ.కోట్ల విలువ చేసే దాదాపు 1978 చదరపు అడుగుల స్థలం ఉంది. నగరం నడిబొడ్డున ఉండడంతో వాణిజ్యపరంగా దీనికి చాలా డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో ఆ స్థలం తమకు అద్దెకు ఇవ్వాలని కోరుతూ... గత ఏడాది ఇద్దరు వ్యాపారులు సంస్థ ఈడీకి దరఖాస్తు చేసుకున్నారు. తిరుపతి నుంచి జిల్లాకు దిగుమతై పుష్పగా పేరున్న ప్రజాప్రతినిధి కన్ను దానిపై పడింది. అంతే, తిరుపతిలోని తమకు చెందిన సీఎంఆర్‌ ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ ద్వారా దరఖాస్తు చేయించారు. పదిహేను సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చేలా ఈ ఏడాది ఫిబ్రవరిలో అగ్రిమెంట్‌ చేయించారు. జోన్‌-3 ఈడీ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. తొలుత సంప్రదించిన వారిని కాదని... నిబంధనలకు విరుద్ధంగా 2039 వరకు సదరు సంస్థ ఆధీనంలో ఉండేలా ఒప్పందం జరిగింది. 

కేవలం రూ.2.40 లక్షలకే ధారాదత్తం!

అంత విలువైన స్థలానికి ఏడాదికి రూ.2.40 లక్షలు మాత్రమే చెల్లించేలా అగ్రిమెంట్‌ చేసుకున్నట్లు సమాచారం. తరువాత సదరు సంస్థ... మరొకరికి ఆ స్థలాన్ని పెద్ద మొత్తానికి సబ్‌ లీజుకు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వారు అక్కడ రెస్టారెంట్‌ ఏర్పాటుకు పనులు చేపడుతుండడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌... ఆదివారం ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అక్కడి వారి నుంచి వివరాలు సేకరించారు. విలువైన స్థలాన్ని లీజు పేరిట అక్రమంగా... వైకాపా నేత కుమారుడికి చెందిన సంస్థకు కట్టబెట్టారని ఆరోపించారు. వీరు మరొకరికి సబ్‌ లీజుకు ఇచ్చారన్నారు. తక్షణం లీజు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. విషయాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ దృష్టికి తీసుకువెళ్లారు. అధికారులు సైతం ఈ విషయమై పూర్తి వివరాలు వెల్లడించడం లేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని