logo

కోటి ఆశలతో మీ కోసం...

ఈ అంకెలు చూస్తే... వచ్చిన అర్జీలను వచ్చినట్లుగా అధికారులు ఎంతలా పరిష్కరించేశారో అనిపిస్తుంది కదా. తరచి చూస్తేనే ఇందులోని గుట్టు అర్థమవుతుంది. వచ్చిన అర్జీలను తొంభై రోజుల్లో పరిష్కరించాలి.

Published : 24 Jun 2024 05:35 IST

స్పందన ఉసురు తీసిన వైకాపా
కూటమి రాకతో కొంగొత్త ఉత్సాహం
న్యూస్‌టుడే - ఒంగోలు గ్రామీణం

జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం

గత అయిదేళ్లలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ‘స్పందన’కు  వచ్చిన అర్జీలు: 68,548

వీటిలో పరిష్కరించినవి: 68,012...   పురోగతిలో ఉన్నవి: 446

అంకెలు చూస్తే... వచ్చిన అర్జీలను వచ్చినట్లుగా అధికారులు ఎంతలా పరిష్కరించేశారో అనిపిస్తుంది కదా. తరచి చూస్తేనే ఇందులోని గుట్టు అర్థమవుతుంది. వచ్చిన అర్జీలను తొంభై రోజుల్లో పరిష్కరించాలి. పెండింగ్‌లో ఉంటే కారణమేంటని ఉన్నతాధికారులు ప్రశ్నిస్తుంటారు. ఆ సమస్య లేకుండా... మండల స్థాయిలో తహసీల్దార్లు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయికి వెళ్లకుండానే ఏదో ఒక సాంకేతిక కారణం చూపడం, మరికొన్ని పరిశీలించకుండానే సమస్య పరిష్కరించినట్లు నమోదు చేయడం చేశారు. దీంతో కాగితాల్లో పరిష్కారమైనట్లు ఉన్నా... క్షేత్రస్థాయిలో మాత్రం సమస్య కొనసాగుతూనే ఉంది. వీటిలో తొంభై శాతానికి పైగా భూ సంబంధిత సమస్యలే కావడంతో బాధితులు మండల, డివిజన్, జిల్లా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

ఆర్‌ఎస్‌ఆర్‌ కంటే అధికంగా నమోదు...

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆర్‌ఎస్‌ఆర్‌ కంటే వెబ్‌ల్యాండ్‌లో 41,695 ఎకరాల విస్తీర్ణం అధికంగా నమోదైనట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. సర్వే నంబర్ల వారీగా చూస్తే... ఉండాల్సిన విస్తీర్ణం కంటే ఆన్‌లైన్‌లో ఎక్కువ నమోదైన వారు బ్యాంకుల నుంచి పంట రుణాలు ఎక్కువగా పొందితే... విస్తీర్ణం తక్కువగా నమోదైన వారు ఆ తప్పు సరిచేయాలని తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గత వైకాపా ప్రభుత్వం రెవెన్యూ దస్త్రాల స్వచ్ఛీకరణ దిశగా సదస్సులు, గ్రామ సభలు నిర్వహించినా... అర్జీల స్వీకరణే తప్ప, బాధితులకు ఒరిగిందేమీ లేదు. సగానికిపైగా మండలాల్లో భూ దస్త్రాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. సాంకేతిక కారణాలతో కొన్ని పొరపాట్లు దొర్లగా... అక్రమార్కులకు వంత పాడుతూ కొందరు అధికారులు, సిబ్బంది లేని భూమి ఉన్నట్లుగా దస్త్రాల్లో సృష్టించారు. ఈ క్రమంలో రికార్డులూ తారుమారు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు నిర్వహించిన స్పందనకు భూ సంబంధిత సమస్యలే అధికంగా వచ్చాయి. క్షేత్రస్థాయిలో రెవెన్యూ యంత్రాంగం విచారణ చేపట్టక... అవే సమస్యలు నేటికీ కొనసాగుతున్నాయి.


బాధితుల్లో భరోసా..

ఇప్పటి వరకు ఉన్న స్పందన కార్యక్రమాన్ని... కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ‘మీ కోసం - ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ’గా పేరు మార్చింది. ఆ మేరకు సోమవారం నుంచే జిల్లా కేంద్రంతో పాటు, ఆర్డీవో, మండల కార్యాలయాల్లో అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఇప్పటికే ప్రకటించారు. కొత్త ప్రభుత్వంలోనైనా తాము ఎదుర్కొంటున్న భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని బాధితులు కొండంత ఆశతో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని