logo

ప్రజాభీష్టానికే తొలి ప్రాధాన్యం

అయిదేళ్ల వైకాపా పాలనలో విధ్వంసమే తప్ప జిల్లాకు ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదు. తెదేపా హయాంలో చేపట్టిన పలు ప్రాజెక్టులను నిలిపేసి... వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన రక్షిత పథకాలనూ గాలికొదిలేశారు.

Updated : 24 Jun 2024 05:53 IST

కూటమి ఎమ్మెల్యేల అంతరంగమిది
న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం, టంగుటూరు, మార్కాపురం పట్టణం, గిద్దలూరు పట్టణం, కనిగిరి, చీమకుర్తి 

అధ్వాన స్థితిలో టిడ్కో ఇళ్లు 

అయిదేళ్ల వైకాపా పాలనలో విధ్వంసమే తప్ప జిల్లాకు ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదు. తెదేపా హయాంలో చేపట్టిన పలు ప్రాజెక్టులను నిలిపేసి... వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన రక్షిత పథకాలనూ గాలికొదిలేశారు. నిర్వాసితుల సమస్య పరిష్కరించకుండా... చుక్కనీరు తేకుండా వెలిగొండ పూర్తయ్యిందంటూ నిస్సిగ్గుగా ప్రారంభించారు. గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయి రైతులు రెండేళ్ల పాటు పంటలు కోల్పోయినా పట్టించుకున్న దాఖలాలు లేవు. మార్కాపురం ప్రత్యేక జిల్లా ఆకాంక్షనూ చిదిమేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసి జిల్లాలో అడుగు పెట్టిన కూటమి ఎమ్మెల్యేలను ‘న్యూస్‌టుడే’ పలకరించింది. పాలనలో వారి తొలి ప్రాధాన్యమేంటన్నది ఇలా వివరించారు.


అమృత్,  టిడ్కో ఇళ్లు...

జనార్దన్, ఒంగోలు

ఒంగోలు నగర వాసులకు ప్రతి రోజూ తాగునీరందించాలన్న లక్ష్యంతో గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ.123 కోట్లతో అమృత్‌ పథకం పనులకు శ్రీకారం చుట్టాô. పైపులైను కోసం మరో రూ.పది కోట్లు మంజూరు చేయించాం. ఎనభై శాతం మేర పనులు పూర్తిచేసినా... తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం కావాలనే వీటిని నిర్లక్ష్యం చేసింది. పేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న ఉద్దేశంతో ఆరు వేల టిడ్కో ఇళ్లు మంజూరు చేసి... అప్పట్లోనే ఎనభై శాతం పనులు పూర్తిచేశాం. వీటిని సైతం వైకాపా సర్కారు నిర్లక్ష్యం చేసింది. లబ్ధిదారుల ఇబ్బందులనూ పట్టించుకోలేదు. ఇళ్లు రద్దు చేసిన వారికి... వారి వాటా మొత్తమూ తిరిగి చెల్లించలేదు. ఈ రెండు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తిచేస్తాం. యువగళం పాదయాత్ర 2,200 కి.మీ.లు పూర్తయిన సందర్భంగా ఒంగోలులో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు శిలాఫలకం ఆవిష్కరించారు. ఆ పనులూ చేపడతాం.


ప్రతి ఇంటికీ  రక్షిత జలాలు...

ఉగ్రనరసింహారెడ్డి కనిగిరి

కనిగిరి అంటేనే ఫ్లోరైడ్‌ సమస్యే అందరికీ గుర్తుకువస్తుంది. ఈ జలాలు తాగి ఇప్పటికే పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. కాళ్లూ చేతులు వంకర్లు తిరిగి నేటికీ వందలాది మంది మంచంలో ఉన్నారు. అందరికీ రక్షిత జలం అందించే దిశగా నాటి తెదేపా ప్రభుత్వ హయాంలో మంజూరైన సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు నిర్మాణాన్ని... గత వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. కనిగిరి పట్టణంలో ఇంటింటి కుళాయి ఏర్పాటుకు రూ.100 కోట్లతో చేపడుతున్న పథకం పనులు... వైకాపా నాయకుల కమిషన్ల కక్కుర్తితో ఆగిపోయాయి. ఈ రెండింటిని పట్టాలెక్కించి పూర్తిచేయిస్తాం. జల్‌ జీవన్‌ మిషన్‌ కింద రూ.1290 కోట్లతో చేపట్టనున్న వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులో భాగంగా... వెలుగొండ నుంచి పైపులైన్‌ ద్వారా జలాలు రప్పిస్తాం. నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలోని 442 గ్రామాల్లో ప్రతి ఇంటికి శుద్ధజలాలు అందించి... ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటాను.


గుండ్లకమ్మకు పూర్వ వైభవం 

విజయ్‌ కుమార్‌ ఎస్‌.ఎన్‌. పాడు

గుండ్లకమ్మ ప్రాజెక్టును గత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో... ఏడాదిన్నర వ్యవధిలో రెండు గేట్లు కొట్టుకుపోయాయి. నీరంతా వృథాగా సముద్రం పాలవ్వడంతో ఆయకట్టు రైతులు రెండేళ్ల పాటు పంట కోల్పోయారు. మత్స్యకారులకూ జీవనోపాధి దూరమైంది. తెదేపా హయాంలో అక్కడ చేపట్టిన పర్యాటక ప్రాజెక్టునూ దెబ్బతీశారు. ఈ నేపథ్యంలో గేట్లు పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారించి... జలాశయానికి పూర్వవైభవం తీసుకువస్తాం. దిగువన నాగులుప్పలపాడు మండల పరిధిలో రెండు చోట్ల ఆగిన చెక్‌డ్యామ్‌ల నిర్మాణం పూర్తిచేస్తాం. చీమకుర్తిలోని రామతీర్థం జలాశయం అవుట్‌ఫాల్‌ గేట్లకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి లీకేజీని అరికడతాం. ఇందులో పూడిక తొలగించి నిల్వ సామర్థ్యం పెంచేందుకు నాటి తెదేపా ప్రభుత్వ హయాంలో పరిశీలన చేపట్టారు. దానిపై మళ్లీ దృష్టి సారిస్తాం.


వెలిగొండ,  మార్కాపురం జిల్లా...

నారాయణ రెడ్డి మార్కాపురం

పశ్చిమ ప్రాంతవాసుల ఆకాంక్ష అయిన మార్కాపురం ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు కృషి చేస్తాం. జిల్లా సాధనకు గతంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా... ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు ఆందోళనలు చేపట్టినా వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఏడాది మార్కాపురం వచ్చిన సందర్భంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆయనతో ఈ విషయం చర్చించి త్వరితగతిన జల్లా ఏర్పాçËయ్యేలా చర్యలు తీసుకుంటాం. వెలిగొండ ప్రాజెక్టు ఈ ప్రాంత ప్రజల ఆశాదీపం. అయిదేళ్ల పాలనలో వైకాపా సర్కారు నిధులివ్వకుండా నాటకమాడింది. నిర్వాసితుల పునరావాసం సమస్యనూ సంక్లిష్టం చేసింది. పూర్తికాని ప్రాజెక్టును నిస్సిగ్గుగా ప్రారంభించింది. వెలిగొండ పూర్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినందున ప్రత్యేక దృష్టి సారిస్తాం.


వసతిగృహాలపై   ప్రత్యేక దృష్టి...

స్వామి, కొండపి

గత అయిదేళ్లుగా దళితులకు తీరని అన్యాయం జరిగింది. తెదేపా ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేసిన సంక్షేమ పథకాలను సైతం వైకాపా పాలకులు రద్దు చేశారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. వసతి గృహాలను సైతం విస్మరించడంతో వాటిలో కనీస వసతులు కొరవడ్డాయి. విద్యార్థులు చెల్లించాల్సిన కాస్మొటిక్‌ ఛార్జీలు సైతం చెల్లించలేదు. వారు కంటి నిండా నిద్రపోయే పరిస్థితీ వసతిగృహాల్లో లేదు. మంత్రిగా ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాను. కొండపి నియోజకవర్గానికి వస్తే ఈ పరిధిలోని ఆరు మండలాల్లో మురుగు పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. వైకాపా పాలనలో కనీస నిర్వహణ లేక పల్లె, పట్టణమన్న తేడా లేకుండా అన్ని రహదారులూ నిండా గుంతలతో శిథిలావస్థకు చేరాయి. అత్యవసరంగా వీటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం.

సింగరాయకొండలోని  కళాశాల బాలుర వసతి గృహం


ఆగిన ప్రాజెక్టులు  పట్టాలెక్కిస్తాం...

అశోక్‌రెడ్డి, గిద్దలూరు 

గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రాచర్ల మండలం రామన్నకత్తువ నుంచి గిద్దలూరు పట్టణానికి తాగునీరందించేందుకు... ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ నుంచి రూ.89.24 కోట్ల నిధులు మంజూరయ్యాయి. తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సాగర్‌ జలాలు అందించేందుకు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ.320 కోట్లు మంజూరు చేయిచి... పనులకు శంకుస్థాపన చేశాం. వైకాపా సర్కారు ఈ పనులను రద్దు చేసింది. ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, పురపాలక శాఖా మంత్రుల దృష్టికి ఈ అంశాలు తీసుకెళ్లి... ఆయా పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసి నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కరిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు